నా పేరుకు పాతికేళ్లు పూర్తయ్యాయి..! | 25years completed to my name...! | Sakshi
Sakshi News home page

నా పేరుకు పాతికేళ్లు పూర్తయ్యాయి..!

Published Sun, Dec 28 2014 1:05 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

నా పేరుకు పాతికేళ్లు పూర్తయ్యాయి..! - Sakshi

నా పేరుకు పాతికేళ్లు పూర్తయ్యాయి..!

సంభాషణం
‘శివ’ సినిమాతో పాటు ఇటీవలే పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొన్న నటుడు చిన్నా. మంచి టైమింగ్ ఉన్న కామెడీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన చిన్నా ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా కూడా ఒక ప్రయత్నం చేసి మరికొన్ని ప్రయత్నాలకు సన్నద్ధం అవుతున్న చిన్నాతో చిన్న సంభాషణం...


 

ఎ.జితేంద్ర రెడ్డి. ఇదీ నా అసలు పేరు. ‘శివ’ సినిమాలో నా పాత్ర పేరు ‘చిన్నా’, ఆ సినిమా సూపర్‌హిట్ కావడం, అందులో నా పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించడంతో తెరపై ‘చిన్నా’ గానే గుర్తింపు పొందాను. ఇటీవలే శివ సినిమాకు 25యేళ్లు పూర్తయ్యాయి. ఆ విధంగా నా పేరుకు కూడా పాతికేళ్లు!
     
సినిమాలవైపు ఎలా వచ్చారు? అవకాశాలు ఎలా లభించాయి?
మాది నెల్లూరు జిల్లా వాకాడు. మా అమ్మ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి గారి సోదరి. అక్కడ మాకు సొంతంగా థియేటర్ ఉంది. దాని పుణ్యమా అని చిన్న వయసులోనే సినిమాల మీద ఆసక్తి మొదలైంది. నటుడిని కావాలనే తపన కలిగింది. దీంతో చెన్నై వెళ్లిపోయాను. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘శివ’ సినిమా కోసం న్యూటాలెంట్‌కు అవకాశం అంటూ ఇచ్చిన పేపర్ యాడ్‌ను పట్టుకొని వాళ్ల ఆఫీస్‌కు వెళ్లాను. నచ్చడంతో ‘చిన్నా’ పాత్రకు సెలెక్ట్ చేసుకొన్నారు. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ‘మనీ’తో మంచి గుర్తింపు దక్కింది. దాంతో చాలా సినిమాల్లో సెకెండ్‌హీరో అయ్యాను.
     
ఫామ్‌లో ఉన్నప్పుడు సోలో హీరోగా ట్రై చేయాలనిపించలేదా?
కొంతమంది నిర్మాతలు ముందుకొచ్చారు. అయితే నేను సోలో హీరోగా చేస్తే సినిమాకు మార్కెట్ ఉంటుందనే నమ్మకం కలగలేదు. అందుకే వెనక్కు తగ్గాను. ఇద్దరూ, ముగ్గురు నటులు హీరోలుగా కనిపించే సినిమాలనే ఎంచుకొన్నాను.
     
తగినంత గుర్తింపు రాలేదని అనుకొంటున్నారా..?
లేదండీ, నాతో పాటుగా కెరీర్ ప్రారంభించిన వారిలో కొందరు హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకొన్నారు. అయితే వాళ్లతో పోల్చుకొని ఆ స్థాయికి చేరలేదని బాధపడే రకం కాదు నేను. నాకు వచ్చిన గుర్తింపు, లభించిన అవకాశాలతో సంతృప్తిగా ఉన్నాను.
     
పాతికేళ్ల నటప్రస్థానంలో సినిమా విషయంలో గమనించిన మార్పులేమిటి?
నటులుగా అవకాశం, గుర్తింపు విషయంలో మా తరం వారిది నార్మల్ డెలివరీ అయితే, ఈ తరం వారు సిజేరియన్ డెలివరీ తరహాలో నటులుగా జన్మను పొందుతున్నారు. మేము సహజంగా ప్రసవ వేదనతో గుర్తింపు తెచ్చుకొన్నాం. చాలా సినిమాల్లో చేస్తే తప్ప ఒక మేగజైన్‌లో ఫోటో పడేది కాదు. ఇప్పుడు ఒక్క సినిమాలో కూడా చేయని వారే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమాల గురించి చెప్పాలంటే.. నేను నటించిన సినిమాలు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో నాకే తెలియడం లేదు. రెండు మూడు రోజుల డేట్స్ తీసుకొని షూటింగ్ చేస్తారు, ఐదారు నెలల తర్వాత ఫోన్ చేసి డబ్బింగ్ చెప్పాల్సి ఉంది రమ్మంటారు! ఇలాంటివన్నీ చూస్తుంటే నాటి వారితో పోలిస్తే వృత్తిపట్ల అంకితభావం బాగా తగ్గినట్టుగా అనిపిస్తుంది.
     
నేను సోలో హీరోగా చేస్తే సినిమాకు మార్కెట్ ఉంటుందనే నమ్మకం కలగలేదు. అందుకే వెనక్కు తగ్గాను. మీ అసలు పేరేమిటి? ‘చిన్నా’గా ఎలా ఫేమసయ్యారు?!

దర్శకుడిగా కూడా ఒక ప్రయత్నం చేశారుగా... భవిష్యత్తుల్లో మళ్లీ మెగాఫోన్ చేతపడతారా?

ప్రస్తుతం నేను సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. మళ్లీ సినిమాకు డెరైక్షన్ చేసే ఆసక్తి ఉంది. నూతన సంవత్సరంలో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
     
సినిమా, సీరియల్... తేడా ఏమనిపించింది?
ఈ మధ్య కొన్ని సినిమాల కన్నా సీరియళ్ల నాణ్యతే బాగుంటోంది. సీరియళ్ల చిత్రీకరణకే మంచి కెమెరాలు వాడుతున్నారు. నా వరకూ అయితే నటన అనే ప్రొఫెషన్  మీద ఆసక్తి, గౌరవం ఉంది కాబట్టి రెండూ ఒకటే. కమర్షియల్‌గా ఆలోచిస్తే తేడా ఉంటుందేమో.
     
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అంటున్నారు.. మరి మీరూ రాజకీయాలవైపు వస్తారా?
స్వతహాగా నేను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి అభిమానిని. వాకాడులో మా కుటుంబం వైఎస్సార్‌సీపీ తరపున పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంది. నాకు కూడా ఆసక్తి ఉంది కానీ, నా మనస్తత్వంతో రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టమనిపిస్తుంది. అందుకే ప్రస్తుతానికి దూరంగానే ఉంటున్నా. భవిష్యత్తులో యాక్టివ్ పొలిటీషియన్‌గా మారినా ఆశ్చర్యపోవద్దు!
 - బీదాల జీవన్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement