
ఎవరి మానసపుత్రిక?
సోనియా గాంధీ మానస పుత్రికగా ఆహార భద్రతను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇది సోనియా మానస పుత్రిక కాదని, ఎన్టీఆర్ మానసపుత్రిక అని టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ పేర్కొన్నారు.
విజయానికి అందరూ మిత్రులే, ఓటమి ఓంటరి. అందుకే లోకమంతా సక్సెస్ వెనుకాల పరుగు తీస్తుంది. విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతుంటారు. ఇక రాజకీయ రంగంలో రాణించేందుకు రాజకీయ నాయకులు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. పవర్ కోసం ఓటర్లకు వాగ్దానాలతో గాలం వేస్తారు. తాము అందలం ఎక్కగానే పేదలను ఉద్దరిస్తామని, పక్కా ఇళ్లు కట్టిస్తామంటూ రకరకాల హామీలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. పాలకుల హామీలు నీటిమీద రాతలేనని నడుస్తున్న చరిత్రలో ప్రతిచోటా రుజువవుతోంది.
ఇక ప్రజా సంక్షేమ పథకాల ఘనత తమదంటే తమని అధికార, విపక్షాలు తన్నులాడుకోవడం రాజకీయాల్లో షరా మామూలే. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఆహార భద్రత చట్టం విషయంలోనూ రచ్చ మొదలయింది. ఈ చట్టంలో పలు లొసుగులున్నప్పటికీ పేదలకు కడుపునిండా ఆహారం దొరకుతుందన్న భావనతో దీనికి పార్లమెంట్లో మద్దతు తెలిపాయి.
సోనియా గాంధీ మానస పుత్రికగా ఆహార భద్రతను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇది సోనియా మానస పుత్రిక కాదని, ఎన్టీఆర్ మానసపుత్రిక అని టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ పేర్కొన్నారు. 1985లో ముఖ్యమంత్రుల సమావేశంలోనే తన తండ్రి ఈ పథకం గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆ తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. హరికృష్ణ వ్యాఖ్యలతో ఆహార భద్రత ఎవరి మానస పుత్రిక అన్న చర్చ మొదలయింది.
మరోవైపు యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టాన్ని దేశ చరిత్రలో మైలు రాయిగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్ణించారు. ఆహార భద్రత బిల్లు చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో లాభపడేందుకే కాంగ్రెస్ భో'జన' భద్రత కల్పించిందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజకీయ కుమ్ములాటల సంగతి అటుంచి.. పథకం లక్ష్యం నెరవేరితేనే పేదవాడికి నాలుగేళ్లు నోట్లోకి వెళతాయి.