రాజ్యసభ ప్రవేశ ద్వారం
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగవలసి ఉంది. కాంగ్రెస్ మూడు, టీడీపీకి రెండు సీట్లు ఖాయంగా గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన సీటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆ సీటుకు టీఆర్‌ఎస్ పోటీ పడితే సీపీఐ, బీజేపీ మద్దతిచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ఆ రెండు పార్టీలు ఈ ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.
వచ్చేనెల 7న జరిగే ఎన్నికల్లో ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్కు మూడు, తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు ఖాయం. మిగిలిన ఒక సీటుకు ఎవరు పోటీ పడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏడో అభ్యర్థి రంగంలోకి వస్తే గెలవడానికి 39 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి.
టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 23 మంది సభ్యుల మద్దతు ఉంది. సీపీఐ నలుగురు, బీజేపీ ముగ్గురు సభ్యులు మద్దతిస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. కాంగ్రెస్‌లోని కొంత మంది సభ్యుల మద్దతు టీఆర్‌ఎస్ కూడగట్టగలిగితే గెలుపు సులభమవుతుందని ఆ పార్టీలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు సంబంధం లేకుండా ఎంఐఎం మద్దతు పలికితే 37 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు లభిస్తాయి. ప్రస్తుత పరిస్థితులలో ఎంఐఎం టిఆర్ఎస్కు మద్దతు పలికే అవకాశం ఉంది. ఇక కావలసిన మూడు ఓట్లు కాంగ్రెస్ నుంచి లాక్కోవడం పెద్ద కష్టం ఏమీకాదు. తెలంగాణ అంశం, రానున్న సాధారణ ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులను దృష్టిలో ఉంచుకొని బీజేపీ, సీపీఐలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.