కట్ చేస్తే.. కళాఖండం
చిన్నప్పుడు కాగితాల పడవలతో వర్షాకాలం ఎంజాయ్ చేశాం. కాస్త పెద్దయ్యాక కాగితం విమానాలను గాలిలో గింగిరాలు కొట్టించాం. కాలేజీకొచ్చాక రాకెట్లు చేసి.. అమ్మాయిల జడకుచ్చుల్లోకి గురి చూసి కొట్టాం. పేపర్‌తో పూలు చేసి క్లాస్‌రూమ్ డెకరేషన్‌లో కటింగ్‌లు ఇచ్చాం. కాగితాలతో కెమెరాలు, విచిత్రాకృతులు ఎన్నో చేశాం. స్మార్ట్ యుగం వచ్చే సరికి ఇప్పుడవన్నీ మరచిపోయాం. కంప్యూటర్లు, ఫోన్లతో ఆడుకుంటున్న ఈ తరం పిల్లలకు పేపర్ క్రాఫ్ట్స్ మజాను రుచి చూపిస్తున్నారు దేవకిరణ్. ఇటీవల ఆయన నిర్వహించిన కిర్‌గామి (పేపర్ క్రాఫ్ట్) వర్క్‌షాప్‌లో పిల్లలే కాదు, పెద్దలూ హుషారుగా పాల్గొన్నారు. కాగితాలతో కళాఖండాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు.
ఇంట్లో మీ చిన్నారి చేతికి కత్తెర, కాగితం దొరికితే.. ఇళ్లంతా డస్ట్‌బిన్‌గా మారిపోతుంది. చిన్నప్పుడే కాదు కాస్త పెద్దయిన తర్వాత కూడా పిల్లలకు కత్తెర.. కాగితం కాంబినేషన్ క్రేజీగానే అనిపిస్తుంటుంది. దొరికిన కాగితం ముక్కను రకరకాలుగా కట్ చేస్తూ ఏదో రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని కాస్త ప్రోత్సహిస్తే.. అద్భుతమైన డిజైన్లు ఆవిష్కృతం అవుతాయంటున్నారు.. పేపర్ క్రాఫ్ట్ ఎక్స్‌పర్ట్ దేవకిరణ్. దీని ద్వారా విద్యార్థుల్లోని సృజనను వెలికి తీయవచ్చని చెబుతున్నారు.
ఇలాంటి పిల్లల కోసమే సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రె డ్ స్పేస్‌లో పేపర్ క్రాఫ్ట్ట్‌పై శిక్షణ ఇచ్చేందుకు రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు దేవకిరణ్. ఈ వర్క్‌షాప్‌లో చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు. తమ చేతుల్లో రూపుదిద్దుకున్న రకరకాల డిజైన్లు చూసి మురిసిపోయారు. తమ పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకూడదని భావిస్తున్న తల్లిదండ్రులు కూడా.. చిన్నారులను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు.
వందల రకాల డిజైన్లు..
మార్కెట్‌లో దొరికే గ్లేజ్, కైట్ పేపర్ తీసుకుని వాటిని తమకు కావాల్సిన డిజైన్‌తో సిజర్స్‌తో కట్ చేయడమే పేపర్ క్రాఫ్టింగ్. వీటితో ఇంట్లో డెకరేషన్ కోసం వాల్ డిజైనింగ్స్, హారాలు, చెట్లు, జంతువులు.. ఇలా రకరకాల ఆకృతులు కాగితాలతో రూపొందించవచ్చు. పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో వీటిని ప్రత్యేకంగా అలంకరించుకోవచ్చు. ‘ఒక్కో ఐటమ్ నుంచి వంద రకాల డిజైన్లు కూడా తయారు చేయవచ్చు. 8వ తరగతిలో పేపర్‌తో చిత్రాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు పిల్లలకు ఇందులో శిక్షణనివ్వడం సంతోషంగా ఉంద’ని ఆనందంగా చెబుతారు దేవకిరణ్. పేపర్ క్రాఫ్ట్ కూడా ప్రత్యేకమైన ఆర్ట్ అని చెప్పే ఆయన.. దీనివల్ల పిల్లలకు ఆనందం కలగటంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. పెద్దవాళ్లు దీన్ని ఉపాధిగా కూడా మలుచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
స్కిల్స్ పెరుగుతాయి..
‘నా కూతురు శ్రీనిధి ఇంట్లో కత్తెర పట్టుకుని పేపర్లతో ఓ యుద్ధమే చేస్తుంది. అందుకే తనకు పేపర్ క్రాఫ్ట్‌లో శిక్షణ ఇప్పించాలనుకున్నాను. తనతో పాటు నేనూ నేర్చుకుంటున్నా’ అని తెలిపారు గీతాంజలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో స్కిల్స్ డెవలప్ అవుతాయని చెబుతున్నారు స్రవంతి. అందుకే తన కూతురు వేదతో వర్క్‌షాప్‌నకు వచ్చానని తెలిపారు. ఇంకా ఎందరో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ వర్క్‌షాప్‌లో కాగితాలతో కుస్తీపడ్డారు. రంగుకాగితాలతో తమ చేతిలో తయారైన డిజైన్లను అపురూపంగా చూసుకున్న ఈ చిన్నారులు.. వాటిని పదిలంగా దాచుకుంటామంటున్నారు.
-దార్ల వెంకటేశ్వరరావు (రాంగోపాల్‌పేట్)