హార్ట్‌ఫీషియల్‌గా అమ్మానాన్నలుగా.. | Prevention Of Infertility Problem With Artificial Insemination | Sakshi
Sakshi News home page

హార్ట్‌ఫీషియల్‌గా అమ్మానాన్నలుగా..

Published Thu, Jul 25 2024 8:12 AM | Last Updated on Thu, Jul 25 2024 8:22 AM

Prevention Of Infertility Problem With Artificial Insemination

ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్‌ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్‌ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్‌ కట్టా శిల్ప సమాధానాలు.

  • ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా  పెరగడానికి కారణాలేమిటి?
    జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ  కెరియర్‌ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్‌ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.

    ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్‌లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.

  • సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?
    జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.

  • ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? 
    జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.

    రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.

  • ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?
    జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...

    ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్‌ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.

    ఐవీఎఫ్‌: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్‌ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్‌. దీనికే ‘టెస్ట్‌ట్యూబ్‌ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్‌ట్యూబ్‌’లో ఫలదీకరణం చేస్తారు.

    ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్‌ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్‌ చేస్తారు.

ఐసీఎస్‌ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌ (ఐసీఎస్‌ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్‌ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్‌ విత్‌ డోనార్‌ ఎగ్‌), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్‌ విత్‌ డోనార్‌ స్పెర్మ్‌), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్‌ విత్‌ డోనార్‌ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.

– డాక్టర్‌ కట్టా శిల్ప, కన్సల్టెంట్‌, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement