మిషెల్ - బారక్ ఒబామా
ఎప్పుడూ పిల్లలతో కలిసి ముచ్చటగా కనిపించే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు త్వరలో విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియదుగానీ, వారు విడిపోబోతున్నారన్న వార్త వినడానికే బాధగా ఉంటుంది. ఒబామా, మిషెల్లది 22 ఏళ్ల కాపురం - ఇద్దరు పిల్లలు. ఒబామా మాట్లాడిన ప్రతిసారీ భార్యా - పిల్లలు- కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ముఖ్యంగా భార్య గుణగణాల గురించి తెగ పొగిడేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా కేవలం బిల్డప్‌కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే 50వ పుట్టిన రోజు జరుపుకున్న అమెరికా ప్రథమ మహిళ మిషెల్ కూడా అంతే మాట్లాడేవారు. వారిది ఎంతో అన్యోన్య దాంపత్యం అని అందరూ అనుకుంటున్నారు.
బరాక్ ఒబామా, మిషెల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొన్నిరోజులుగా పలు అంతర్జాతీయ పత్రికలు, టీవీలు, వెబ్సైట్లు కోడై కూస్తున్నాయి. మిషెల్ - ఒబామా మధ్య మనస్పర్థలు వచ్చాయి - భర్తతో మిషెల్ అనధికారికంగా తెగదెంపులు చేసుకున్నారు - వేరువేరు బెడ్‌రూమ్‌లలో పడుకుంటున్నారు - వారిద్దరూ 2016లో విడిపోతారని.... ఇలా ఒక్కటేంటీ ఎన్నో రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్నెన్నో పుకార్లు. అయితే విడాకులు మాత్రం ఇప్పుడు తీసుకోరని వార్తలు వస్తున్నాయి. ఒబామా పదవీకాలం ముగిసేవరకూ మిషెల్ ‘వైట్‌హౌస్’లోనే ఉంటారు.
ఇంతకీ మిషెల్‌కు ఒళ్లెందుకు మండింది? దానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానమైనది ఒబామాకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు మిషెల్కు అనుమానం. ఒబామా అధ్యక్షుడుగా పోటీ చేసే సమయంలో ప్రచారం కోసం తెగ కష్టపడిన ప్రచారకర్త 'వెరా బేకర్'తో అతనికి అఫైర్ ఉన్నట్లు మిషెల్ నమ్ముతున్నట్లు మీడియా ప్రచారం. నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా అంత్యక్రియల సమయంలో ఈ జంట మధ్య రేగిన వివాదం మీడియాకెక్కింది. ఆమె పక్కనే కూర్చున్నా ఒబామా పట్టించుకో కుండా, డెన్మార్క్ ప్రధాని ధోర్నింగ్ ష్మిత్తో కబుర్లు చెప్పుకున్నారట. అంతేకాకుండా ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారట. దాంతో మిషెల్‌కు కడుపు మండిపోయింది. పట్టలేని కోపం వచ్చిందట. హావాయిలో క్రిస్మస్ హాలీడేస్ సమయంలో ఇంట్లో మిషెల్ లేనప్పుడు ఒబామా ఓ మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌తో కనిపించారని సమాచారం.
విడాకుల విషయమై ఇప్పటికే మిషెల్ లాయర్‌ను సంప్రదించినట్లు సమాచారం. భర్త ఆస్తుల్లో సగభాగం పొందేందుకు ఏమేం చేయాలో కూడా ఆమె ఆరాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్‌గా ఒబామా గద్దె దిగిన తరువాత అతనితో ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తాను మాత్రం పిల్లలతో పాటు వాషింగ్టన్ డిసిలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒబామా తన సొంతూరైన హవాయిలో శేష జీవితం గడపాలనుకుంటున్నారని తెలుస్తోంది.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఇలాంటి భామకలాపంలో చిక్కుకుని పేరు పొగొట్టుకున్నారు. ఇప్పుడు ఒబామా కూడా అదే స్థితిలో ఉన్నారని అమెరికాలో తెగ గుసగుసలు వినవస్తున్నాయి. ఇంత ప్రచారం జరుగుతున్న వైట్హౌస్ మాత్రం స్పందించడంలేదు. వాషింగ్టన్‌లోని మీడియా హౌజ్లు ఈ పుకార్లను లైట్గా తీసుకుంటున్నాయి. నిప్పు లేందే పొగరాదుగా అని కొందరంటుంటే, ఆదర్శ దంపతులు తప్పటడుగు వేస్తారని అనుకోవడం లేదని కొందరు గట్టిగా వాదిస్తున్నారు.