
షేర్ ద సిటీ కల్చర్!
షేర్ అంటే పులి అన్న సంగతి అందరికీ తెలిసిందే. షేర్ అనే పదం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనకు బాగా ఇష్టమైన వారి ముందు ఆ పదం చేర్చితే... షేర్ ఎంత మాత్రమూ బాధపడదు. పైగా తనను పులి అని సంబోధించినందుకు మనం పిలిచినవాడూ సంతోషపడతాడు. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రతి వర్ధమాన నాయకుడి పేరు మొదటా ఆ బిరుదు ఉంటుంది. ఇందుకు నగరంలో ఏర్పాటయ్యే ఫ్లెక్సీలే సాక్షి.
ఇక షేర్ అనే మాటకు నానార్థాలూ ఉన్నాయి. అవన్నీ మన నగరంలో ఉన్నాయి... ఉంటాయి. ముషాయిరాల్లో చదివే కవిత్వాన్ని షాయరీ అంటారన్న విషయం తెలిసిందే. పోయెట్రీ మొత్తాన్ని కలిపి షాయరీ అంటారేమోగానీ... పోయమ్‌ను మటుకు షేర్ అనే అంటారు. అలాంటి షేర్... షాయరీలకు ఎప్పట్నుంచో నిలయం మన హైదరాబాద్. ‘షేర్’ అర్జ్ కరూ’ అంటూ... పులిని వదుల్తా వదుల్తా అని బెదిరిస్తుంటాడు కవి. దాంతో వహ్వా వహ్వా అంటూ చుట్టూ ఉన్న రసజ్ఞులు వహ్వాకారాలు చేస్తారు.
ఇక మరో రకం షేర్‌ల విషయానికి వస్తే... ఇవి పెట్టుబడులు. ఇటీవలే కొంతకాలం క్రితం ఫలానా కంపెనీ షేర్‌లు కొనూ, ఫలానావి అమ్ము అనే మాటలు విస్తృతంగా వినపడేవి. కానీ ఆ షేర్‌లలో చాలామటుకు పేపర్ టైగర్స్ అని మాత్రమే తెలిశాక... ఇటీవల ఈ మాటల విస్తృతి ఒకింత తగ్గింది. కానీ ఈ తరహా షేర్‌ల గౌరవార్థం మన నగరంలోనూ హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరిట షేర్ మార్కెట్ ఒకటుంది. అలా నగరం ఈ తరహా ‘షేర్’లనూ గౌరవించింది.
ఇక ‘షేర్’వానీ అనే మాటకు వద్దాం. నవాబీ దుస్తుల తరీఖాలో ధరించే ఈ వస్త్ర విశేషం హైదరాబాద్‌కు ప్రత్యేకం. ఇప్పట్లో ఫార్మల్ మీటింగ్స్‌కు సూట్‌లు వేసుకున్నట్లే... అప్పట్లో నవాబు దర్జాలూ, పెద్ద పెద్ద ఉద్యోగ హోదాలూ, తాము పెద్దమనుషులమనే సందేశాలూ చాటుకోడానికి ‘షేర్’వానీనే ఉపయోగించేవారు. క్రమంగా అవి పెళ్లిళ్లకు మాత్రమే వాడే సంప్రదాయ దుస్తులైపోయాయి. వీటన్నింటినీ గమనించినకొద్దీ షేర్వానీ అంటే... ‘పులి దుస్తులు’ లేదా ‘పులి ధరించే దుస్తులు’ అనే అర్థం ఏదైనా ఉందేమోనని నా సందేహం. భాషావేత్తలు ఈ దిశగా కృషి చేస్తే నా మాటలోనూ నిజముందని నిగ్గుదేలే అవకాశముందని నా పూర్తి నమ్మకం.
అలాగే... బిర్యానీతో పాటూ కలుపుకోడానికి వాడే పులుసులాంటి వంటకం ‘షేర్’వా. అంటే ఏమిటన్నమాట... తమ ఒక తరహా పులుసు కూరకూ పులి పేరు పెట్టుకోడానికే మన హైదరాబాదీలు ఇష్టపడ్డారన్నమాట. అందుకే షేర్వానీ ధరించి, బిర్యానీ తింటూ ‘షేర్వా’ కలుపుకుని మన నోట్లోని జీబ్‌ను సంతృప్తిపరచడం హైదరాబాదీ తెహ‘జీబ్’... అనగా ఫుడ్‌కల్చర్ అయింది.
ఇప్పటి వాళ్లకు పెద్దగా ఆ పేరు తెలియదు గానీ... మన ఓల్డ్ సిటీలో ఒక ఏరియా మొత్తానికి కలిపి పులి పేరు పెట్టారు. అంతేనా... రేపెవరైనా ఆ ఏరియా పేరు మారుస్తారేమో అనే భయంతో అక్కడ మట్టితో చేసిన పులి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అందుకే ఆ ఏరియాను అందరూ ‘మిట్టీ కా షేర్’ అనగా... మట్టితో చేసిన పులి అని నామకరణం చేశారు. పులీ పులీ అంటూ మనవాళ్లు నగర మహిళల గౌరవాన్ని తగ్గించిందేమీ లేదు. ఎందుకంటే మిట్టీ కా షేర్ ప్రాంతంలో ఎక్కువగా తయారయ్యేది నగర ‘షేర్‌నీ’లకు చాలా ఇష్టమైనవీ, కళ్లు మిరిమిట్లుగొలిపేలా మెరుస్తూ ఉండేవైన గాజులే! ఇవన్నీ తెలిశాక నగరవాసి చెప్పే మాట ఒక్కటే. ‘మామూలుగా పులి అంటే అడవిలో ఉండే పులి. కానీ హైదరాబాద్ అంటే మాత్రం నగరాలకే పులి’!!