ఓ సాయంత్రం.. తారామతి బారాదరిఆవరణలో అందమైన జంట.. ఆనందంగా ఊసులాడుకుంటూ వె ళ్తోంది. అక్కడక్కడా ఆగుతున్నారు. దగ్గరగా చేరి కంటి చూపులతో గుసగుసలాడుకుంటున్నారు. ఓసారి కూర్చుంటున్నారు. అకస్మాత్తుగా పరుగులు పెడుతున్నారు. నవ్వులను పంచుకుంటున్నారు. పువ్వులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వారిని చూసి ఎవరైనా అందమైన ప్రేమజంట అనుకుంటారు. ఆ జంటని ఎవరైనా దొంగచాటుగా ఫొటోలు తీయడం చూస్తే.. ఒళ్లు మండుద్ది. ‘ప్రైవసీని డిస్ట్రబ్ చేస్తున్నారు.. ఎవర్రా మీరు?’ అని వాయిస్ పెంచాలనిపిస్తుంది. అయితే ఆ జంటే అలా సీక్రెట్‌గా ఫొటోలు తీయమని వారిని పురమాయించారని తెలిస్తే..
..:: ఎస్.సత్యబాబు
అరేంజ్డ్ మ్యారేజ్ అయినంత మాత్రాన, ఇలా చూసి అలా ఓకే చేసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నంత మాత్రాన.. లవర్స్‌కు మాత్రమే దక్కే కొన్ని స్వీట్ నథింగ్స్ కోల్పోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం లవ్‌షూట్స్ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇవి కనీసం కొన్ని రోజులు లేదా గంటల పాటు ప్రేమికులుగా జీవించే అవకాశాన్ని యువతీ యువకులకు కల్పిస్తున్నాయి. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్.. సిటీ పార్కులు, ఇంకా మరికొన్ని చోట్ల జంటలు కనువిందు చేస్తున్నాయి. ఫొటోగ్రాఫర్లతో మాట్లాడి ముందస్తు ప్లాన్‌తో సహజంగా ఉండేలా అరేంజ్ చేసుకుంటున్నారు. ‘సంప్రదాయం కట్టుకున్న పెళ్లి ఫొటోలకు భిన్నంగా ప్రేమ పూర్వక జ్ఞాపకాల కోసం ఫొటో షూట్ పెట్టుకున్నాం’ అని ఇటీవలే పెళ్లి చేసుకున్న హర్షా రాఘవ చెప్పారు. ఈ షూట్స్ పుణ్యమాని ‘మా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరింది’ అని సంతోషంగా చెప్పుకొచ్చాడు.
ప్రేమికులారా జిందాబాద్..
స్నేహితుల కోసం ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పెళ్లికి ముందుగానే కలసి దిగిన ప్రేమ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా.. తమది ప్రేమ పెళ్లి అనేంతగా అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ప్రేమికుల్లా గడపాలనుకోవడంతో పాటు పెళ్లికి ముందే ఈడు జోడు ఉన్న మంచి జంటగా ఆహ్వానితులు భావించాలనే కోరిక కూడా ఈ ముందస్తు ఫొటో షూట్‌లకు పురిగొల్పుతోంది. వీటినే వెడ్డింగ్ ఇన్వైట్స్‌గానూ వినియోగిస్తున్నారు.
తామిద్దరూ కలసి ప్రయాణించబోతున్నామని చెప్పడానికి సింబాలిక్‌గా రోడ్ మీద నడుస్తున్నట్టు, సంసారమనే సాగరంలో ఈదబోతున్నామని చెప్పేందుకు గుర్తుగా నది ఒడ్డున కూర్చున్నట్టు.. అన్యోన్య దాంపత్యం ముంగిట ఉన్నట్టుగా చెప్పడానికి ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు, ఇలా రోజుకో రకమైన ఫొటోను అప్‌లోడ్ చేస్తూ నియర్ అండ్ డియర్‌లో తమ పెళ్లిపై ఆసక్తిని పెంచుతున్నారు. అంతేకాకుండా ఆ ఫొటోలపై ‘సేవ్ ద డేట్ ప్లీజ్’ వంటి క్యాప్షన్లు పెడుతూ వారికి తమ పెళ్లితేదీ గుర్తుండేలా చేస్తున్నారు. ‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు.
ఒకేసారి పెళ్లిలో, రిసెప్షన్‌లో సన్నిహితంగా నిలుచుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ఇబ్బందిగా అనిపిస్తుందేమోనని ఆలోచించినప్పుడు ఒక ఫ్రెండ్ లవ్ షూట్స్ ఐడియా చెప్పాడు. సిటీలోని కొన్ని ప్లేసెస్‌లో షూట్ చేశాం. దీని కోసం మేమిద్దరం రెండు రోజుల పాటు కలిసి గడపడం, ఫొటోగ్రాఫర్ల కోసం సహజ ప్రేమికుల్లా ప్రవర్తించడం మా ఇద్దరి మధ్యా సరికొత్త అనుభూతిని కలిగించింది’ అని చెప్పారు మాదాపూర్ నివాసి రాజ్‌కిషోర్.
దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే..
సినిమా హీరో, హీరోయిన్ల స్టిల్స్ తరహాలో తాము కూడా కనపడాలనే తపన కూడా ఈ తరహా షూట్స్‌కు ఆదరణ పెంచుతోంది. గోవాలో నివసించే షాదిగ్రాఫర్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన అమృత్ వాట్సా... తన పెళ్లికి ప్రీషూట్‌ను బాలీవుడ్ థీమ్‌తో చేశారు. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమా పోస్టర్లలో హీరో హీరోయిన్ల స్టిల్స్‌ను అనుసరిస్తూ తన కాబోయే భార్యతో కలిసి ఆయన తీయించుకున్న ఫొటోలు పెళ్లి మంటపంలో కనువిందు చేశాయి. ఈ షూట్స్ ద్వారా ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే...ఇప్పుడు హైదరాబాద్ వాసులు సైతం ఆయనను లవ్ షూట్స్ కోసం పిలుస్తున్నారు. ఏదేమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫొటోగ్రాఫర్లకు వరంగా మారాయి. ఎంగేజ్‌మెంట్ నుంచి రిసెప్షన్ వరకూ ఉండే ప్యాకేజ్‌లో ఈ షూట్స్ కూడా జత కలిశాయి. ప్రేమానురాగాన్ని, అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇప్పుడు సిటీ యువత వెనుకాడడం లేదు. దీనికి ఈ తాజా ట్రెండ్ ఒక చిరు ఉదాహరణ మాత్రమే...
అనుబంధానికి రూపం..
ప్రీ వెడ్డింగ్ షూట్స్ నేచురల్ ఫీల్‌ని అందించాయి. మా ఫొటోగ్రాఫర్ మంచి లొకేషన్లు సెలక్ట్ చేయడంతో మా ఫొటోలను అందరూ బాగున్నాయన్నారు. చారిత్రక కట్టడాలను ఎంచుకోవడంతో రిచ్ లుక్ వచ్చింది. సహజంగా అనిపించేలా సినిమా టిక్ స్టైల్‌లో ఫోజులు ఇవ్వడం అంత ఈజీ కాదు. అయితే రియల్ లైఫ్‌లో ఉన్నట్టే ఉండమన్న ఫొటోగ్రాఫర్ సూచనలకు అనుగుణంగా మేం ప్రవర్తించాం. అందుకే మా ప్రీ వెడ్డింగ్ షూట్ పిక్చర్స్ బాగా హైలెట్ అయ్యాయి.
- నివాలి, పున్నా.
వెరైటీ థీమ్స్ కావాలంటున్నారు
ప్రీ వెడ్డింగ్ షూట్స్ పూర్తిగా ఆ జంట ఇష్ట ప్రకారం జరుతుతాయి. అందుకే తమకు నచ్చిన డిజైనర్ దుస్తులు ఎంచుకుంటూ వెరైటీ థీమ్స్, కాన్సెప్ట్స్ కావాలని మమ్మల్ని అడుగుతున్నారు. మేం కూడా దీన్నో ఫ్యాషన్ షూట్‌లా భావిస్తున్నాం. హెయిర్ డ్రెస్సర్, మేకప్ మ్యాన్‌తో సహా మా వెంట ఉండేలా చూసుకుంటున్నాం.
- కరణ్, ఫొటోగ్రాఫర్
లవ్ షూట్స్
Published Sat, Feb 14 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement
Advertisement