ప్రకృతే స్ఫూర్తి | Raghu ram attend to Power Your cliques seminar | Sakshi
Sakshi News home page

ప్రకృతే స్ఫూర్తి

Published Sat, Nov 22 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

ప్రకృతే స్ఫూర్తి

ప్రకృతే స్ఫూర్తి

జీవితం, ప్రకృతి ఆయన ఛాయాచిత్రానికి స్ఫూర్తి! బండరాళ్లను ఆయన కెమెరా ఎంత అందంగా చూపించగలదో సామాన్యుడి జీవనాన్ని అంతే హృద్యంగా బంధించగలదు.. అందుకు సాక్ష్యం.. హైదరాబాద్ రాక్స్.. భోపాల్ దుర్ఘటన! అందుకేనేమో ఆ ప్రతిభకు 70ల్లోనే మాగ్నమ్ ఫోటోస్‌సభ్యత్వం ఇచ్చి సత్కరించింది వరల్డ్ ప్రెస్ ఫోటో తన జ్యూరీలో మెంబర్‌ను చేసుకుంది.. ఆయనే.. భారతదేశంలో ఫొటోగ్రఫీకి ఓ కళగా గుర్తింపుతెచ్చిన కళాకారుడు రఘురాయ్! నికాన్ ఇండియా హాట్స్ నిర్వహించిన ‘పవర్ యువర్ క్లిక్స్’ సెమినార్‌లోపాల్గొనడానికి సిటీకి వచ్చిన ఈ మేస్ట్రోతో సంభాషణ..

..:: సరస్వతి రమ
 
హైదరాబాద్.. గొప్ప హిస్టారికల్ సిటీ. ఏ సృజనకారుడికైనా బోలెడంత స్ఫూర్తినిచ్చే ప్రాంతం! ఇక్కడి ఇస్లామ్ కల్చర్ వెరీ డీప్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇస్లామ్ ఆర్కిటెక్చర్ అండ్ హరిటేజ్ వెరీ మీనింగ్ ఫుల్. పాతబస్తీ.. అక్కడి గల్లీలు అన్నీ నాకు చాలా ఇష్టం. ఇక్కడి మహిళలు.. చాలా అంకితభావంతో కనిపిస్తారు. దేశంలోకి కెమెరా వచ్చిన వెంటనే హైదరాబాదూ దాన్ని అడాప్ట్ చేసుకుంది. రాజా దీన్‌దయాళ్ తన ఫొటోగ్రాఫ్స్‌తో ఈ కళను అత్యున్నత శిఖరాల్లో నిలబెట్టాడు.

కానీ ఆ పరంపరను కొనసాగించే శక్తి ఇక్కడి ఫొటోగ్రాఫర్లలో కొరవడిందేమో అనిపిస్తోంది. ఆశించనంతగా కంట్రిబ్యూషన్ కనిపించడంలేదు. దీన్‌దయాళ్ లాంటి వాళ్లు ఈ కళే ఊపిరిగా బతికారు. దానికోసం అంకితమైపోయారు. అలాంటి దీవానాపన్ తర్వాత తరంలో కనిపించలేదు. నా ఫ్రెండ్ రవీందర్‌రెడ్డి హైదరాబాద్ హెరిటేజ్ అండ్ కల్చర్‌ని ఫొటో డాక్యుమెంటేషన్ చేస్తానంటున్నాడు. ‘ఆ పని నువ్ తొందరగా చేయకపోతే నేనొచ్చి చేస్తాను’అన్నాను.

ఆర్ట్ అండ్ కల్చర్ విలువ తెలియదు
బ్రిటిష్ గవర్నమెంట్ ఈవెన్ ఈస్టిడింయా కంపెనీ.. వాళ్ల అంపైర్‌ని కెమెరాలో బంధించింది. ఫోటో ఆల్బమ్‌ని తయారుచేసింది. వాళ్లది సివిలైజ్డ్ సొసైటీ. ఆ ఫొటో డాక్యుమెంటేషన్‌ని చాలా విలువైనదిగా భావించారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ వయసులో ఉన్నప్పుడే ముసలిదైంది. ఇప్పటికీ మన ప్రభుత్వానికి ఆర్ట్ అండ్ కల్చర్ విలువ తెలియదు. మనమేంటి.. మన రూట్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి, వాటిని భద్రపర్చాలన్న ధ్యాస లేదు.

అసలలాంటివాటిని లెక్కే చేయవు మన ప్రభుత్వాలు. సిగ్గుపడాల్సిన విషయం. దీనికి సంబంధించి ప్రభుత్వంలోని ఏ శాఖా పట్టించుకోకపోవడం మన దురదృష్టం. ఫొటోగ్రఫీ లేని టైమ్‌లో కూడా బ్రిటన్ లాంటి దేశాల్లో పెద్ద ఆర్టిస్టులతో స్కెచెస్ వేసుకొని మరీ హెరిటేజ్ అండ్ కల్చర్‌ని భద్రపర్చుకున్నారు వాళ్లు. టెక్నాలజీ ఇంత వృద్ధి సాధించింది.. చక్కటి కెమెరాలు వచ్చాయి.. అయినా మనదేశం ఇంత నాలాయక్‌లా ఎందుకు ప్రవర్తిస్తోంది? వాళ్లను వాళ్లు ఎడ్యుకేట్ చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.. ఏయే రంగాల్లో ప్రతిభావంతులున్నారో గ్రహించి ఆయా రంగాల్లోని ఇన్‌క్లూడింగ్ ఫోటోగ్రఫీ ఆర్టిస్టులతో మన దేశానికి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్‌ని డాక్యుమెంటేషన్ చేయాలి.

మ్యాగ్నమ్ క్లబ్..
డెబ్భెల్లో నాకు అందులో సభ్యత్వం అందింది. తర్వాత ఇప్పుడు ఓ 24 ఏళ్ల కుర్రాడికి వచ్చింది. వరల్డ్ ఫొటోగ్రఫీకి ఇండియా కాంట్రిబ్యూషన్ చాలానే ఉన్నప్పటికీ మాగ్నమ్ క్లబ్‌లో నా తర్వాత ఇన్నేళ్ల దాకా మళ్లీ ఎవరికీ ఎందుకు సభ్యత్వం రాలేదు అంటే.. మాగ్నమ్ క్లబ్ ఎప్పుడూ టాలెంటెడ్ అండ్ డిఫరెంట్ ఫొటోగ్రాఫర్ల కోసం అన్వేషిస్తుంటుంది. బహుశా ఇన్నేళ్లదాకా ఆ క్లబ్ అన్వేషణలో ఇండియానుంచి ఎవరూ చిక్కలేదేమో.

ఫిలిం రోల్ నుంచి డిజిటల్‌దాకా..
డిజిటల్ టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్లు అవుతున్నారు... దీనివల్ల ఆర్ట్‌గా ఉన్న ఫొటోగ్రఫీ డైల్యూట్ అవుతున్న మాట వాస్తవమే కానీ... ప్రయోగాలైతే దండిగా జరుగుతున్నాయి కదా. వీళ్లలోంచి ఓ మంచి ఫొటోగ్రాఫర్ పుట్టుకొస్తాడేమో ఎవరికేం తెలుసు? మంచి ఫొటోగ్రఫీకి ఇదో వేదికా అవునున్నదేమో! ప్రతివాళ్లకూ ఆడే హక్కు ఉంది. అలా ఆడితేనే ప్రతిభ బయటకు వస్తుంది. అయితే న్యూడిజిటల్ టెక్నాలజీతో ఫొటోగ్రఫీ చాలా ఈజీ. బుర్రపెట్టాల్సిన పనిలేదు. అదే అన్నీ చేస్తుంది. దీనివల్ల బద్ధకం పెరిగే ప్రమాదమూ ఉంది. ఫిలింరోల్ ఉన్నప్పుడు ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నామో ఇప్పుడూ అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలి.

కళకు జీవం సృజన
ఫొటోగ్రఫీ నేర్పించే ఇన్‌స్టిట్యూట్‌లు దేశంలో చాలానే ఉన్నాయి. నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన 45 ఏళ్లకు (2009లో) రఘురాయ్ సెంటర్ ఫర్ ఫొటోగ్రఫీని స్టార్ట్ చేశాను. మిగిలిన శిక్షణసంస్థలకు, ఢిల్లీలోని నా ఇన్‌స్టిట్యూట్‌కి తేడా ఒక్కటే. అవన్నీ ఔట్‌డేటెడ్ సిలబస్‌ను బోధిస్తాయి. మా ఇనిస్టిట్యూట్ ఔత్సాహికుల్లో ఉన్న సృజనను వెలికి తీస్తుంది.

హైదరాబాద్‌లో రఘురాయ్ సెంటర్ శాఖ..?
ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రఘురాయ్ సెంటర్ ఫర్ ఫొటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్ వ్యాపారం కోసం పెట్టింది కాదు. అలాంటి సెంటర్ ఒకటి హైదరాబాద్‌లోనూ ఉండాలనే లక్ష్యంతో ఎవరైనా ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే నావంతు సహాయం తప్పకుండా చేస్తాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement