కళ్లు మాట్లాడతాయి.. నవ్వు మాట్లాడుతుంది.. ఆమె రూపం మాట్లాడుతుంది. కాని ఆమె మాట్లాడలేదు. అందమైన రూపాన్నిచ్చిన బ్రహ్మ.. అంతకు మించి ఎందుకనుకున్నాడో ఏమో.. నోటి మాటను ఆమె నొసటన రాయలేదు. అయితేనేం.. ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోస్తుంది. ప్రకటనల్లో భావాలు వర్షిస్తుంది. సిటీలో మోడల్‌గా రాణిస్తోన్న ఈమె ర్యాంప్‌పై ఎక్కడైనా కనపడితే.. శభాష్ అని పొగడాలనుకుంటున్నారా.. ఉపయోగం లేదు. ఎందుకంటే ఆమెకు వినపడదు కూడా.. అయితేనేం డెఫ్ అండ్ డంబ్ మోడల్‌గా సిటీలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సరిత (22) ఎన్ని అభినందనలకైనా అర్హురాలే.
..:: ఎస్.సత్యబాబు
ర్యాంప్‌పై మోడల్‌గా రాణించడమంటే ఆషామాషీ కాదు. రూపం ఒక్కటే సరిపోదు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. చదువుంటే చాలదు. కొరియోగ్రాఫర్స్, డిజైనర్స్ చెప్పింది అలా విని ఇలా అల్లుకుపోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మోడలింగ్ అంటే ప్రతిభావంతులైన సుందరాంగుల ప్రపంచం. అలాంటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది మాటరాని, వినలేని సరిత. చిన్ననాటి కలను నిజం చేసుకోవడానికి పెద్ద లోపాన్ని కూడా లెక్కచేయకుండా కృషి చేస్తోంది. ‘మాది వరంగల్. నాన్నది వ్యవసాయం. అమ్మ గృహిణి. మేం మొత్తం ఆరుగురు పిల్లలం’ అంటూ రాయడం మొదలు పెట్టింది సరిత (మా ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ ఇంటర్వ్యూ ఇచ్చింది) ఆమె చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... సారీ ఆమె రాతలోనే..
ఇంట్లో సగానికి పైగా డెఫ్ అండ్ డంబ్..
కారణం తెలియదు కానీ, మా ఆరుగురిలో ఇద్దరు సోదరులు, ఒక సోదరి కూడా నాలాగే మూగ, చెవిటి. మిగిలిన వారు బాగానే ఉన్నారు. అన్నయ్య తనలాగే డెఫ్ అండ్ డంబ్ అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా టీవీ చూసేదాన్ని. అందులో వచ్చే ఫ్యాషన్ చానెల్ నాకు బాగా నచ్చేది. అంతేకాకుండా టీనేజ్‌లో ఉండగా బాగుంటాననే ప్రశంసలు... అప్పుడే నాకు మోడలింగ్ చేయాలనిపించేది. అయితే నాకున్న లోపం వల్ల ఆ ఆశ తీరదు కదా అని బాధపడేదాన్ని. ఈ లోపాన్ని అధిగమించడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఇంటర్ పూర్తి చేశాను.
డెఫ్ మోడల్ కాంటెస్ట్..
అదే సమయంలో మూగ చెవుడు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా బ్యూటీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిసింది. ఎలాగైనా అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అందుకే అతి కష్టం మీద ఇంట్లోవాళ్లని ఒప్పించి హైదరాబాద్ వచ్చేశాను. నెట్‌లో కాంటెస్ట్‌కు అప్లయ్ చేసి, ప్రిలిమినరీస్‌లో సెలక్టయ్యాను. అన్ని దశలూ దాటాను. చివరికి మిస్ డెఫ్ ఆంధ్రప్రదేశ్‌గా సెలక్టయి, 2012లో ముంబైలో జరిగిన మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సైతం పాల్గొన్నాను. 22 మంది పార్టిసిపేట్ చేశారు. నాకు కిరీటం రాకపోయినా మంచి ఐడెంటిటీ వచ్చింది. ఆ తర్వాత అడపాదడపా ర్యాంప్‌వాక్ అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్‌గా టాలీవుడ్ మ్యాగజైన్ లాంచ్ సందర్భంగా ర్యాంప్‌వాక్ చేశాను. అలాగే ప్రింట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. అయితే రాష్ట్రస్థాయి బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన మిగిలిన పేజెంట్స్ విజేతలతో పోలిస్తే తక్కువ. నాకున్న సమస్యపై చాలా మంది సానుభూతి చూపిస్తున్నారే కాని.. అవకాశాలు ఇవ్వడం లేదు. ఏదేమైనా మోడలింగ్ కెరీర్‌లో ముందుకే వెళ్లాలనుకుంటున్నాను. ఎప్పటికైనా మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సత్తా చాటాలనుకుంటున్నాను.
ఇదీ మిస్ డెఫ్ ఇండియా కాంటెస్ట్ నేపథ్యం..
దేశంలో ఉన్న మాటరాని, వినలేని యువతుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి నిర్వహిస్తున్నవే మిస్ డెఫ్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లు. ఆరేళ్ల క్రితమే ప్రారంభమైనా.. ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో నడిచే డెఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మిగిలిన బ్యూటీ పేజెంట్స్‌కు భిన్నంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు ఎత్తు, అర్హతల విషయంలో పలు మినహాయింపులున్నాయి.
వీరి కోసం ఇంటర్‌ప్రిటర్స్ (సైన్ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకుని సాధారణ భాషలోకి తర్జుమా చేసే అనువాదకులు)ను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. రెండేళ్ల క్రితం ముంబైలోని బిర్లా మాతృశ్రీ సభాగృహలో డెఫ్ ఎక్స్‌పోలో భాగంగా నిర్వహించిన పోటీలో అప్పటి ఆంధ్రప్రదేశ్ తరఫున సరిత పాల్గొంది. ‘మూగవాళ్లకు మాతృభాష సైన్ లాంగ్వేజ్. దీనిపై చాలామందిలో అవగాహన లేదు. సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడడంలో పరిణితి సాధిస్తే డెఫ్ అనే ఆలోచన కూడా రాదు’ అంటారు ఎక్స్‌పో నిర్వాహకులు, పుట్టుకతో మూగవారైన అలోక్ కేజ్రీవాల్. పాఠశాలల్లో ఖరీదైన డిజిటల్ హియరింగ్ ఉత్పత్తులు అందుబాటులో లేవు.
అమెరికాలో అడ్వాన్స్‌డ్ వీడియో కాలింగ్ డివెజైస్ ఉన్నాయి అంటున్న అలోక్.. మాటలతో ఏకీభవిస్తారు ఈ పోటీలకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న మరో డెఫ్ అండ్ డంబ్ యువతి కాజల్ థావన్.. 2009లో మమతాసింగ్ అనే మూగ యువతి మిస్ డెఫ్ ఇండియాగా ఎన్నికై మిస్ డెఫ్ వరల్డ్ పోటీలకు సైతం ప్రాతినిథ్యం విహంచింది. అలాగే కనికా బాలి, అంకితాకుమారి.. వీరంతా మాట లేకున్నా మంత్రముగ్ధులను చేసే అందంతో కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు ఇప్పటిదాకా సరైన ప్రాతినిథ్యం లేదనే లోటును సరిత భర్తీ చేస్తోంది.
మాటరాని అందమిది
Published Mon, Feb 9 2015 6:20 AM | Last Updated on Thu, May 24 2018 2:36 PM
Advertisement