తనకు సబబనిపిస్తే చాలు...ఎంతటి నిర్ణయం తీసుకోవడానికైనా వెరవని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి ఎన్నికల సంఘం(ఈసీ)పై ఆగ్రహోదగ్రురాలయ్యారు. ఒక జిల్లా కలెక్టర్‌ను, ఇద్దరు అదనపు కలెక్టర్లను, అయిదుగురు జిల్లా ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని ఈసీ ఆదేశించడం ఆమె ఆ
సంపాదకీయం
తనకు సబబనిపిస్తే చాలు...ఎంతటి నిర్ణయం తీసుకోవడానికైనా వెరవని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి ఎన్నికల సంఘం(ఈసీ)పై ఆగ్రహోదగ్రురాలయ్యారు. ఒక జిల్లా కలెక్టర్‌ను, ఇద్దరు అదనపు కలెక్టర్లను, అయిదుగురు జిల్లా ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని ఈసీ ఆదేశించడం ఆమె ఆగ్రహం వెనకున్న కారణం. వారు ఎలాంటి తప్పూ చేయలేదని వెనకేసుకురావడమే కాదు...‘ఒక్కరంటే ఒక్కరిని కూడా బదిలీ చేయను. ఏంచేస్తారో చేసుకోండి.
అవసరమైతే జైలుకైనా పోతాను’ అని ఆమె ఆవేశంతో ప్రకటించారు. అలా అన్నాక ఆమె వెనక్కి తగ్గారుగానీ ఈసీని ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో నిలదీసిన ఉదంతాలు గతంలో ఎన్నడూ లేవు. గత నెలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక వివిధ రాష్ట్రాల్లో దాదాపు 150మంది అధికారులను ఎన్నికల సంఘం బదిలీచేసింది. ఏ సందర్భంలోనూ... ముఖ్యమంత్రుల సంగతి వదిలి మంత్రులైనా నిరసనలు వ్యక్తంచేసిన దాఖలాలు లేవు. తమకు నచ్చని నిర్ణయం తీసుకున్నప్పుడుగానీ, ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేసినప్పుడు అందులో పసలేదని ఈసీ నిర్ధారించినప్పుడుగానీ ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించడం, ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులకు పరిపాటే. ఇంత సువిశాల దేశంలో ఎన్నికల నిర్వహణ నిజానికి కత్తి మీద సాములాంటిది. కోటి పదిలక్షలమంది సిబ్బందిని నెలరోజులకుపైగా ఎన్నికల బాధ్యతల్లో నిమగ్నమయ్యేలా చేయడం... ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగేలా చూడటం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.
అయినప్పటికీ 1952 సార్వత్రిక ఎన్నికలతో ప్రారంభించి ఇంతవరకూ 15 లోక్‌సభ ఎన్నికలను, దాదాపు 350 అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ఒడుపుగా, ప్రశంసనీయంగా నిర్వహించిన చరిత్ర ఈసీది. పోలింగ్ కేంద్రాలపై దాడులు, రిగ్గింగ్, దొంగ ఓట్లు వంటి ఉదంతాలు లేకపోలేదు. అయితే, ప్రతి అనుభవాన్నీ పరిగణనలోకి తీసుకుని తన పనితీరులో లోపాలుంటే సవరించుకోవడం, లొసుగులుంటే నివారించుకోవడం ఈసీ క్రమం తప్పకుండా చేస్తున్న పని.
మరి ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థపై మమతకు కోపం ఎందుకొచ్చినట్టు? బదిలీ అయిన ఎనిమిదిమందిలో ఒకరు మినహా మిగిలినవారందరిపైనా తృణమూల్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరోపణలున్నాయి. ఆ ఒక్కరినీ వేరే జిల్లాకు బదిలీ చేశారు. మిగిలినవారిని వారి ప్రస్తుత పదవులనుంచి తొలగించడమే కాదు...వారికి ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల సంఘం మరో అసాధారణమైన చర్య కూడా తీసుకుంది. తొలగించినవారి స్థానంలో వెనువెంటనే కొత్త అధికారులను నియమించింది. తొలగించిన వారందరిపైనా లెక్కకు మిక్కిలి ఫిర్యాదులందడం పర్యవసానంగా ఈసీ ఈ పనిచేసింది.
ఫలానా అధికారిని బదిలీ చేయమన్నప్పుడు ఆ అధికారి స్థానంలో నియమించడం కోసం ముగ్గురి పేర్లను సూచించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం పరిపాటి. దీనికి సంబంధించి నిబంధనేదీ లేకపోయినా ఈసీ చేస్తున్నది ఇదే. కానీ, బెంగాల్‌లో ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. అధికారుల తొలగింపు, వారి స్థానాల్లో కొత్తవారి నియామకం ఏకకాలంలో జరిగిపోయాయి. సరిగ్గా అదే ఆమె ఆగ్రహావేశాలకు కారణమైంది. మిగిలినచోట్ల అనుసరిస్తున్న విధానాన్ని తమ రాష్ట్రంలో ఎందుకు పాటించరని మమత నిప్పులుగక్కారు. నిజానికి మమత తనకలవాటైన వ్యవహారశైలిలోనే ఉండిపోయి, గడువులోగా ఈసీకి సహకరించక పోతే ఏమయ్యేదో ఊహించడం కష్టమేమీ కాదు. ఆ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలన్నిటా ఎన్నికలను నిలిపివేసేందుకు ఈసీకి సర్వాధికారాలూ ఉన్నాయి.
అయితే, అంతమాత్రాన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో బలహీనమైన స్థితిలో ఉన్నారని, ఆ గండంనుంచి గట్టెక్కడం కోసం అధికారులతో తప్పులు చేయిస్తున్నారని...అది బెడిసికొట్టడంవల్లే ఆమె అతిగా స్పందిస్తున్నారని అనుకుంటే పొరపాటు. మూడేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఆమె తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో సైతం ఆమె పార్టీదే ఆధిక్యత. 17 జడ్‌పీల్లో తృణమూల్ 13 స్థానాలను చేజిక్కించుకుంది. లెఫ్ట్ ఫ్రంట్‌ను ఆమె కోలుకోలేని దెబ్బతీశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మమత హవా కొనసాగుతుందని పలు సర్వేలు ఇప్పటికే చెప్పాయి. కనుక మమత స్పందనలో నిస్సహాయతను వెదకలేం. అయితే, ఆమెకు అతిగా స్పందించడం అలవాటని వివిధ ఉదంతాలు రుజువుచేశాయి. ఒక జాతీయ చానెల్ నిర్వహించిన చర్చావేదికలో ప్రశ్నించిన విద్యార్థినులను మావోయిస్టులని ముద్రేయడం అందరికీ తెలిసిందే. ఒక గ్రామంలో ప్రచారానికెళ్లినప్పుడు నిలదీసిన రైతుకూ ఇదే పరాభవం ఎదురైంది. అతను జైలుకు కూడా పోవాల్సివచ్చింది. తనకొచ్చిన కార్టూన్‌ను మరెవరికో పంపిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌కూ ఇదే గతిపట్టింది.
ఎంతో ప్రజాదరణ ఉన్న మమత నిజానికి ఇలాంటి స్వల్ప విషయాలను పట్టించుకోకూడదు. కానీ, ఆమె ఎదిగివచ్చిన తోవ అలాంటిది. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని కుటుంబంనుంచి కాంగ్రెస్‌లోకి అడుగు పెట్టడం, నిరంతరం ఉద్యమాల్లో మునిగితేలడం, సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రంలో లెఫ్ట్‌ఫ్రంట్ ఆధిపత్యాన్ని దెబ్బతీయడం, కేంద్రమంత్రిగా, సీఎంగా ఎదగడం ఈ ‘ఫైర్ బ్రాండ్’ స్వభావంవల్లనే సాధ్యమైంది. విపక్షంలో ఉండగా అక్కరకొచ్చిన ఆ స్వభావమే ఇప్పుడు విపరీత పోకడగా కనిపిస్తుంది. తాను పట్టించుకోవాల్సింది ఏమేరకో... పట్టువిడుపులు ఎక్కడెక్కడ అవసరమో అనే గ్రహింపు లేకపోతే ఆ స్వభావం ఒక స్థాయి తర్వాత రాజకీయ ఎదుగుదలకు ఆటంకంగా కూడా మారుతుంది. మమతా బెనర్జీ దీన్ని గుర్తించడం అవసరం. ఎన్నికల సంఘంవంటి ప్రతిష్టాత్మక సంస్థపై అలగడం వృధా ప్రయాస అని తెలుసుకోవడం ముఖ్యం.