నా ఊరే..నా చిత్రం | Rishi shares relation with his home town | Sakshi
Sakshi News home page

నా ఊరే..నా చిత్రం

Published Sun, Nov 9 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

నా ఊరే..నా చిత్రం

నా ఊరే..నా చిత్రం

అడుగులు నడకలు నేర్పిన ఇల్లు... కోయిల చిలుకల ఆవాసాలైన చెట్లు...నేడు వర్ణ రంజితమై ప్రకాశిస్తున్నాయి. పల్లె పడచుల వయ్యారాలు.. వారు అలంకరించుకున్న వస్త్రాభరణాలు...కాన్వాస్‌పై కవితలల్లుతున్నాయి.  పుట్టిన ఊరు.. పెరిగిన పరిసరాలు.. కనులను తాకి... కలలను రేపిన ప్రతి దృశ్యం ఇప్పుడు అపు‘రూపం’. మనసును తడిమి.. కుంచెగా మారిన ‘జీవన చిత్రం’ తోట వైకుంఠం.  తెలంగాణ సంస్కృతికి విశ్వఖ్యాతి తెచ్చిన రుషి.. తన నేపథ్యమే ‘చిత్రమై’... స్ఫూర్తి నింపుతున్న వైకుంఠం ప్రయాణం ‘సిటీ ప్లస్’కు ప్రత్యేకం.
 
కరీంనగర్ జిల్లాలో మాది మారుమూల గ్రామం... బూరుగుపల్లి. వేములవాడకు ఐదు కిలోమీటర్లు. ఇప్పటికీ మా ఊరికి బస్సు లేదు. చిన్నప్పటి నుంచీ ఆర్టిస్టును కావాలనే కోరిక. మెట్రిక్యులేషన్ తరువాత 1960లో చిత్రకళ నేర్చుకోవాలని హైదరాబాద్‌కు వచ్చా. ఇక్కడి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఓ ఫ్రెండ్ ఉండేవాడు. సీనియర్. ఎందుకొస్తావు ఇక్కడికి! ఇది నేర్చుకుని మహా అయితే డ్రాయింగ్ టీచర్ కాగలవు.. అంటూ నిరాశపరచాడు. నేనేమో.. ఏ ఎలక్ట్రికలో, మెకానికలో (ఐటీఐ) నేర్చుకోవచ్చంటే... నాన్నతో కొట్లాడి మరీ సిటీకి వచ్చా.

అంతా కొత్తగా...
సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్లి అక్కడి నుంచి నగరానికి రైల్లో వచ్చా. రైలును చూడటం అప్పుడే. కాచిగూడ స్టేషన్‌లో దిగా. జట్కా బండ్లు, సైకిళ్లు, రిక్షాలు.. విద్యుత్ కాంతులు... పెద్ద హంగామా! కోఠి భారతీయ విద్యాభవన్ సమీపంలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఉండేది. గంగారామ్ అని మంచి సింగర్. ఆయనతో కలసి హాస్టల్‌లో ఉండేవాడిని. హైదరాబాద్ రావడానికి ఆయనే సాయం చేశాడు.

అన్నీ కలిపి ఇరవై...
రూమ్ అద్దె, భోజనం, ఇతర ఖర్చులూ అన్నీ కలిపి నెలకు ఇరవై రూపాయల్లో అయిపోయేది. అప్పట్లో దుర్గా విలాస్‌లో ఫుల్ మీల్స్ 60 పైసలు. బృందావన్‌లో గ్రాండ్ భోజనం రూపాయే.
 
సీనియర్ల సహవాసం...
ప్రముఖ ఆర్టిస్టులు సూర్యప్రకాశ్, లక్ష్మాగౌడ్ కాలేజీలో నాకు సీనియర్లు. కాలేజీలో చెప్పే పాఠాలేవీ నాకు ఆర్ట్‌లా అనిపించలేదు. తిరిగి వెళ్లిపోదామన్నంత ఫీలింగ్. కానీ, నాన్నతో కొట్లాడి వచ్చా కదా..! అందుకే ఆగానేమో! రూమ్‌మేట్ సత్యానంద్. ఆయనది కాకినాడ. ఎడ్యుకేటెడ్. హోదాగల పెద్ద ఫ్యామిలీ వాళ్లది. పెయింటింగ్స్ బాగా వేసేవాడు. ఆయనకు సైకిల్ ఉండేది. అప్పట్లో అదో స్టేటస్ సింబల్. ఓసారి కాళీయమర్దనం వేయమంటే... అంతా ఒకేలా గీశారు. అతనొక్కడే డిఫరెంట్‌గా, అద్భుతంగా వేశాడు. అతని ఆర్ట్‌లో మోడ్రనైజేషన్ కనిపించేది.

ఫతే మైదాన్.. పబ్లిక్ గార్డెన్...
నన్ను ప్రోత్సహించి, కొత్త మార్గం చూపింది లక్ష్మాగౌడ్. ఓసారి ఫతేమైదాన్‌కు తీసుకెళ్లాడు. అక్కడున్న స్ట్రీట్ చూసి... యాజ్ ఇటీజ్‌గా గీయమన్నాడు. తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్.. అక్కడి పరిసరాలు, గుర్రాలు, జట్కాలు. చివరకు అదో హాబీగా మారిపోయింది. రోజూ కాలేజీకి వెళ్లే ముందు పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లి... పూల తోటలు, మసీద్ వంటివన్నీ గీస్తూ ఉండేవాడిని. ఫ్రెండ్స్ షరీఫ్, అబ్బూరి గోపాలకృష్ణ, నరసింహారావు, కర్నారావు (ప్యారిస్) కూడా బాగా ప్రోత్సహించారు.

అంతా కాపీనేగా!
ఏంచేయాలన్నా నాకు డబ్బు సమస్య. దాంతో పెయింటింగ్స్ వేయలేకపోయా. 1964లో బాంబే వెళ్లి కొన్ని ట్రయల్స్ వేశా. వర్కవుట్ కాలేదు. వెనక్కి వచ్చేశా. దేవరకొండ వెళ్లి ఓ ప్రైవేటు స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా చేరా. రెండుమూడేళ్లు చేసి, నచ్చక వదిలేశాను. బరోడా (1970) మహారాజా గైక్వాడ్ స్కూల్‌లో ఇండియన్ అండ్ వెస్ట్రన్ ఆర్ట్‌పై చర్చాగోష్టి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల నుంచి ఆర్టిస్టులు వచ్చారు. ఎవర్ని చూసినా.. హీరోలా పోజిచ్చేవారు. వాళ్లంతా... ‘మీ భారత్‌లో ఏముంది.. అంతా వెస్ట్రన్ ఆర్ట్‌ను కాపీ కొట్టడమేగా’ అన్నారు. అప్పుడు ఆలోచించా.. నా ప్రత్యేకత, శైలి ఏముందని!
 
నేటివిటీనే నేపథ్యం...
వెనక్కి వచ్చి మళ్లీ ఉద్యోగంలో చేరా గానీ... మనసు మాట వినడం లేదు. అవే కామెంట్స్ రింగుమంటున్నాయి. అదే నాలో ఆలోచనలు రేపింది. స్థానిక పరిసరాలు, సంస్కృతి, సంప్రదాయాలు తీసుకొని పెయింటింగ్స్ వేస్తే వాటిల్లో జీవ కళ ఉంటుందని అర్థమైంది. నా ఊరు... నేను చూసిన మనుషులు... అక్కడి పండుగలు... పబ్బాలు... ఇప్పుడు ఇవే నా ఆర్ట్‌కు మూలం. శ్రమ జీవి ముఖం చూస్తే... అతడి కథ, కష్టం తెలుస్తుంది. అంత డెప్త్ ఉంటుందా మోములో.

పల్లె పడచులు వేసుకొనే వస్త్రాలు, ధరించే ఆభరణాలు, పాలేర్లు, ఆడుకోవడం, ముస్తాబవడం, చిలుక, అద్దం.. ఇలా అన్నీ నా ఊళ్లో చిన్నప్పటి నుంచి నేను చూసినవే. నా ఆర్ట్ అంతా లైన్స్, ఫ్లాట్ సర్ఫేస్, డాట్స్. అన్నీ ప్రకృతిలో కనిపించే ప్రైమరీ కలర్సే. ‘మై కలర్స్ ఓన్లీ బిలాంగ్స్ టు మై విలేజ్’. అందుకే నా చిత్రాల్లో లైట్స్, షాడోస్ ఉండవు. దాంతో తొలినాళ్లలో అవి ఎవరికీ నచ్చలేదు. ఇవేం పెయింటింగ్స్ అన్నారు.

హుస్సేన్‌కు నచ్చింది...
నాలుగైదేళ్లు ఇలా గడిచిపోయాయి. భోపాల్‌లో పెయింటింగ్ ఎగ్జిబిషన్. అందులో ప్రదర్శించే పెయింటింగ్స్ సెలెక్ట్ చేయడానికి ఓ కమిషన్ వేశారు. దానికి లక్ష్మాగౌడ్ హెడ్. దాదాపు 70 మంది ఫైనలిస్టుల్లో నా పేరు కూడా ఉంది. ప్రదర్శనలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి కొందర్ని నియమించారు. రెండు రౌండ్లు అయిపోయాయి. నా బొమ్మను ఎవరూ పట్టించుకోలేదు. చివరిగా ఎంఎఫ్ హుస్సేన్ వచ్చారు. ఓ రౌండ్ వేసి... ఠక్కున నా పెయింటింగ్ సెలెక్ట్ చేశారు.

లిస్టులో నా పేరుంది. షాకయ్యా. అప్పుడు ఆనందం వర్ణించలేదు. అదే నా లైఫ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందులో ప్రైజ్ రూ.25 వేలు. నా పెయింటింగ్ రూ.500కు అమ్ముడైంది. అదే మొదటిది. ఇప్పుడైతే ఎంతైనా ఇచ్చి కొనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా, నా ధ్యాసంతా బొమ్మలు వేయడమే. 2000లో అమెరికా వెళ్లినప్పుడు అక్కడ అందరూ నన్ను గుర్తు పట్టారు. ఆ గొప్ప నాది కాదు, నా బొమ్మలది. వాటిలోని తెలంగాణ సంస్కృతిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement