హైదరాబాద్: రెబల్స్, రెబల్స్, రెబల్స్... ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. అన్ని పార్టీలకు పలు ప్రాంతాలలో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు పొత్తుల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడంతో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువయ్యారు. టిఆర్ఎస్కు ఎవరితోనూ పొత్తులేకపోయినా దానికీ తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు.
తెలుగుదేశం పార్టీ : ఎల్బీనగర్ టీడీపీ టికెట్ ఆర్.కృష్ణయ్యకు కేటాయించడంతో టిడిపి నేతలు తిగురుబాటు చేశారు. ఎల్బీనగర్ టిడిపి ఇంచార్జ్ కృష్ణప్రసాద్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బి నగర్ స్థానానికే టీడీపీ నేత సామరంగారెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్ధిగా లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన పి.ఎల్.శ్రీనివాస్ తిరుగుబాటు అభ్యర్థిగా సికింద్రాబాద్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా గుర్రం వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు.
కాంగ్రెస్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా గీట్ల ముకుందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హుజురాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పరిపాటి రవీందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా దువ్వాడి నరసింగరావు నామినేషన్ వేశారు. సిపిఐకి కేటాయించిన మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి సబిత సహకారంతో మల్‌రెడ్డి నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధిగా కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు.
వికారాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్, చేవెళ్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేశారు. మునుగోడులో ఎంపీ పాల్వాయి కూతురు స్రవంతి రెబల్‌గా బరిలో దిగారు. దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ రెబల్‌గా బరిలో దిగారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు మాధవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
బిజెపి: సూర్యాపేటలో బీజేపీ రెబల్ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర రావు నామినేషన్ వేశారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీ రెబల్‌గా అర్జున్‌రెడ్డి బరిలోకి దిగారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్ అభ్యర్థిగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్ అభ్యర్థిగా అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
టిఆర్ఎస్: టిఆర్ఎస్లో కూడా సీట్ల కేటాయింపు విషయమై తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్ష పదవికి వెంకటేశ్‌గౌడ్ రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా పరకాలలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా భిక్షపతి నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా సామ్యెలు నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్లో సత్యనారాయణ, నకిరేకల్లో రాజేశ్వరి బాలరాజు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
రెబల్స్, రెబల్స్ ...
Published Wed, Apr 9 2014 5:09 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
Advertisement
Advertisement