
పట్టు దారాలు
పట్టు వస్త్రాలు కట్టుకుంటే వచ్చే లాభమేమిటి? అందంగా కనిపించడం కాసేపు పక్కనబెడితే.. పట్టు వస్త్రాలు శరీరాన్ని చలికాలంలో వెచ్చగా.. ఎండాకాలంలో చల్లగానూ ఉంచుతాయి. అయితే ఏంటి? అనొద్దు.. ఇలాంటివే అనేక మంచి లక్షణాలున్న పట్టు సూపర్ మెటా మెటీరియల్ అంటున్నారు పర్‌డ్యూ శాస్త్రవేత్తలు. పది నుంచి 20 మైక్రాన్ల మందం ఉండే పట్టుపోగుల్లో అతిసూక్ష్మమైన పోగులు మరిన్ని ఉంటాయని.. నానో స్థాయిలో ఉండే నిర్మాణాల కారణంగా దీనికి అనేక అద్భుత లక్షణాలు చేకూరుతున్నాయని యంగ్ కిమ్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ లక్షణాలను పూర్తిగా అర్థం చేసుకుని అచ్చం ఇలాంటి నిర్మాణాలతో కృత్రిమ పదార్థాలను తయారు చేయవచ్చునని కిమ్ తెలిపారు.
వైద్యరంగంతోపాటు బయోసెన్సింగ్‌లోనూ ఈ మెటా మెటీరియల్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కాంతి కణాలను దాదాపుగా నిలువరించగల మెటామెటీరియల్స్‌ను ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసినప్పటికీ వాణిజ్యస్థాయిలో.. చౌకగా ఉత్పత్తి చేయడం మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పట్టు వంటి సాధారణ పదార్థం ద్వారా మెటా మెటీరియల్ లక్షణాలను సాధించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. అంతే కాకుండా పట్టు దారాలు ఒకచోట ఉండే వేడిని ఇంకోచోటికి తరలించేందుకు, అది కూడా అతితక్కువ నష్టంతో జరిగేందుకు ఉపయోగపడతాయని కిమ్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment