తెలుగు సినీ ప్రపంచంలో 2013 సంవత్సరం తీరని విషాదాన్ని మిగిల్చింది. వరుసగా మూడు నెలల్లో ముగ్గురు మేటి నటులు మరణించారు.
తెలుగు సినీ ప్రపంచంలో 2013 సంవత్సరం తీరని విషాదాన్ని మిగిల్చింది. వరుసగా మూడు నెలల్లో ముగ్గురు మేటి నటులు మరణించారు. రియల్ స్టార్ శ్రీహరి, హాస్యనటులు ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఈ ముగ్గురినీ టాలీవుడ్ ఒక్క సంవత్సరంలోనే, అది కూడా వరుస నెలల్లో కోల్పోవడం పెను విషాదమే.
సినిమా ప్రపంచంలోకి ప్రవేశించాలంటే ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉండాల్సిందే. కానీ అలా ఎవరూ లేకుండా ఒక విలన్గా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసి, క్యారెక్టర్ నటుడిగాను, హీరోగా కూడా తనదైన ఒక ముద్ర వేసుకున్న రియల్ స్టార్ శ్రీహరి.. కాలేయానికి సంబంధించిన వ్యాధితో అక్టోబర్ 9వ తేదీన మరణించారు. ముంబైలో 'ఆర్.. రాజ్కుమార్' చిత్రం షూటింగ్ కోసం వెళ్లిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీహరి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులకు సరిగా తెలియకపోవడం, ఆయన తన ఫైళ్లను తీసుకెళ్లకపోవడం వల్ల సరైన సమయానికి చికిత్స అందకపోవడం వల్లే మరణించారు. దీంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం అలముకుంది.
ఇక ప్రముఖ హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (ఏవీఎస్) కాలేయ సమస్యతో నవంబర్ 8వ తేదీన మరణించారు. ఆయనకు 2008లో కాలేయం పాడైపోగా.. అప్పట్లో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఏవీఎస్ కుమార్తె శ్రీప్రశాంతి ఆయనకు లివర్‌ను దానం చేశారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఐదేళ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. నటనే ప్రాణంగా బతుకుతున్న ఏవీఎస్ వేళకు మందులు వేసుకోకపోవడం, సమయానికి వైద్యుడిని సంప్రదించకపోవడంతో కాలేయంలో మళ్లీ ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స అందించినా, ఇన్‌ఫెక్షన్ తగ్గకపోగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడింది. పాత్రికేయుడిగా, హాస్య నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఆయన బహుముఖ ప్రతిభ కనబరిచారు. 'తుత్తి' అనే డైలాగుతో హాస్యనటుడిగా జీవితం ప్రారంభించి అనేక చిత్రాల్లో తన నటనతో జీవించారు.
మాటల విరుపులు, శోభన్ బాబు రింగు అంటూ జుట్టును స్టైలుగా ముందుకు రింగు చుట్టుకోవడం, చేతులమీద పాఠాలు రాసుకునే లెక్చరర్ అవతారం.. ఇలా అనేక పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం డిసెంబర్ 7వ తేదీన కన్నుమూశారు. ఆరు నెలల క్రితం కాలేయ కేన్సర్ వ్యాధి బయటపడిన తర్వాత చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. దూరదర్శన్ చానల్లో 'ఆనందోబ్రహ్మ' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ధర్మవరపు అంతకుముందే ప్రకాశం జిల్లాలో ప్రజానాట్య మండలి కళాకారుడు. పలు నాటకాలతో రంగస్థలాన్ని ఏలారు. వీడీవో ఉద్యోగానికి ఎంపికై.. హైదరాబాద్లో శిక్షణ పొందుతుండగా దూరదర్శన్లో అవకాశం వచ్చింది. 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రంతో తెరంగేట్రం చేసి, 'ప్రేమా గీమా జాన్తా నై' చిత్రం వరకు అనేక సినిమాల్లో హాస్యం పండించారు.
ముగ్గురు నటులూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నవారే. ఈ ముగ్గురినీ ఒకే సంవత్సరంలో కోల్పోవడం మాత్రం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది.