విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత
తమిళనాట వదినమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. తమిళ సినీ రంగంలో కెప్టెన్గా, అభిమానులకు అన్నగా ప్రజాదరణ పొందిన విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత అలగర్స్వామి వచ్చే ఎన్నికల బరిలోకి దిగటాని ఆసక్తి చూపుతున్నారు. లోక్సభకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. విజయ్ కాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెండి తెర నుంచి రాజకీయ తెరపై మెరిసిన తమిళ స్టార్ విజయ్ కాంత్ డిఎండికే (దేశీయ ముర్పొక్కు ద్రవిడ ఖజగం) పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి రియల్ కెప్టెన్గా మారారు. రాజకీయాలలో ఆయనకు అన్ని విధాల భార్య ప్రేమలత సహరిస్తుంటారు. మొన్నటి ఎన్నికల్లో ఎత్తులు-పైఎత్తులు, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు...వంటి అన్ని ప్రక్రియల్లోనూ విజయ్ కాంత్కు వెన్నుదన్నుగా నిలచారు. సూత్రధారిగా వ్యవహరించారు.
ఈ మధ్య కాలంలో పార్టీలో అభిప్రాయ భేదాలు, కుమ్ములాటలు, కీలక నేతలు వలస దారిపట్టడంతో విజయ్ కాంత్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీలో పెద్ద తలకాయలా, విజయ్ కాంత్ కుడిభుజంగా ఉండే రామచంద్రన్ ఈ మధ్యనే రాజకీయాల నుంచి విమరించుకున్నారు. దాంతో పార్టీ పరిస్థితి మరింతగా దెబ్బతింది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికే భార్యను తెరపైకి తేవాలని విజయ్ కాంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపిన ప్రేమలత ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. దీనికి పార్టీ అధిష్టానం అంగీకరించింది.
తన రాజకీయ అరంగేట్రానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఏకంగా పార్లమెంటు ఎన్నికల బరిలో దిగాలన్న యోచనలో ప్రేమలత ఉన్నారు. కళ్ల కుర్చి లోక్సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్సభ నియోజక వర్గ పరిధిలో డిఎండికేకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5 నియోజక వర్గాల్లోనూ పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణే ఉంది. అందుకే ఈ లోక్సభ నియోజక వర్గం నుంచి ఏదైనా ఇతర రాజకీయ పార్టీ పొత్తుతో గానీ లేదా ఒంటరిగానైనా పోటీ చేయాలని ప్రేమలత నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తమిళ నాట ఇప్పటికే కాంగ్రెస్ నుంచి జయంతీ నటరాజన్, డిఎంకే నుంచి కనిమొళి, బిజెపి నుండి తమిళిసై సౌందర్ రాజన్, అన్నా డిఎంకే నుండి గోకుల ఇందిర, పిఎంకే నుండి సౌమ్య అన్బుమణి వంటి మహిళా నాయకురాళ్లు సత్తా చాటుతున్నారు. ఆ కోవలో తాను పయనించాలని ప్రేమలత పట్టుదలగా ముందుకు సాగుతున్నారు.