
మాడభూషి శ్రీధర్
ప్రశ్నల ద్వారా అడిగే సమాచారం ఏమిటో స్పష్టత లేకుండా, ఒక ఉద్యోగి సర్వీసు రికార్డులో ఉండే వివరాలన్నీ తనకు కావాలని అడగడం న్యాయం కాదు.
విశ్లేషణ
ప్రశ్నల ద్వారా అడిగే సమాచారం ఏమిటో స్పష్టత లేకుండా, ఒక ఉద్యోగి సర్వీసు రికార్డులో ఉండే వివరాలన్నీ తనకు కావాలని అడగడం న్యాయం కాదు. సర్వీసు బుక్ ఉద్యోగి వ్యక్తిగతమైంది. ఆయనకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేని వ్యక్తిగత సమాచారం అని న్యాయస్థానాలు పేర్కొన్నాయి. ఆ అధికారి విధులు, పనివేళలు, అధికారాలు మొదలైన అధికారిక వివరాలు తప్ప ఇతర వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికి ఈ కేసులో వీల్లేదని కమిషనర్ ఆదేశం.
ఒక వీర పౌరుడు విపరీతంగా సహ బాణాలు విసురుతూ పదిరూపాయల అభ్యర్థనలో పదినుంచి ఇరవై ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నాడు. ఎందుకు అడుగుతున్నావో కారణాలు చెప్పమని అడగకూడదని చట్టం నిర్దేశిస్తున్నది. మరో వైపు ప్రజాశ్రేయస్సు కోసం అడిగే సమాచారం ఇవ్వవచ్చు అనీ, ప్రజాశ్రేయస్సు కాకుండా మరొక ఉద్దేశంతో కోరితే ఇవ్వనవసరం లేదని మినహాయింపులు ఉన్నాయి. వీర పౌరుడు అడిగే సమాచారం ఇస్తే అది కొన్ని టన్నులు అవుతుందేమో. కాకపోతే కొన్ని కిలోలు. ఎంత అడిగినా అతను ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో చెప్పడం లేదు. ఒకవేళ అతను అడిగిన సమాచారం ఇస్తే అంత సమాచారం ఏం చేసుకుంటాడో అర్థం కాదు.
వార్షిక నివేదికలు, ముద్రిత పుస్తకాలు, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఈ ప్రశ్నకు జవాబుఇచ్చే తేదీ వరకు ఆరంభించిన పథకాలు ఎన్ని, నిధులు ఎన్ని ఇచ్చారు వంటి ప్రశ్నలకు ఇచ్చే సమాచారం కొన్ని కిలోలు ఉండే అవకాశం ఉంది. అసలు ఇతను ఎవరు, ఎందుకు అడుగుతున్నాడు అని ఆరా తీస్తే తేలిందేమంటే వీర పౌరుడు వేస్ట్ పేపర్‌ను అమ్ముకునే వ్యాపారి అని. అయితే రెండు రూపాయలకు పేజి చొప్పున డబ్బు ఖర్చుచేసి సమాచారం తీసుకుని కిలో లెక్కన ఏ వ్యాపారి కూడా అమ్ముకోవడం సాధ్యం కాదు. ఇందులో మరొక కుట్ర కూడా ఉంది. అదేమంటే కావాలని సమాచార సమాధానం ఆలస్యం చేయించి, ఆ తరువాత చట్టం ప్రకారం ఉచితంగా సమాచారం తీసుకునే నియమాన్ని కూడా వాడుకునే దుర్మార్గ ప్రయత్నం ఉందని తేలింది. ఇటువంటి చెత్త ఆలోచనలు రావడం చాలా దురదృష్ట్టకరం. వ్యక్తిగత ద్వేషంతో సమాచారం అడగడం ఆ హక్కును దుర్వినియోగం చేయడమే అవుతుంది. సమాచార హక్కు ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించవలసిన సాధనం, అప్పుడే ఆయుధం అవుతుంది. సొంత అవసరాలకోసం లేదా పక్కవాడిని సతాయించడం కోసం సమాచారం కోరడం మొదలు పెడితే ఆ హక్కు తెచ్చిన పరమలక్ష్యం దెబ్బతింటుంది.
ఒక్కోసారి సొంత హక్కుల రక్షణ కూడా అవసరమే. అందుకు కావలసిన సమాచారం అడగడంలో తప్పు కూడా లేదు. కాని ఆ పేరుమీద మరెవరినో వేధించడానికి సమాచార హక్కును వినియోగించడం దుర్మార్గం. మహేందర్ అనే పౌరుడు ఢిల్లీ ఆహార సరఫరా శాఖలో నాలుగో మండలాధికారిగా పనిచేసే వ్యక్తి ఎప్పుడు నియమితుడైనాడు, అతనికి ఎన్ని పోస్టులు అప్పగించారు. ఎప్పటినుంచి, ఎన్ని సార్లు బదిలీ అయ్యాడు, ఎందుకు ఎప్పుడు, అతని పైన ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్నిటిమీద విచారణలు జరిగాయి, ఆయన కుల సర్టిఫికెట్, భార్య పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్, అతనికి ఎన్ని స్థిర చరాస్తులు ఉన్నాయి? బంగారం ఎంత ఉంది, ఆయన పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతున్నారు, వారిని ఆ పాఠశాలల్లో చదివించేంత డబ్బు ఆయనకు ఎక్కడనుంచి వచ్చింది, ఆయన ఎన్ని విచారణలు నిర్వహించాడు? వంటి అనేకానేక వివరాలు అడిగాడు. పిఐఓ ఆ వివరాలు తమ శాఖ దగ్గర లేవని ఒక్క సమాధానంతో తిరస్కరించి తరువాత మొదటి అప్పీలుకు వెళ్లడం అక్కడ కూడా తిరస్కారం రావడంతో కమిషన్ ముందుకు రావడం జరిగింది. ఎస్ కె పౌల్ అనే అధికారి గురించి ఇతను ఆరా తీస్తున్నాడు. ఆయనే స్వయంగా కమిషన్ ముందుకు వచ్చి విచారణకు హాజరయ్యారు.
ఈ సమాచారం కోరడం వెనుక ఉన్న ప్రజా ప్రయోజనమేమిటి అని కమిషన్ ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు. పైగా మీరు ప్రశ్నలు అడగడానికి కారణాలు అడిగే వీలు లేదని , చట్టం కారణాలు అడగకుండానే సమాచారం ఇవ్వాలని నిర్దేశించిందని వాదించారు. అదే చట్టంలో ప్రజాప్రయోజనం ఉంటేనే కొన్ని సమాచారాలు ఇవ్వాలని నిర్దేశించిందని కమిషన్ వివరించవలసి వచ్చింది. మీరెవరు అని కూడ అడగడానికి వీల్లేదని దరఖాస్తు దారు వాదించారు. నిజానికి ఆయన వాదం చట్టబద్దమైందే. తానెవరో అడగకుండా, తాను ఎందుకు సమాచారం కోరుతున్నాడో అడగకుండానే సమాచారం ఇవ్వతగినైదతే ఇవ్వాలని చట్టం వివరిస్తున్నది. అయితే ఆయన కోరిన సమాచారం ఇవ్వతగినదా కాదా అని విచారించడానికి ప్రజా ప్రయోజనం ఉందా లేదా అనే విచారణ అవసరమవుతుందని కూడా అదే చట్టం నిర్దేశిస్తున్నది. సమాచార చట్టం కింద అధికారికంగా తమంత తామే ఇవ్వవలసిన సమాచారాన్ని ఆ విధంగా ఇవ్వకపోతే ఎవైరనా అడగవచ్చు, ఎందుకోసమైనా అడగవచ్చు. కాని మినహాయింపులకు లోబడిన సమాచారాన్ని చెప్పమని అడిగే వ్యక్తులు ఆ సమాచారం ఏ ప్రయోజనాలకోసం అవసరమో చెప్పవలసి ఉంటుంది.
ముఖ్యంగా సెక్షన్ 8 (1)(జె) కింద వ్యక్తిగత సమాచారం అడిగినపుడు, మూడో వ్యక్తి సమాచారం లేదా అతని కుటుంబానికి సంబంధించిన సమాచారం, ప్రజా కార్యక్రమాలతో ఏమాత్రం లేని సమాచారం, అతని వ్యక్తిగత గుట్టును దెబ్బతీసే సమాచారం ఇవ్వడానికి వీల్లేదని నిషేధిస్తున్నది. అయితే బహుళ ప్రజాప్రయోజనాలు ఉంటే ఆ సమాచారాన్ని కూడా ఇవ్వాలని కమిషన్ నిర్ణయించవచ్చునని ఆ సెక్షన్‌లో మినహాయింపు వివరిస్తున్నది. కనుక ప్రయోజనం గురించి, దరఖాస్తుదారు గుణగణాల గురించి అడగడం చట్టపరమైన అవసరం. మీరెవరు అంటే సోషల్ వర్కర్ అన్నాడాయన. అంటే ఏమిటో వివరించలేదు. ఏం పనిచేసారు? సమాజ సేవ అందులోఎంత? అనే ప్రశ్నలకు జవాబు లేదు. పోనీ మీకు ఆ వ్యక్తి మీద ఏమైనా పగ ఉందా అంటే చాలా నిర్లక్ష్యంగా ఏమో ఉంటే ఉండవచ్చు అని సమాధానం చెప్పాడు.
ప్రశ్నల ద్వారా అడిగే సమాచారం ఏమిటో స్పష్టత లేకుండా, ఒక ఉద్యోగి సర్వీసు రికార్డులో ఉండే వివరాలన్నీ తనకు కావాలని అడగడం న్యాయం కాదు, నిజానికి ఈ కేసులో సమాచార అభ్యర్థనలో అడిగిన సమాచారం అంతా ఒక వ్యక్తి సర్వీసు రికార్డులో ఉంటుంది. ఇవ్వవలసి ఉంటే మొత్తం సర్వీసు బుక్ కాపీ ఒకటి ఆయన చేతిలో పెట్టాలి. కాని సర్వీసు బుక్ ఉద్యోగి వ్యక్తిగతమైంది. ఆయనకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేని వ్యక్తిగత సమాచారం అని న్యాయస్థానాలు పేర్కొన్నాయి. ఆ అధికారి విధులు, పనివేళలు, అధికారాలు మొదలైన అధికారిక వివరాలు తప్ప ఇతర వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికి ఈ కేసులో వీల్లేదని కమిషనర్ ఆదేశం.
ఇది సమాచార హక్కును వ్యక్తిగత పగలు తీర్చుకోవడానికి వాడుకునే దుర్వినియోగం, ప్రజల మేలుకోసం వాడవలసిన సమాచార హక్కును వ్యక్తి గత స్వార్థం కోసం లేదా సరదాగా లేదా ఏడిపించడం కోసం వాడుకో వాలనుకునే వారు ప్రజా ధనాన్ని అంతకు మించిన ప్రజాసమయాన్ని వృధా చేయడమే గాకుండా, ఆ సమయాన్ని ప్రజా ప్రయోజనపూరితమైన సమాచారాన్ని సేకరించి ఇచ్చేందుకు సద్వినియోగం చేయకుండా నిరోధిం చడం అవుతున్నది. ఇటువంటి దుర్వినియోగాలను అరికట్టవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. పగ తీర్చుకోవడానికి ఆర్టీఐని బాణంగా ఉపయోగించకూడదు. ఆ ప్రయత్నం చేస్తే ప్రజాసంస్థలు ధనుస్సులు కాకూడదు, కమిషనర్లు అల్లె తాడు లాగే భుజాలు చేయకూడదు. ఆర్టీఐ బాణాలు వ్యర్థంగా విసరకూడదు.
(మహేందర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ ఆహార సరఫరా శాఖ కేసు 2014,490, డిసెంబర్ మూడో వారం తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com