అన్నకు విధేయులు పవన్ కళ్యాణ్, నాగబాబు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ అన్న చిరంజీవికి విధేయులే. తమ ఎదుగుదలకు అన్నే కారణం అని ఇప్పటికీ, ఎప్పటికీ వారు నమ్ముతారు. వారు అలా భావించినంత మాత్రాన వారిలో టాలెంట్ లేదని కాదు. నటనా సామర్ధ్యంతోపాటు వారి వ్యక్తిత్వం వారికి ఉంది. వారి విలువలు వారికి ఉన్నాయి. అన్న అండతో అల్లుకుపోయామని వారికి తెలుసు. వాస్తవాలు తెలుసుగనుకనే ఒద్దికగా ఉంటారు. అన్న మాటకు విలువ, గౌరవం ఇచ్చినంత మాత్రాన వారి మధ్య అభిప్రాయ బేధాభిప్రాయాలు, చిన్నచిన్న మనఃస్పర్ధలు లేవని కాదు. అవి ఉంటాయి. వాటి దారి వాటిదే. వారి ఐక్యత వారిదే. ఆ రకంగా అటుంటి తమ్ముళ్లు ఉన్నందుకు చిరంజీవి కూడా అదృష్టవంతుడు. బాబాయి పవన్ మనసు తెలిసినందునే చరణ్ అప్పుడప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. తమ సంబంధం పటిష్టమైనదని చెబుతుంటారు.
అన్నను వదిలి పవన్ గానీ, నాగబాబు గానీ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేదు. మరో పార్టీలో చేరే అవకాశం అంతకంటే లేదు. అన్నకు విధేయులుగా ఉండే వారు అన్న ఒక పార్టీలో ఉంటే మరో్ పార్టీలో ఎందుకు చేరతారు? ఈ ఇద్దరూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు ఎవరు ఊహించారోగానీ, అది రెండు రోజులపాటు విస్తృతంగా ప్రచారం అయింది. టిడిపి నేతలైతే ఒక అడుగు ముందుకువేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే మంచిదేనని ఆహ్వానం పలికారు. ఆ తరువాత నాగబాబు, పవన్ వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
తాను, పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను నాగబాబు ఖండించారు. టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చే తీరిక తమకు లేదని స్పష్టం చేశారు. తాము వృత్తిపరంగా బిజీగా ఉన్నట్లు తెలిపారు. వృతికి న్యాయం చేయడమే తమ బాధ్యతగా పేర్కొన్నారు. తాము రాజకీయ పార్టీ పెట్టడం లేదని కూడా నాగబాబు స్పష్టం చేశారు. మీడియా కథనాలు అభిమానులను, ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయని వాపోయారు.
తెలుగు సినీపరిశ్రమలో చిరంజీవి స్వయం కృషితో సాధించిన హోదా, పేరు ప్రఖ్యాతలతోనే పవన్ కళ్యాణ్కు అత్యధికంగా పాపులారిటీ లభించిందని గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పారు. అంతేకాకుండా చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబుకు సినీ పరిశ్రమలో స్థానం లేదని కూడా స్పష్టం చేశారు. చిరంజీవి మంచితనం వల్లే తమ కుటుంబం సినీ పరిశ్రమలో బలమైన శక్తిగా ఎదిగిందని నాగబాబు తెలిపారు. మంచి వ్యక్తిగా, మాటమీద నిలబడే వ్యక్తిగా పేరుపొందిన నాగబాబు ఈ మాటలన్నీ చెప్పారు. అటువంటి నాగబాబు అన్నకు వ్యతిరేకంగా మరో రాజకీయ పార్టీలో ఎలా చేరతారా? ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా నాగబాబు గానీ, పవన్ గారీ మరో పార్టీలో చేరరని ప్రముఖ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. అది అక్షరాల నిజం.
వాస్తవానికి పవన్ మనస్తత్వం రాజకీయాలకు సరిపడదు. ఏదో అన్న పెట్టిన పార్టీ కాబట్టికి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కోసం ప్రచారం చేశారు. అప్పుడు ఆయన సహజంగా రెచ్చిపోయి మాట్లాడిన మాటలు ఇప్పటికీ విమర్శలకు గురవుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా కూడా ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపడంలేదు. తెలుగు సినీపరిశ్రమలో ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా ముందుకు వెళుతున్నారు.
s.nagarjuna@sakshi.com