దోస్త్.. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్
‘స్నేహమంటే సొల్లు కబుర్లు కాదోయ్ సమష్టి విజయాలోయ్’ అంటున్నారు నగర యువత. ఇద్దరు దోస్తులు కలిస్తే కాలక్షేపం ఎలా చేయాలా అని ఆలోచించే రోజులు పోయి.. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించే రోజులొచ్చాయి. చేయి చేయి కలుపు.. మనదే కదా గెలుపు అంటూ విభిన్న రంగాల్లో ‘ఫ్రెండ్లీ’ సక్సెస్‌ను సాధిస్తున్నారు. మరీ ముఖ్యంగా నగరంలో యువ‘విజయాల’తో వర్ధిల్లుతున్న నాలుగు రంగాలను పరిశీలిస్తే వాటిని నడిపిస్తున్నది స్నేహమే అనిపిస్తుంది.
- ఎస్. సత్యబాబు
సాయమేరా స్నేహితం
బంజారాహిల్స్‌లో నివసించే చైతన్య.. నిరుపేద విద్యార్థులకు చేయూత నిద్దాం అనుకున్నప్పుడు ఆయన స్నేహితులు అయూబ్, కిరీట్, సుగుణ వెంటనే ‘మేం రెడీ’ అన్నారు. ఈ స్నేహితుల టీం 2007 లో పాషనేట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేమున్నామని చేయూతనిస్తోంది. ‘ఇంగ్లిష్, లీడర్‌షిప్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలని టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రామ్ ప్రారంభించాం. వారాంతంలో చదువు చెప్పేందుకు బంజారాహిల్స్, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి వంటి పలు ప్రాంతాల్లో 10 ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నాం. సిటీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మా వాలంటరీ నెట్‌వర్క్ ఉండాలని మా ఆశయం’’ అంటున్నారు చైతన్య. ఈ ప్రయత్నంలో స్నేహితుల ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు.
సాహసం చిరునామా
సాహసం చేయరా స్నేహితుడా అని ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటున్న ప్రోత్సాహంతో.. సిటీలో అడ్వెంచర్ టూర్స్ అద్భుతంగా సక్సెస్ అవుతున్నాయి. బోయిన్‌పల్లిలో ఉండే ఫరీదా ఒకప్పుడు చెట్టు కూడా ఎక్కి ఉండరు. కానీ ఇప్పుడు హ్యాపీగా చెట్టులెక్కగలను.. గుట్టలెక్కగలను అంటోంది. ‘మా ఫ్రెండ్స్ లక్ష్మి, దత్తా, శర్వానంద్, రఘు, శ్వేతతో కలసి నెలకోసారైనా శామీర్‌పేటలోని రాక్ క్లైంబింగ్‌కు రెగ్యులర్‌గా వెళుతుంటాం. అలాగే అనంతగిరి హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటాం. ఒంటరిగా అయితే కష్టమే. మా ఫ్రెండ్స్‌తో కలసి ఎన్నోసార్లు ట్రెక్కింగ్ ఎంజాయ్ చేశాం. బోలెడంత కాన్ఫిడెన్స్ పొందాం’’ అంటారు ఫరీదా.
అదే ఇం‘ధనం’
కరెన్సీని సైతం కాగితం ముక్కలా విసిరిపారేసే ధైర్యం ఇస్తుంది స్నేహం. సరిపడా ఆదాయాన్ని ఇస్తున్న ఉద్యోగాన్ని వదిలేసిన రోహిత్ పడియాలకు ఆ ధైర్యాన్నిచ్చింది స్నేహమే. కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదనుకున్న శ్రీ శాక్రేతో కలసి దేశంలోనే మొదటి ఆన్‌లైన్ నర్సరీని గమ్లా డాట్ కామ్ పేరుతో ప్రయోగా త్మక వ్యాపారం చేపట్టే సాహసం చేయించిందీ మెత్రీ బంధమే. ‘కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే మనోధైర్యం ఉండాలి, ఒక్క స్నేహితుడే దాన్ని ఇవ్వగలడు’ అంటారు రోహిత్.
విజయ రహస్యం
షార్ట్ ఫిల్మ్ సక్సెస్‌కు స్క్రిప్టులు, కెమెరాలు, ఆర్టిస్టులు.. వీటికన్నా మిన్నగా అర్థం చేసుకునే స్నేహాలు కావాలంటారు మణికొండలో నివసించే అజయ్. షార్ట్ ఫిల్మ్ అయినా.. షార్ప్‌గా రావాలంటే అభిరుచులు కలసిన దోస్తీ అవసరమని అనిరుధ్, అజయ్, అశోక్ వర్ధన్, పడమటలంక నవీన్, నానిలు నిరూపిస్తున్నారు. వీరి బృందం నుంచి లక్కీ, నౌ దో గ్యారా, పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు వంటి షార్ట్ హిట్స్ వచ్చాయి. వీరిలో అనిరుధ్ ఇటీవల సినిమా చాన్సు కూడా కొట్టేశాడు. మరిన్ని విజయాలవైపు నడుస్తున్న ఈ మిత్ర బృందం.. స్నేహబంధాన్ని బలోపేతం చేసుకుంటోంది.