
పెరల్ స్టోరీ
మొదటి నిజాం మీర్ ఖమరుద్దీన్ ఖాన్ దర్బారు ఆరోజు చాలా కోలాహలంగా ఉంది. ఇరాక్ నుంచి వచ్చిన ఓ వాణిజ్య బృందంతో ఆయన కీలక భేటీ నిర్వహించారు.
మొదటి నిజాం మీర్ ఖమరుద్దీన్ ఖాన్ దర్బారు ఆరోజు చాలా కోలాహలంగా ఉంది. ఇరాక్ నుంచి వచ్చిన ఓ వాణిజ్య బృందంతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. సమావేశం ముగియటంతో నవాబు సాధారణ సింహాసం అధిష్టించారు. భోజనాలు ముగించి వచ్చిన ఇరాక్ బృందం ప్రతినిధి ఆయనకు పేటికలో ఉన్న ఓ ‘నజరానా’ అందించారు. దాన్ని చూడగానే నిజాం మోము వెలిగిపోయింది.. మరుసటి రోజు దర్బారు సాధారణంగానే ఉంది. వాణిజ్యం కోసం వచ్చిన విదేశీ బృందం వెళ్లిపోయింది. కానీ నిజాం మాత్రం ధగధగలాడిపోతున్నాడు. ఆయన కంఠహారమే దీనికి కారణం. అది మేలిమి ముత్యాలహారం. ముందురోజు ఇరాక్ ప్రతినిధి ఇచ్చిన నజరానా అదే.
ఐటీ రంగంలో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌కు ఉన్న చారిత్రక నామం ముత్యాల నగరం. రైతు బజార్లలో కూరగాయలను రాసులుగా పోసి అమ్మిన తరహాలో నాటి నగర వీధుల్లో ముత్యాలను పోసి అమ్మారని చరిత్ర చెబుతోంది. మొదటి నిజాం పట్టుపట్టి చేసిన ప్రయత్నం వల్లనే నగరం ముత్యాలతో నిండిపోయింది. ఇరాక్ ప్రతినిధి ఇచ్చిన కంఠ హారం ఆయనలో ఆ ఆలోచనను రేకెత్తించింది. మూడు దశాబ్దాల త ర్వాత కూడా హైదరాబాద్ మేలిమి ముత్యాలకు ఓ కేంద్రంగా ఉండటానికి కూడా ఆ ఘటనే పునాది.
కుతుబ్‌షాహీ నిర్మిత భాగ్యనగరం అప్పటికే ఎన్నో ప్రత్యేకతలకు కేంద్రం. ఈ నగరంలో విహరిస్తుంటే ప్రపంచాన్ని చుట్టేసిన భావన కలిగేలా నగర సోయగాల్లో భాగం కావాలనే ప్రయత్నం అప్పట్లో జరిగింది. దాన్ని అసఫజాహీలు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందులో భాగ్యనగరం ముత్యాలకు చిరునామా కావాలనే తపన కూడా ఒకటి. కుతుబ్‌షాహీల జమానాలోనే ముత్యాలు నగరానికి పరిచయమైనా... అదో గొప్ప మార్కెట్‌గా ఎదిగింది మాత్రం తొలి నిజాం హయాంలోనే.
క్రీ.శ.1700లో ముత్యాలకు ఏకైక వేదిక ఇరాక్‌లోని బస్రా ప్రాంతం. అక్కడి నుంచే ముత్యాలు ఎగుమతి అయ్యేవి. కానీ హైదరాబాద్‌నే ముత్యాల పరిశ్రమగా మార్చాలనే ఆలోచనతో తొలి నిజాం వేగంగా చర్యలు ప్రారంభించారు. అయితే ముత్యాలను పండించే అవకాశం లేకపోవటంతో ముడి ముత్యాలను దిగుమతి చేసుకుని వాటిని మెరుగు పరిచి, వన్నెలద్ది తిరిగి ప్రపంచ మార్కెట్‌కు విక్రయించాలనేది ఆయన ఆలోచన. వెంటనే పాలిష్ పెట్టడం, దారంలోకి ఎక్కించేందుకు వీలుగా వాటికి రంధ్రం చేయటంలో శిక్షణ ఇప్పించే కేంద్రాలు ప్రారంభించారు. ఇందుకు ఇరాక్ వ్యాపారుల సహకారం తీసుకున్నారు. తరువాత బస్రా నుంచి ముడి ముత్యాల దిగుమతి మొదలు పెట్టారు. కొంత కాలానికి చార్మినార్ ప్రాంతంలో ఏ వీధిలో చూసినాముత్యాల రాసులే. సంతలో కూరగాయల తరహాలో వీటి అమ్మకం మొదలైంది. సాధారణ ప్రజలకు కూడా బస్రా ప్రాంత మేలిమి ముత్యాలు అందుబాటులోకి వచ్చారు. నిజాం కల నెరవేరింది.
తొలి నిజాం కృషి వల్ల ప్రపంచంలోనే హైదరాబాద్ అతిపెద్ద ముత్యాల మార్కెట్‌లలో ఒకటిగా మారింది. ఇప్పుడు హైదరాబాద్ ముత్యాల మార్కెట్ విలువ దాదాపు రూ.5 వేల కోట్లకు పైమాటేనట. దేశంలో ఇంత పెద్ద మార్కెట్ మరెక్కడా లేదు. కాలక్రమంలో బస్రా ముత్యాలు పూర్తిగా అంతరించాయి. ఇరాన్-ఇరాక్ యుద్ధ ప్రభావంతో అక్కడ ముత్యాల బ్రీడింగ్ ఆగిపోయింది. ఇప్పుడు చైనా, జపాన్, ఫిలిప్పీన్స్, తైపే, ఆస్ట్రేలియూలు ముత్యాలను పండిస్తున్నాయి. కానీ ఆ ప్రాంతాల్లో వీటి ప్రాసెసింగ్ అంతంత మాత్రమే. మన దేశంలో కేరళ, అండమాన్ ప్రాంతాల్లో మాత్రమే పరిమితంగా ముత్యాలు లభిస్తున్నారు. కానీ ఇవి అంత మేలు రకం కాదు. దీంతో చైనా, జపాన్, ఫిలిప్పీన్స్, అస్ట్రేలియూ ప్రాంతాల్లో సాగవుతున్న ముడి ముత్యాలను హైదరాబాద్ మార్కెట్ దిగుమతి చేసుకుంటోంది. పాలిష్ చేసి, ఆధునిక డ్రిల్లింగ్ పద్ధతిలో వాటికి రంధ్రం చేసి హారాలుగా తీర్చిదిద్దుతోంది.
వీటిని పండించిన దేశాలకే మళ్లీ ఎగుమతి చేస్తోందంటే హైదరాబాద్ ముత్యాల మార్కెట్ ఘనత అవగతమవుతోంది.నగరంలో 2 వేలకుపైగా ముత్యాల దుకాణాలున్నాయి. ఇందులో దాదాపు సగం షాపులు పాతబస్తీలోని చార్మినార్, గుల్జార్‌హౌస్, పత్తర్‌ఘట్టిల్లో ఉన్నాయి. ముత్యాలనగానే పాతనగరానికి వెళ్లటం పరిపాటిగా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం దాదాపు రూ.50 లక్షల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా. నగరానికి వచ్చే విదేశీయులు ప్రత్యేకంగా ముత్యాల కోసం పాతబస్తీకి వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది.
- గౌరీభట్ల నరసింహమూర్తి