వరుణ యాగం చేద్దాం
రోడ్లన్నీ గుంతలు, ఈ వర్షం వల్లే.. ఓ డ్రైవరు
ఈ ముసురుకి బట్టలు ఆరవు.. ఓ గృహిణి
మా వీధి చెరువు లెక్క అయితది.. ఓ లోతట్టు కాలనీవాసి
చినుకు పడితే వణుకు పుడతది.. ఓ గుడిసెవాసి
ఆడుకోవడానికి లేదు, అంతా బురదే.. ఓ స్టూడెంట్
ఇంత చిన్న వర్షానికి ఎంత ట్రాఫిక్ జామ్.. ఓ ఉద్యోగి
ఎండాకాలంలో ఎంత ఎండైనా భరిస్తాం, శీతాకాలంలో ఎంత చలైనా సహిస్తాం. కానీ వర్షం మాత్రం మహాకష్టం ఈ మహానగరానికి. ‘ఈ వర్షాలు ఇక్కడ పడి ఏం లాభం ఊళ్లలో పడితే పంటలన్నా పండుతాయి’ అంటూ వరుణుడికి పాఠాలు చెప్పేస్తాం.
అందుకేనేమో ఆయన చినుకు విషయంలో కినుక వహిస్తుంటాడు. పాతికేళ్లు వెనక్కి వెళితే హైదరాబాద్‌లో విపరీతమైన నీటి కొరత ఉండేది. ఐదారు రోజులకోసారి అరకొరగా మంచినీటి సరఫరా జరిగితే జనం బంగారంలా నీటిని దాచుకునేవారు. ప్రతీ గల్లీలోనూ ట్యాంకర్ వస్తే ‘పానీ’పట్టు యుద్ధాలు జరిగేవి(ఇప్పటికీ కొన్ని చోట్ల అదే పరిస్థితి). బోర్లు పడక, గండిపేట నిండక, హిమాయత్‌సాగర్ చాలక హైదరాబాద్ నీటికష్టాలు పడుతుంటే ఆదుకోవడానికి మంజీరా ముందుకొచ్చింది. సింగూరుకి స్ట్రా వేసినట్టు హైదరాబాద్ తాగేస్తే, మళ్లీ నీటి కటకట రాకూడదని 200 కి.మీ దూరం నుంచీ కృష్ణమ్మని పిలిపించుకుంటున్నాం, దఫదఫాలుగా. అది కూడా అంచనాలకు సరిపోవని 300 కి.మీ నుంచి గోదావరిని రప్పించే ప్రయత్నం చేస్తున్నాం.
పాతికేళ్ల వరకూ నీటిఎద్దడి రాకూడదని ఒకటో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ముందుచూపుతో నిర్మించిన గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలు పెరుగుతున్న హైదరాబాద్ జనాభాకి సరిపోవన్నది మనందరికీ అర్థమయ్యే వాస్తవం. కానీ ఇప్పటి మన పాలకులకి ‘పంచవర్ష ప్రణాళికలే’ తప్ప, విస్తరిస్తున్న నగరానికి పాతికేళ్లకు సరిపడే దార్శనికత ఉందా? నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థనే ఇప్పటికీ వినియోగిస్తున్నాం.
వరద కాలువలు, నాలాలు, డ్రైనేజ్‌లు అన్నీ మూసీలో సంగమిస్తాయి. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించిపోవడానికి కారణం అధిక వర్షపాతమూ కాదు. తాగునీటి ఇక్కట్లకు కారణం వర్షాభావమూ కాదు. మొన్నటివరకూ వర్షాల్లేవు.. గండిపేట ఎండిపోతోంది అని నీరస పడిపోయిన మనని వరుణుడు కరుణించాడు. గత వారంలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే సాధారణం కంటే రెండు రెట్లు అధికం. ఈ సీజన్‌లో కురవాల్సిన వర్షంలో దాదాపు 80శాతం కురిసినట్టే. ఈ నీటితో జలాశయాలు నిండిన సంతోషం కొద్దికాలమే. మళ్లీ తిరిగి కృష్ణా, గోదావరులే శరణ్యం.
హైదరాబాద్‌లో కురవడానికి వర్షం కూడా భయపడుతుందేమోనని నా అనుమానం. నీరు పల్లమెరుగు మాట నిజమే కానీ హైదరాబాద్‌లో వర్షపు నీటికి ఎటు పోవాలో పాలుపోవడం లేదు. చెరువులోకి చేరదామంటే ఇళ్ల సందుల్లో పిల్లకాల్వలు మాయం. భూమిలోకి ఇంకుదామంటే కాంక్రీటు శ్లాబులు, గచ్చులమయం. డ్రైనేజీలోకి దూరదామంటే చెత్త అడ్డుతగులుతుంది. నాలాలోకి దూకుదామంటే కబ్జాసురులు కాపుగాస్తారు. అందుకే రోడ్డెక్కి వరదలా పోటెత్తాల్సి వస్తోంది.
అవసరానికంటే ఎక్కువ నీళ్లు వాడుతున్న మనం ప్రకృతి ప్రసాదించిన ఆ నీటిని తిరిగి భూమిలోకో జలాశయాల్లోకో పంపిస్తున్నాం. పంపించేందుకు ఏమీ చేయలేకపోయినా పర్లేదు అడ్డుతగలకపోతే చాలు. వర్షం బాగా కురిసినంత మాత్రాన నీటి నిల్వలు పెరిగిపోవు. నీటి సేద్యం కోసం ఓ సమగ్ర విధానం రూపొందించాలి. ఎండుతున్న బోర్లు భూగర్భ జలాల తీరు చెబుతున్నా ఇంకా ఇంకా లోతుకి బోర్లు దింపే మనం ఖర్చుకి వెనుకాడం కానీ, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కోసం పది పదిహేను వేల రూపాయల గురించి ఆలోచిస్తాం.
జీహెచ్‌ఎంసీ ఇంకుడు గుంతల గురించి ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి మరీ ఎన్నో కాలనీల్లో ఇంకుడు గుంతలు తవ్వించింది. కానీ నిర్వహణ సరిగ్గా లేక సిల్ఫ్ పిట్‌లో చెత్త పేరుకొని వాటి సామర్థ్యం దెబ్బతింటోంది. మన కాలనీలోని ఇంకుడుగుంతల బాధ్యత మనమే తీసుకోవచ్చు. అలా ఆదర్శంగా నిలిచే కాలనీలు హైదరాబాద్‌లో కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా.. హైదరాబాద్‌లో వర్షాకాలంలో కురిసే మొత్తం వర్షంలో సగంపైన నీటిని మనం తిరిగి వినియోగించవచ్చు. 4000 స్వ్కేర్ ఫీట్స్ విస్తీర్ణం ఉన్న అపార్ట్‌మెంట్ డాబామీద కురిసిన వానంతటినీ ఇంకుడు గుంతలోకి మళ్లిస్తే సంవత్సరానికి 2 లక్షల 40 వేల లీటర్ల నీటిని తిరిగి భూమిలోకి పంపించవచ్చు.
అదే 200 గజాల విస్తీర్ణంలో ఉన్న ఇంటి పైకప్పు నుండి 60 వేల లీటర్ల నీటిని సేద్యం చేయవచ్చు. ఇలా హైదరాబాద్ నగరంలోని ఇళ్ల డాబాల నుంచి వచ్చిన నీరంతా నేరుగా భూమిలోకి వెళితే మన భూగర్భ జలాలు ఎంత రీఛార్జీ అవుతాయో ఆలోచించండి. కేవలం భూగర్భ జలాలు రీచార్జి అవడమే కాదు. కొంతవరకూ రోడ్డు మీద ప్రవాహాలు, డ్రైనేజ్ పొంగిపొర్లటాలు తగ్గించవచ్చు. వర్షాన్ని నిందించడంకాదు, నీటి సేద్యం చేద్దాం.. ఇంకుడు గుంతలను కనీసం వచ్చే వర్షాకాలానికైనా ఏర్పాటు చేసుకుందాం.
కొత్తగా కట్టే ఇంటికో, అపార్ట్‌మెంటుకో అయితే అసలు అదనపు ఖర్చు లేకుండా చిన్న మార్పులతోనే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయవచ్చు. డాబాపై నీరంతా ఒక చోటికి వచ్చేలా సిమెంట్ చేయించి ఒకే పైప్ ద్వారా ఇంకుడు గుంతలోకి చేరేట్టు ఏర్పాటు చేయిస్తే చాలు. ఈ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్ గోస్ గ్రీన్ వంటి సంస్థలు సిద్ధంగా ఉంటాయి. ప్రతీ డాబాపై కురిసే వానని ఇలా మనం సేద్యం చేయగలిగితే మన నగరానికి జలకళ వచ్చేస్తుంది.