కునుకమ్మా సిటీ చేరవే..
‘ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరగదు’ సామెత పాతదే అయినా.. నిత్య అన్వయమే. నిద్రాదేవి ఆవహిస్తున్న వేళ.. పరుపులు అక్కర్లేదు. కటిక నేలైనా.. రాతి పలకైనా.. హంసతూలికా తల్పమే. ఇంత చోటు దొరికిందంటే చాలు మహారాజులా నిద్రపోయే శ్రమజీవులెంతో మంది. కానీ నగరానికే నిద్రపట్టడం లేదు. సాఫ్ట్‌వేర్ జాబ్స్, లేట్‌నైట్ షిఫ్ట్స్, హైఫై నైట్ లైఫ్.. సిటీకి కునుకు లేకుండా చేస్తున్నాయి. ‘మునిమాపు వేళాయె కనుపాప నినుకోరే...
కునుకమ్మ ఇటు చేరవే’ అంటూ కునుకుపాటలు పాడుతున్న నగరం పాట్లు ‘వరల్డ్ స్లీప్ డే’ సందర్భంగా..
- కట్ట కవిత
మంచి జీతం.. మంచి జీవితం నగరవాసికి నిద్రపట్టనివ్వడం లేదు. కాసుల వేటలో పడ్డ సిటీవాసులు నిద్రమాట మరుస్తున్నారు. సాఫ్ట్‌వేర్ బూమ్, హెఫై లైఫ్ వెరసి సిటీ కునుకును కొండెక్కేలా చేశాయి. ఇప్పుడు నగరం.. ప్రతి రోజూ 24 గంటలూ మేల్కొనే ఉంటోంది. నగరవాసి కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్స్‌కు కళ్లప్పగించి.. గుడ్లగూబలా నిద్ర కాస్తున్నాడు. టెకీలు వృత్తిరీత్యా మెలకువతో ఉంటే.. సిటీ యూత్ సోషల్ మీడియా పుణ్యాన నిద్రకు దూరమవుతోంది.
స్లీప్‌లెస్ డిసీజెస్..
జీవగడియారానికి అడ్జెస్ట్ కాని క్లాక్‌ను ఫాలో అవుతూ సూర్యాస్తమయం తర్వాత కృత్రిమ వెలుగులో ఎక్కువ సేపు గడపడం, వేళాపాళా లేకుండా భోజనం చేయడం వంటివి చేస్తున్నారు. ఫలితం సిటీజెన్స్ డయాబెటిస్, ఒబెసిటీ, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
ఇన్‌సోమ్నియా, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అష్నియా సిండ్రోమ్, సర్కాడియన్ రిథమ్ స్లీప్ డిజార్డర్‌వంటి నిద్ర సంబంధిత జబ్బులకు గురవుతున్నారు. నిద్రలేమితో ప్రతి నెలా 300 మందికిపైగా నగరంలోని 35 హాస్పిటల్స్‌కి క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం ఐటీ, కార్పొరేట్ సెక్టార్స్‌లో పని చేస్తున్నవారే. రాత్రిపూట కృత్రిమ లైట్స్ వెలుగులో దీర్ఘకాలికంగా పనిచేయడం వల్ల కంటి చూపు సమస్యలు, వెన్నునొప్పి కూడా వస్తాయంటున్నారు డాక్టర్లు.
నవ్వు నాలుగు విధాలా మంచిది. మంచి నిద్ర.. నాలుగు వందల విధాలా శ్రేష్టం. రోజుకు 16 గంటలు ఏదో వ్యాపకంతో ఉండే దేహానికి ఓ ఎనిమిది గంటలు మంచి నిద్రనిస్తే.. కుదరకపోతే ఆరు గంటలైనా సరే..! మళ్లీ నూతనోత్తేజం పొందడం ఖాయం. ఎలాంటి వ్యాధులూ మీ దరిదాపులకు కూడా రావు. సో స్లీప్ వెల్!
ప్రమాదకరం..
ప్రతి పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపువారే. నిద్రలేమి వల్ల మానసిక, శారీరక సమస్యలేర్పడతాయి. సెక్సువల్ హార్మోన్స్‌పైనా ప్రభావం పడుతుంది. రక్తపోటు, గుండెపోటు, మధుమేహం.. వంటి జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. రోజుకు వందమంది రోగులు వస్తే వారిలో 20 శాతం మంది నిద్రలేమి బాధితులే.
- డాక్టర్ శశికిరణ్, జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్