‘సైనిక పాఠశాల’తో పాఠం | lesson with Military school | Sakshi
Sakshi News home page

‘సైనిక పాఠశాల’తో పాఠం

Published Mon, Dec 22 2014 11:56 PM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు - Sakshi

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు

 విశ్లేషణ

 పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని తాలిబాన్ మట్టుబెట్టడం ప్రపంచాన్ని కలచివేసింది. బ్రిటిష్ వలస పాలన నుంచి ఉపఖండానికి వారసత్వంగా అందిన అలజడి విశ్వానికి బెడదగా మారి చాలా కాలమైంది.
 ఆ అలజడినే ఇప్పుడు అమెరికా పోషిస్తోంది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్‌లలో ఉగ్ర కార్యకలాపాలకు ఊతమిచ్చిన అగ్రదేశాలు, మరో పక్క వారికి వ్యతిరేకంగా సైనిక వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. కశ్మీర్, పాక్, అఫ్ఘాన్, అమెరికా, ఇరాక్‌లలో దాడులు, న రమేధం వీటి పరిణామమే. పెషావర్ పాఠశాల మీద దాడి వాటి కొనసాగింపే.
 
 ‘పాకిస్తాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాలలో చదువుతున్న 132 మందిని దండెత్తి చంపిన ముష్కరులు (తాలిబాన్ ఉగ్రవాదులు) ఇస్లామ్ ధర్మానికే శత్రు వులు. ఈ నీచమైన చర్యకు పాల్పడినవారు మానవ జాతికే శత్రువులు, వీళ్లు అల్లాకు శత్రువులు’.
 - నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి: (16.12.2014)

 ‘ప్రజలందరి రక్తం ఒక్కటే. అది హిందువుదైనా, ముస్లిందైనా, క్రైస్తవుడిదైనా- ఏమతమైనా శాంతినే కోరుకుంటుంది. రక్తపాతం ఇస్లాం ధర్మానికే వ్యతిరేకం’    
- తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ: (18-12-2014)

 పాక్ సైన్యం అమెరికాతో మిలాఖత్ అయి తమ కుటుంబాలను హతమా రుస్తున్నందుకు ప్రతీకారంగా ఈ పని చేశామని మతోగ్రవాద సంస్థ తాలిబాన్ ఉన్మాదులు ప్రకటించుకున్నారు. వాయవ్య ప్రాంతంలోని పెషావర్ సైనిక పాఠ శాలలో చదువుకుంటున్న ముక్కుపచ్చలారని చిన్నారులను చంపిన తరువాత తాలిబాన్ చెప్పిన కారణమిది. ఈ దుర్మార్గం భారత ఉపఖండ దేశాల ప్రజలనే గాక,  ప్రపంచ దేశాల పౌర సమాజాలను కూడా కలచివేసింది. ఉన్మాదానికి సరి హద్దులూ, వాస్తవాధీన రేఖలూ ఉండవు. చరిత్రలో దాని జాడ కూడా సుదీర్ఘమై నదే. అన్ని దేశాల, అన్ని మతాల ధర్మసూత్రాలూ శాంతిని, సౌమనస్యాన్నే ప్రబోధిస్తున్నప్పుడు మత ఘర్షణలు ఉన్మాదరూపం ఎందుకు ధరిస్తున్నాయి? ఆసియా ఖండానికీ, భారత ఉప ఖండానికీ తాజా ‘పెషావర్ ఘటన’ చెబుతున్న పాఠం ఏమిటి?
 
వలస పాలకులు మిగిల్చిన సమస్య
 భారత్, పాకిస్తాన్  విభజనకోసం, ఆ రాజకీయాల కోసం బ్రిటిష్ వలసపాల కులూ, అధికార తాపత్రయంలో ఉభయ మతాలకు చెందిన నాయకులూ రేపిన చిచ్చు ఉపఖండంలో ఈరోజు దాకా ఆరలేదు. ఆయుధ వ్యాపారం కోసం యుద్ధ రాజకీయాలు నడుపుతున్న ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఆ చిచ్చు ఆరకుండా జాగ్రత్తపడుతున్నారు. అందు లో భాగమే తాలిబాన్ సృష్టి. తొలుత ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాద పాలక వర్గాలు అఫ్ఘానిస్థాన్‌లో సోవియెట్ పలుకుబడిని దెబ్బకొట్టడం కోసం అక్కడి సెక్యులర్ (మతాతీత లౌకిక) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ముందు ముజా హుదీన్‌ల పేరిట, ఆ తరువాత తాలిబాన్ పేరిట సెక్యులర్ వ్యతిరేకశక్తులకు డబ్బు, మారణాయుధాలిచ్చి సాకుతూ వచ్చారు. ఫలితంగానే అఫ్ఘానిస్తాన్‌లోని సెక్యులర్ ప్రభుత్వం కూలిపోయింది. ఇంత జరిగినా తమకొచ్చే దీర్ఘకాలిక రాజ కీయ ప్రయోజనంగానీ, సొంత ప్రభుత్వ స్థాపన గానీ సాధ్యపడదని నిర్ధారిం చుకోవడమే కాకుండా, తమను ఆంగ్లో-అమెరికన్లు ‘కరివేపాకు’లా వాడుకుం టున్నారని తాలిబాన్ గ్రహించింది. సామ్రాజ్యవాద పాలకులు కూడా, తాలి బాన్ దీర్ఘకాలంలో ఎదురు తిరిగి తమకే ‘ఏకు మేకవు’తారని వారిపైనే యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమైనారు. దాని ఫలితంగానే 2002 సెప్టెంబర్ 11న కొత్త నాటకానికి తెరలేచింది.  అదే - అమెరికాలోని వాణిజ్య కేంద్రమైన భారీ జంట సౌధ సముదాయంపై పౌర విమానాలతో జరిగిన దారుణ ఘటన. ఇందుకు బాధ్యులెవరై ఉంటారన్న వెతుకులాటలో తమకు తాజాగా శత్రువులుగా మారిన తాలిబాన్‌నూ, ఇరాక్‌లో సెక్యులర్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సద్దాం హుస్సేన్‌నూ ఆంగ్లో-అమెరికన్లు ‘టార్గెట్’గా పెట్టుకుని, వారిని హతమార్చే వ్యూహరచనకు దిగారు. నిజానికి తాలిబాన్ అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా పెంచి పోషించిన శక్తే. కాగా ‘ట్విన్ టవర్స్’ కూల్చివేతకు ఎవరు సూత్రధారులో ఇప్ప టిదాకా తేల్చలేకపోయారు. దానిపైన అమెరికన్ సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాత మూర్ తీసిన చిత్రం (‘‘9/11’’) మనకు తెలియని రహస్యాల్ని బయట పెట్టింది. చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త, ప్రపంచ వ్యవహారాల విశ్లేషకుడు ప్రొఫెసర్ నోమ్ చామ్‌స్కీ ‘‘9/11’’ దుర్ఘటనపైన ఆ పేరుతోనే ఒక గ్రంథం రాశాడు. ఆ దుర్ఘటన నిర్వహణ తీరును ఒకే ఒక్క వాక్యంతో తేల్చాడు: ‘ఈ దుర్ఘటనకు (సుమారు 3,000 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గానికి) సంబంధించిన నిజాలను పూర్తిగా చరిత్ర నుంచి తొలగించడం జరిగింది’ (ఫ్యాక్ట్స్ హేవ్ బీన్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రం హిస్టరీ). ఎందుకంటే, ఈ దుశ్చర్యకు తోడ్పడిన సాధన సంపత్తి అంతా - అమెరికా సైనిక శిక్షణ  కేంద్రమూ, నేరగాళ్ల ఆటస్థలం ఫ్లోరిడా నగరం నుంచే, స్థానిక అమెరికన్ విమానాల సమీకరణతో జరిగిందనేది మరచిపోరాదు. అంటే, ఇంటిదొంగ (అమెరికన్) దొరికిపో యాడు. అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ ‘ట్విన్ టవర్స్’పై విమానదాడికి ముందు ఎక్కడున్నాడు? మారుమూల ఒక ప్రాంతంలో ఎలా తలదాచుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.

