ట్రావెల్ క్వీన్స్ | travel queens | Sakshi
Sakshi News home page

ట్రావెల్ క్వీన్స్

Published Thu, Mar 26 2015 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

ట్రావెల్ క్వీన్స్

ట్రావెల్ క్వీన్స్

ప్రయాణం.. పుస్తకాన్ని మించి జ్ఞానాన్ని పంచుతుంది. జీవితాన్ని చదవడంలో ప్రయాణం కూడా ఓ చాప్టరే. ఇక, సోలో జర్నీ అయితే నీలోకి నిన్ను తీసుకెళ్తుంది. మనసుకి రెక్కలు కట్టి ప్రకృతి రాజ్యానికి క్వీన్‌ను చేస్తుంది!. అందుకే ప్రయాణానికి మజిలీలే కాని లక్ష్యం ఉండకూడదంటారు!. ఆ లస్ట్‌ని శ్వాసిస్తున్న భాగ్యవంతుల్లో మన భాగ్యనగర మహిళలూ ఉన్నారు!!. కన్యాకుమారి నుంచి కశ్మీర్  దాకా, ఇండియాలో ఈస్ట్ టు వెస్ట్‌కి వరల్డ్‌లో హాయిగా విహరిస్తున్న ఆ క్వీన్స్ పరిచయం..
 ..:: సరస్వతి రమ
 
సోలో ఉమన్ ట్రావెలర్‌కు మెట్రో కల్చర్ ఇప్పుడిస్తున్న పర్యాయపదం.. క్వీన్! కారణం.. బాలీవుడ్ ‘క్వీన్’ మూవీ. పెళ్లిరోజు పెళ్లికూతురికి పెళ్లికొడుకు ‘నీకు, నాకు సరిపడదు’ అని షాక్ ఇస్తాడు. బ్యాండ్, బాజా, బారాత్ ఆగిపోతాయ్. కానీ పెళ్లికూతురు అక్కడే ఆగిపోదు.. లండన్‌కు సాగిపోతుంది మొండిగా.. సోలో హానీమూన్ కోసం! ఆత్మవిశ్వాసంతో తిరిగొస్తుంది. ఇదీ ఆ సినిమా లైన్. ‘సోలో ఉమన్ ట్రావెలింగ్’ అనే ఈ లైనే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొస్తున్న మహిళలను మహారాణుల్ని చేస్తోంది. ఈ అడ్వంచర్, సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ జర్నీ నగరంలోనూ టేకాఫ్ అవుతోంది. హైదరాబాద్ వాండరర్స్‌లో గరిమెళ్ల గౌరి, అనూషా తివారి ఉన్నారు.
 
సింగిల్ జర్నీలో ఉన్న మజా..
ప్రయాణం వీళ్లకు ప్రహసనం కాదు.. ఉల్లాసం, ఉత్సాహం. గరిమెళ్ల గౌరి వారం కిందటే రాజస్థాన్‌లోని బార్‌మేర్‌కి వెళ్లారు కేర్‌ఇండియాలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా కొలువులో చేరడానికి. తన సోలో ట్రావెల్ హాబీ గురించి చెప్తూ ‘నేను డిగ్రీ నాటి నుంచే సోలో ట్రావెల్ చేస్తున్నాను. బేసిగ్గా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం.

కొత్త ప్రదేశాలు చూడటం, కొత్తవాళ్లతో పరిచయాలు, భిన్న సంస్కృతుల అధ్యయనం అంటే పిచ్చి. నా ఫస్ట్ సోలో జర్నీ డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ టు షిరిడీ. ఫ్యామిలీతో వెళ్లాల్సిన నేను ఏవో అవాంతరాల వల్ల ఒక్కదానినే మొండిగా షిరిడీ ప్రయాణమై.. హ్యాపీగా తిరిగొచ్చాను. ఆ జర్నీ నాకు బోలెడంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు గౌరి. ఒంటరి ప్రయాణంలో మజా తెలిశాక నా ప్రయాణాల పరంపర ఆగలేదు.

పీజీలో ఉండగా సౌతిండియా టూర్ మొత్తం ఒంటరిగానే చేశాను. ఇది ఎండాఫ్ నైంటీస్ విషయం. అప్పట్లో ఇన్ని ట్రావెల్ ఏజెన్సీలు లేవు. ఫ్లయిట్ జ ర్నీ లగ్జరీగానే ఉండేది. ఇప్పటికీ ఒకరోజు హాలిడే దొరికినా, రొటీన్ వర్క్ నుంచి బ్రేక్ కావాలనుకున్నా నచ్చినప్లేస్‌కి వెళ్లిపోతాను. వెళ్లేటప్పుడు కొన్ని సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటాను. నా బడ్జెట్‌లో హోటల్‌ను బుక్ చేసుకుంటాను. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ నెంబర్లు, ఇతర అధికారుల నంబర్లు తీసుకుంటాను.

ఫ్యామిలీతో టచ్‌లో ఉంటాను. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, ఇటు వెస్ట్ టు ఈస్ట్ ఇప్పటి దాకా కనీసం నాలుగుసార్లయినా టూర్ చేసి ఉంటాను. ఈ జర్నీలో ఎన్నో ఎక్స్‌పీరియెన్స్.. వెంట ఎవరూ ఉండరు కాబట్టి నాపై ఎవరో అటెన్షన్ పే చేస్తున్నారనే భావన ఉండదు. ఇప్పుడు మా అక్కయ్య పిల్లలూ నాలా సోలో ట్రిప్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్‌లో యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాను’ అన్నారు గౌరి.
 
జర్నీ టు కాన్ఫిడెన్స్
అనూషా తివారి.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు. తర్వాత ఏంబీఏ చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. తన సోలో జర్నీ అభిరుచిని అభివర్ణిస్తూ ‘ఇంజనీరింగ్ తరువాత సడెన్‌గా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఒంటరిగా లాంగ్ జర్నీ చేయాలనిపించేది. అప్పుడే ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్లిన నా ఫ్రెండ్‌కి మెయిల్ పెట్టాను నా పరిస్థితి గురించి.

ఆమె తన అంకుల్ వాళ్ల ద్వారా నాకు టూరిస్ట్ వీసా వచ్చేలా హెల్ప్ చేసింది. ఇంట్లో వద్దన్నా వినకుండా యూఎస్ వెళ్లాను. పేరుకే ఫ్రెండ్ దగ్గర అకామిడేషన్ కానీ దాదాపు ఫార్టీ డేస్ ఒక్కదాన్నే న్యూయార్క్, న్యూజెర్సీ, లాస్‌వెగాస్, బోస్టన్, నయాగరా, గ్రాండ్‌కెన్యన్, ఆరిజోనా, ఫ్లోరిడా.. వంటి ప్లేసెస్‌కి వెళ్లాను. కొత్త మనుషులు, కొత్త విషయాలు నా పర్‌సెప్షన్‌ను మార్చేశాయి.

లైఫ్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. సోలో జర్నీ అప్పట్నుంచి హాబీ అయింది. సిటీకొచ్చాక ఆరు నెలలు ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్లాను. వారం రోజులున్నా అక్కడ ఏదో ఒక జాబ్ చేసేదాన్ని. ఆ చిన్న, షార్ట్‌టైమ్ ఉద్యోగాలు నాలో కాన్ఫిడెన్స్ పెంచాయి. శ్రమ విలువను తెలిపాయి. ఆ సిక్స్ మంత్స్ పీరియడ్ నాకు చాలా క్రూషియల్. తిరిగొచ్చాకే ఎంబీఏ చేశాను. మంచి జాబ్ సంపాదించుకున్నాను. ఇప్పుడు టెక్సాస్‌లో బీఎండబ్ల్యూ కంపెనీలో జాబ్ వచ్చింది.

వచ్చే నెల వెళ్తున్నా. అయిదేళ్లుగా ప్రతి ట్రిప్‌ని సోలోగానే ఎంజాయ్ చేస్తున్నా. లాస్ట్ సమ్మర్ స్విట్జర్లాండ్ వెళ్లా. అబ్రాడ్‌లో సేఫ్టీ కూడా ఎక్కువ. నాకు స్విట్జర్లాండ్, అరిజోనా బాగా నచ్చే ప్లేసెస్. ఐ లవ్ టు బీ దేర్.. ఆరిజోనాను అందరూ ఎడారి అంటారు కానీ ఆసమ్ ప్లేస్. ఆ దారి ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అంతలా ఆ నేచర్‌లో ఇన్‌వాల్వ్ అవుతాం’ అంటుంది అనూషా తివారి.
 
సెర్చ్ అండ్ గైడ్..
‘ఈ రోజుల్లో చాలా సమాచారం ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. అందువల్ల ఆ ప్రాంతం, అక్కడి పరిస్థితులు, తిండి గురించి ముందే తెలుసుకోవచ్చు. అందుకే వెళ్లే ముందు రీసెర్చ్ చెయ్యాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లాక మన ఇన్‌స్టింక్ట్ మనని గైడ్ చేస్తూనే ఉంటుంది. అవసరమైన చోట ఆ ప్రాంతం వాళ్ల హెల్ప్ తీసుకోవాలి’ అని చెబుతున్నారు 50 దేశాలు చుట్టొచ్చిన ప్రముఖ సోలో ట్రావెలర్ అంశుగుప్త.
 
ప్రతి ప్రయాణం నూతనం..
క్వీన్ సినిమా ముంబైలో చూసిన ఒక మిత్రుడు ‘నువ్వూ, నీ కథలో అమ్మాయిలు గుర్తొచ్చారు’ అని ఫోన్లో చెప్పినప్పుడు, ఆ కథని చెప్పమని అడిగితే అతను చెప్పారు. థ్రిల్డ్. తర్వాత క్వీన్ చూసి సంబరపడి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. కంగనాని అనుపమా చోప్రా చేసిన ఇంటర్వ్యూ చూశాను. జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు చేస్తాం. అనేక పాత్ర ల్లో ప్రయాణిస్తాం. నాకు గుర్తున్నంత వరకు పదమూడేళ్లప్పుడు ఒక్కదాన్నే చేసిన మొదటి ప్రయాణం గోదావరిపై పడవలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుకుని, లంకలోకి వెళ్లటం, లంకలో  ఒక్కదాన్నే తిరగటం పూర్తిగా సరికొత్త అనుభవం. ఆ తర్వాత ఒంటరిగా నా 19వ ఏట ముంబైకి వెళ్లాను. ఆ ప్రయాణం ఎన్నడూ మరువలేను. ఒంటరి ప్రయాణాలెన్నో చేశాను. ఈ పయనంలో ఎదురైన రకరకాల మనుషులు, పచ్చని ప్రకృతి నాలో ఉత్తేజాన్ని నింపుతాయి. ప్రతి జర్నీ నూతన జీవన సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది.    - కుప్పిలి పద్మ, రచయిత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement