అక్టోబర్ ఆరే ఆఖరా?
సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డికి అక్టోబర్ ఆరే ఆఖరు అన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అక్టోబర్ ఆరు తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండబోరన్న గుసగుసలు జోరందుకున్నాయి. సీల్డ్ కవర్ సీఎంగా ప్రత్యర్థుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న నల్లారివారు ఈ నెల మొదటి వారంలోనే ఇంటికెళ్లడం ఖాయమని అంటున్నారు. గులాబీ నేతలు ఒకడుగు ముందుకేసి అక్టోబర్ 7 తర్వాత కిరణ్ పదవిలో ఉండరని చా(ఘా)టుగా వ్యాఖ్యానిస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్కు కిరణ్ చివరి సీఎం అని కూడా వారంటున్నారు.
తనకున్న సమాచారం ప్రకారం కిరణ్ అక్టోబర్ ఆరు దాటడని సకల జనభేరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపం అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌కు ప్లగ్‌ను పీకేస్తుందని జోస్యం చెప్పారు. కిరణం బొగ్గు అయితది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు కొంత మంది సీమాంధ్ర మంత్రులు సీఎం కిరణ్కు వ్యతిరేకంగా మంత్రాంగం నడుపుతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. వీరి వెనుక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో పలువురు సీమాంధ్ర మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. సీఎం కిరణ్పై ఈ భేటీలో మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
వ్యక్తిగత లబ్ది కోసమే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని, తమను కలుపుకుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మాట మాత్రంగానైనా తమను సంప్రదించకుండా మీడియా సమావేశాలు పెట్టి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని చాటుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు(ట). విభజనకు ముందే సీఎంను మార్చాలని అధిష్టానికి విన్నవించాలని కూడా నిర్ణయించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. బొత్స సత్తిబాబును హైకమాండ్ వద్దకు దూతగా పంపినట్టు ఊహాగానాలు వస్తున్నాయి.
మరోవైపు 2014 వరకు సీఎంగా కిరణ్ కొనసాగుతారని బొత్స నిన్న ప్రకటించారు. అయితే సీమాంధ్ర మంత్రుల భేటీకి చిరంజీవి హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు కిరణ్ కూడా సీఎం పదవిపై ఆశలు వదులుకున్నట్టు కనబడుతోంది. తనకు ప్రజలే ముఖ్యమని పదవి ఇటీవల మీడియా సమావేశంలో కిరణ్ కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామాలన్నటిని గమనిస్తే కిరణ్ అక్టోబర్ ఆరు దాటేలా కనిపించడంలేదు.