గతి తప్పిన ‘ఆప్’... నేల విడిచి సాము
ప్రధాన రాజకీయ పక్షాలన్నిటి పట్లా రోసిన పట్టణ మధ్యతరగతి విద్యావంతులకు ‘ఆప్’ తామే ఓ ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలమనే ఆశలను కల్పించింది. ఢీల్లీలో ఆ పార్టీ నెలల తరబడి సాగించిన ఉద్యమ కృషిని మరచి ఎండమావుల వెంట పరుగులు తీస్తోంది.
‘ఒక్కోసారి కింద పడటమే మంచిది. నీ స్థానం ఎక్కడో నీకు తెలిసివస్తుంది.’ ఆమ్‌ఆద్మీ పార్టీ ఓసారి కిందపడటం మంచిది. లోక్‌సభ ఎన్నికల్లో దానికి పది స్థానాలు దక్కితే గొప్పేనని జాతీయ మీడియా తేల్చేసిన మాట నిజమే. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా అది దాన్ని ‘పది సీట్ల పార్టీ’గానే అంచనా కట్టింది! కానీ ఫలితాలు దేశ రాజకీయాలపై గుత్తాధిపత్యం వహిస్తున్న రెండు జాతీయ పార్టీలకు వెన్నులో చలిని పుట్టించాయి. ఖంగుతిన్న జాతీయ మీడియా అదే నోటితో దాన్ని ఆకాశానికెత్తి... లోక్‌సభ ఎన్నికల్లో 100 స్థానాల వరకు గెలుస్తుందని చెప్పింది.
ఇప్పుడు మళ్లీ దాన్ని ‘పది సీట్ల పార్టీ’గా మార్చింది. ఈ ‘తీర్పుల’లోని సహేతుకతను వెతకడం వ్యర్థం. ఆప్ వేపు వేలెత్తి చూపేవాళ్లకు కొదవలేదు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ దాన్ని ప్రత్యర్థి పార్టీ ‘బీ టీం’గా దుయ్యబట్టాయి. ఆ ఎన్నికల్లో అది సాంప్రదాయక కాంగ్రెస్ ఓట్లను 28 శాతం వరకు దక్కించుకుంది. బీజేపీ ఓట్లను పెద్దగా రాబట్టుకున్నది లేదు. బీజేపీ ‘మోడీగాలి’... తీవ్రంగా వీస్తున్న అధికార కాంగ్రెస్ వ్యతిరేక పవనాలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు మించి మరేమీ కాదు. వేరే ప్రత్యామ్నాయాలున్న చోట దాని ఆశ అడియాస కాక తప్పదని ఢిల్లీ ఫలితాలు తేల్చి చెప్పాయి.
ఢిల్లీ ఫలితాలను దేశవ్యాప్తంగా పునరావృతం చేయాలన్న అలవికాని అంచనాలతో ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగింది. అందరికీ షాక్ ఇచ్చి అది ఏ 50 స్థానాలనో గెలుచుకుందే అనుకున్నా, రాహుల్, మోడీలను ఇద్దరినీ ఓడించిందనుకున్నా ‘సామాన్యుల’కు ఒరిగేదేమిటి? 1977లో ఇందిరాగాంధీని ఓడించిన రాజ్‌నారాయణ్ చివరకు ఏం సాధించాడు? కేజ్రీవాల్, షీలా దీక్షిత్‌ను ఓడించడం ఢిల్లీలో ఆప్ విజయాలకు కారణం కాదు. అది విస్మరించి, తన మూలాలను మరచి ఆప్ నేల విడిచి సాము చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నిటి పట్లా రోసి, రాజకీయాలకు దూరంగా ఉంటున్న మధ్యతరగతి విద్యావంతుల్లో, పట్టణ జనాభాలో ఆప్ తామే ఓ ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలమ నే ఆశలను రేకెత్తించింది.
ఆన్‌లైన్‌లో అతి కొద్ది కాలంలో కోటి మందికి పైగా ఆప్ సభ్యత్వం స్వీకరించడమే ఆ ఆశలకు కొలబద్ధ. ఢిల్లీలో ఆప్ నేతలు, కార్యకర్తలు నెలల తరబడి నిర్విరామంగా చేసిన కృషిని మరచి ‘దగ్గరి దారుల’ ఎండమావుల వెంట పరుగులు తీస్తూ అది తానే రేకెత్తించిన ఆశలపై నీళ్లు చల్లడానికి సిద్ధమవుతోంది. ఆప్ పుట్టిందే రెండు ప్రజా ఉద్యమ వెల్లువల నుంచి. యూపీఏ పాలనలో రోజుకో కుంభకోణంగా పెచ్చరిల్లిన అవినీతి వ్యతిరేక అసంతృప్తి ఒకటైతే, నిర్భయ గ్యాంగ్ రేప్ వ్యతిరేక ప్రజాగ్రహం మరొకటి. ఆ రెంటికీ వేదిక ఢిల్లీ. ఆ ఉద్యమాల నుంచే నేటి ఆప్ నేతలు, కార్యకర్తలు పుట్టి పెరిగారు. మధ్య తరగతి, ఉన్నత విద్యావంతుల నుంచి మురికివాడల వాసుల వరకు వివిధ సామాజిక అంతస్తుల ప్రజల మధ్య వంతెన కాగల గడం ఒక పార్టీగా ఆప్ విజయం. విద్యుత్ చార్జీల చెల్లింపులను నిరాకరించడం వంటి ఆందోళనలే ఆటోవాలాలను ‘మధ్యతరగతి పార్టీ’ ప్రచార కార్యకర్తలను చేశాయి.
ఈ ఉద్యమ భూమికను, కాంగ్రెస్, బీజేపీలు తప్ప మరో గత్యంతరం లేని ప్రత్యేక పరిస్థితిని విస్మరించి ఆప్ లోక్ సభ బరిలోకి దిగింది. మహా నగరమైన ఢిల్లీ అనుభవాన్ని ప్రతి చోటా వర్తింప జేయాలని చూస్తోంది. అలాంటి దుస్సాహసం చేయదల్చుకున్నప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తప్పు. ఎవరో అన్నట్టు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమంటే విషాన్ని తాగడానికి సిద్ధం కావడమే. అరాయించుకోగలవాళ్లే విషం తాగాలి. లేదంటే ఆత్మహత్యల జాబితాలో చేరక తప్పదు. పరిపాలనంటే రాకెట్ సైన్సేమీ కాదన్న కేజ్రీవాల్ అది రుజువు చేసి చూపడానికి ముందే... కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకునేలా చేసే వరకైనా ఆగకుండానే రాజీనామా చేశారు! ‘జనతా పార్టీ’లా మారిన పార్టీని చక్కదిద్దుకోక పోగా తమ శక్తులను చెల్లా చెదురు చేశారు. విస్తృత ప్రభావాన్ని కలగజేయగల ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాలపై కేంద్రీకరించి దీర్ఘకాలిక దృష్టితో ఒక ఉద్యమంగా ఆప్‌ను నిర్మించే అవకాశాలను చేజార్చుకున్నారు. ఆప్ ఎవరెవరి తల రాతలను మార్చిందో ఫలితాల తర్వాత తేలుతుంది. ఆప్ తలకు బొప్పి కట్టడం కూడా జరగాలని, మరచిపోయిన దాని మూలాలు, స్థానం దానికి గుర్తుకు రావాలని ఆశిద్దాం.
పిళ్లా వెంకటేశ్వరరావు