 ట్విన్ టవర్స్ కూల్చివేత రహస్యం
 అందుకే అసలు దాడి రహస్యాన్ని తెలుసుకునేందుకు 1,500 మంది అమెరికన్ ప్రసిద్ధ భవన నిర్మాణపు ఇంజనీర్లు, వాస్తుశిల్పులూ, నిజనిర్ధారణ సంఘాలూ ఒక భారీ విచారణ సంఘంగా ఏర్పడి ‘ట్విన్ టవర్స్’ పతన కారణాలపైన సమగ్ర విచారణ జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టారు. మిరుమిట్లు గొలిపే నివేది కను ప్రపంచం ముందుంచారు. కాని దాన్ని అమెరికా పాలకులు పక్కన పెట్టే శారు. ఎందుకంటే అమెరికా పాలకులకు ఒక సిద్ధాంతం ఉంది - ‘సాధ్యమైతే దేశాలపైన చర్యకు అమెరికా ఇతర దేశాలను కలుపుకుని దిగుతుంది, ఒకవేళ దాడులు ఉమ్మడిగా సాధ్యపడకపోతే అమెరికా ఏకపక్షంగా చర్యకు దిగుతుంది’. మాజీ అధ్యక్షుడు క్లింటన్ దీనిని (1993) ప్రకటించాడు! ఇందుకొక సూత్రాన్ని బుష్ కనిపెట్టాడు: అమెరికా ఉగ్రవాదాన్ని మరచిపోండి, ‘ప్రపంచ ఉగ్రవాదం (టైజం)పై కత్తి కట్టడానికి అమెరికాతో చేతులు కలపాలి, లేదా కలపని దేశా లను దేశాధిపతులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తాం, జరిపే విధ్వంసకాండకు మీరు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది’ అని ప్రగల్భించాడు (‘న్యూయార్క్ టైమ్స్’ లో బుష్ ప్రకటన ప్రచురణ: 2001 సెప్టెంబర్ 4). అంటే ట్విన్ టవర్స్‌పై స్థాని కంగానే జరిగిన దాడికి వారం రోజుల ముందుగానే వెలువడిన బుష్ (జూని యర్) ప్రకటన ఇది. అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లపై అమెరికా వేట, తానుగా అల్లు కున్న ‘మిష’ ఆధారంగా అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లపై  యుద్ధాలు, లక్షలాది మంది అరబ్బు ప్రజలపై జరిపిన మారణకాండ అక్కడి నుంచే మొదలైనాయి. ఇంకా అఫ్ఘానిస్తాన్‌లోనూ, ఇరాక్‌లోనూ ‘నాటో’ కూటమి, దుష్టచతుష్టయం (యూరప్ దేశాలు సహా) జరిపిన దురాక్రమణలూ; అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లలో అమెరికా తైనాతీ ‘ప్రభుత్వాల’ ఏర్పాటు అందులో భాగమే. ‘ఉగ్రవాద’ మిషపైన కశ్మీర్ పక్కలో బల్లెంగా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా అఫ్ఘానిస్తాన్, ఆంగ్లో- అమెరికన్ సైనిక కూటమి ‘నాటో’ సైన్యాల తిష్ట కూడా ఆ క్రమంలోనిదే. అటు పాకిస్తాన్ సైన్యాన్ని ఇన్నాళ్లూ సాకుతూ వస్తూన్న ఆంగ్లో-అమెరికన్‌లను అక్కడే తాలిబాన్ ఎదిరించి డీకొనడమూ, అమెరికాకు వ్యతిరేకంగా తమతో కలసిరాని పాకిస్తాన్ పౌర ప్రభుత్వ పాలకులపైన, ఎదురొచ్చిన పాక్ పౌరులపైన తాలి బాన్ ఎదురుదాడులకు దిగడమూ, భీతావహులను చేయడం ఈ పరి ణామాలలో భాగమే. పెషావర్ పాఠశాల ఘటన ఆ క్రమంలోనిదే.

 మూడో శక్తికి చోటివ్వరాదు
 పాక్, చైనాలకు ఇండియా మిత్రదేశంగా ఉండటం ఆంగ్లో - అమెరికన్లకు ఇష్టం లేదు. అందుకే సంప్రదింపులకు భారత-పాకిస్తాన్ మధ్య అవకాశాలున్నా, వాటిని ఏదో ఒక రూపంలో చెదరగొట్టడం సామ్రాజ్యవాద పాలకుల లక్ష్యం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇండియా కేంద్రంగా కవ్వింపుతో నిర్వహించిన అఫ్ఘాన్ యుద్ధాలు, విస్తరణ చర్యలూ  మనకు  తెలుసు. ఫక్తూనిస్తాన్ ఏర్పడ కుండా భారత నాయకుల్ని బ్రిటన్ దువ్వుతూ వచ్చిన రహస్యమూ తెలుసు. అందువల్ల చరిత్ర పాఠాలు మరొక్కసారి చదువుకుని భారత్, పాకిస్తాన్ పాలకులు మూడో శక్తి ప్రమేయం లేకుండా నిరంతర సంప్రదింపుల ద్వారా జాగరూకులై స్వతంత్ర నిర్ణయాలు చేసుకుంటే ఉపఖండంలో  శాంతికి వీలుంది. ఉగ్రవాదాలకు, అగ్రవాద కుట్రలకు స్వస్తి చెప్పించవచ్చు. గతించిన నాటి క్రిస్టియన్-ముస్లిం పాలకుల మత యుద్ధాలకూ, సామాన్య క్రైస్తవ, ముస్లిం ప్రజాబాహుళ్య శాంతి ప్రయోజనాలకూ సంబంధం లేదు! అటు పాకిస్తాన్, ఇటు అఫ్ఘానిస్తాన్. ఈ రెండు దేశాలూ మనకు ఇరుగు పొరుగు. అఫ్ఘానిస్తాన్‌లో మన వాళ్లకు కార్పొరేట్ కాంట్రాక్టులు ఎరచూపి అమెరికా మనల్ని యుద్ధాల్లోకి దించే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే బ్రిటిష్ వాళ్ల నిష్ర్కమణ తర్వాత కశ్మీర్‌పై కన్ను వేసిన అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో 1948-49 నాటి ఫిర్యాదుల ఉపసంహరణ జరగనంత కాలం జోక్యం చేసుకునే విధానానికి అమెరికా వెరవదు గాక వెరవదు. అలాగే అఫ్ఘాన్‌ను ఆక్రమించి కూర్చున్నట్టే కశ్మీర్‌లో తలచుకున్నదే తడవుగా అఫ్ఘానిస్తాన్‌లోని ‘నాటో’ కూటమి సేనలను కశ్మీర్‌లోకి నడిపించడానికి కూడా అమెరికా వెనుకాడదు. పైగా ఇప్పుడు హమీద్ కర్జాయ్ పాలన ముగిసి,  అమెరికా ఆశీస్సులతో ఆష్రాఫ్ ఘనీ పాలన అఫ్ఘాన్‌లో కొనసాగుతోంది.

 భారత్-పాక్ చర్చలే కీలకం
 కనుక భారత-పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలు తమ మధ్య కశ్మీర్ సమస్యను మరిం త జటిలంగా మార్చుకోకుండా  ఉపఖండ శాంతి ప్రయోజనాల కోసం తక్షణం  చర్చల ప్రక్రియకు ప్రాణప్రతిష్ట చేయాలి. మూడో శక్తి ప్రమేయానికి తావు లేకుం డా అప్పుడే జాగ్రత్త పడగలరు. ఇది రెండు దేశాల ప్రజల సమస్య. నాయకుల పదవుల సమస్య కాదు. దీనిని గుర్తించాలి. అలాగే ఉభయ దేశాలలోని వివిధ మత ఛాందసవాదులకు కళ్లెం వేయడం ఉభయ దేశాల పాలకుల ఉమ్మడి ఎజెండాగా కూడా ఉండాలి. అన్నింటికీ మించి, బ్రిటిష్ వలస పాలన మిగిల్చిన ఈ కాష్టం ప్రచ్ఛన్నయుద్ధంతో మరోసారి భగ్గుమంది. దీనితో పాత సమస్యలు కొత్తరూపంలో వేధిస్తున్నాయి. పెషావర్ సైనిక స్కూలు బాలలపై జరిగిన హత్యాకాండ గానీ, అంతకు ముందు జరిగిన అనేక మారణహోమాలు వీటన్నిటి ఫలితాలే.
 (వ్యాసకర్త మొబైల్: 98483 18414)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement