
దారిలో పూసిన జాబిలి
సముద్రమంటూ ఉన్నాక తుఫాను రాకుండా ఉండదు; బస్సంటూ ఎక్కాక కుదుపులు లేకుండా ఉండవు. వీటికితోడు బనీను ధరించే అలవాటులేని వెచ్చని చెమట శరీరాల రాపిడి కలిగించే జుగుప్స! అయినా నేను బస్సును ద్వేషించలేను.
ఆజన్మం
సముద్రమంటూ ఉన్నాక తుఫాను రాకుండా ఉండదు; బస్సంటూ ఎక్కాక కుదుపులు లేకుండా ఉండవు. వీటికితోడు బనీను ధరించే అలవాటులేని వెచ్చని చెమట శరీరాల రాపిడి కలిగించే జుగుప్స! అయినా నేను బస్సును ద్వేషించలేను. కారణం:
జుట్టునుంచి రబ్బర్ బ్యాండ్ తీసి, ఎడమ మణికట్టుకు వేసుకుని, రెండు చేతుల చూపుడువేళ్లను సుతారంగా చెవుల మీదుగా నడిపించి, వదులైన పొట్టిజుట్టుకు తిరిగి బ్యాండ్ బిగిస్తుంది తెల్ల కమీజ్ అమ్మాయి. కురులు సవరించుకోవడానికి వీలుగా నడుమును ముందుకు వంచినప్పడు వెన్నురేఖ తళుక్కుమంటుంది!
బస్సుల్లో ప్రయాణించకపోయివుంటే వీపులో ఉన్న సౌందర్యం నాకు ఎప్పటికీ తెలిసివుండేది కాదు. ఆ పై-కుడివైపు, షోల్డర్ బ్లేడ్‌పైన పడే నొక్కును చూడగానే నేను అందంగా పోగేసిన వేల అక్షరాలన్నీ సిగ్గుతో బస్సు దూకేస్తాయి.
అమ్మాయిగా ఉంటే చాలు కదా! ఆమె ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు. ‘తాజ్‌మహల్’ నిర్వర్తించాల్సిన కర్తవ్యం అంటూ ఒకటి ఉంటుందా? నేను చార్మినార్‌ను చూళ్లేదే! వైజాగ్ బీచ్‌లో నడవలేదే!! అని బెంగపడాల్సిన పనివుంటుందా? ఎవరో అన్నట్టు ఆమే ఒక కవిత!
అయితే, అప్పుడప్పుడూ శుష్కవచనంగా, వ్యాకరణంగా, రాజకీయవ్యాసంగా ఆమె మారిపోవడం ఒక దిగ్భ్రమ. కేవలం అంకెలను కూర్చిన వివరణ పట్టికలా కనబడటం మరీ విషాదం. ఉబ్బు చారల పొత్తికడుపు ఇంకో కఠిన వాస్తవం.
అయితే, ‘స్త్రీ’ అనుకోగానే మనకు రకరకాల సందర్భాల్లో తారసపడిన వంద ముఖాలు వేగంగా దొర్లిపోవచ్చు. కానీ ఊహల్లో ఒక విజువల్ బలంగా ఉంటుంది. ఆమె లలితమైంది. అలాగని లాలిత్యం ఒక్కటే కాదు, ఇంకా ఏదో కూడా! సరిగ్గా చెప్పాలంటే ‘ఈమె’లా ఉంటుంది.
గడ్డం గీసుకోవాలన్న ఉబలాటమేతప్ప, మొలకల ఆనవాళ్లు కూడా లేని రోజుల్లో నాగార్జునసాగర్ పడవ విహారంలో చూశానామెను. గృహిణి. చక్కటి అనేది నిజంగా చక్కటి మాటే అనుకుంటే, ఆమె చక్కగా ఉంది. చాలా కాలం ఆమె నా ఆదర్శ స్త్రీగా ఉండేది. నేను రాయని నవలల్లో నాయికలాగా ఉండేది. హుందాగా ఉంది; నవ్వుముఖం; ఎత్తూ కాదు పొట్టీ కాదు; అతిగా లేదు మితంగా లేదు; ఒక సమతూకం, ఒక పర్ఫెక్షన్ ఏదో ఉంది. ఆమె ఒక నిర్మాణం!
ఇంకా ఈమెకు నేనుగా జతచేసిన గుణాలు ఏమంటే, పద్ధతిగా ఆలోచిస్తుంది, పద్ధతిగా నడుచుకుంటుంది. యండమూరి నవలల్లోని నాయికల తాలూకు సానుకూల లక్షణాలను కూడా ఆపాదించేవాణ్ని.
ఇక ఆమెను లేదా ఆమెకు ప్రతిరూపం లాంటి స్త్రీని నా కాబోయే భార్యగా ఊహించుకునేవాణ్ని. అయితే ఈమెతో సమస్య ఏమిటంటే: ఇద్దరమూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎన్నింటిలోనో ఆమె నాకు సలహా ఇస్తుండేది. ఒక ఉత్తేజకరమైన సామీప్యాన్ని ఇవ్వగలిగేది. కానీ ఎంతసేపటికీ మలి అంకపు రొమాన్సులోకి మనసు పోయేది కాదు.
పాపభీతి కలిగేది. ఇంతటి ఆదర్శ మహిళ తుచ్చమైన శరీరోద్రేకానికి లొంగిపోవడాన్ని సహించేవాణ్ని కాదు. ఆమె ఎక్స్‌పోజ్ అవడాన్ని ఇష్టపడేవాణ్ని కాదు. ఆమె చుట్టూ ఏదో ఒక పవిత్రాగ్ని మండినట్టుగా ఉండేది. తెల్లటి వస్త్రం మీద మసి పూస్తున్నానేమో అనిపించేది. ఏదో స్పష్టంగా చెప్పలేనితనం అడ్డు తగిలేది. అందుకే ఆమెకు నా పగటి కలల్లోనే తప్ప, రాత్రి కలల్లో చోటు లేకపోయింది
నిజానికి ఇప్పుడామె నాకు శూన్యం. ఆమె చుట్టూ ఉండిన వెన్నెలనే తప్ప, ఆమె ముఖాన్ని సంపూర్ణంగా చిత్రించుకోలేనంతగా మరపులో పడిపోయాను. గతాన్ని తవ్వుతుంటే మనసుకు తగలడం వల్లగానీ లేదంటే ఈమె కొన్నేళ్లు నా జీవితంలో అంత స్థలం ఆక్రమించుకుందని గుర్తేలేదు. చిత్రంగా ఇది ఆమెకు కూడా తెలిసే అవకాశం లేదు.
ప్రతిదాన్నీ లెక్కప్రకారం, పద్ధతిగా ఆలోచించేవాళ్లు దాంపత్య కార్యంలో ఎలా పాల్గొంటారు? అది అన్ని తర్కాల్నీ ధ్వంసం చేస్తుందికదా! పరమ పవిత్రతా ఇందులోనే ఉంది; అత్యంత అగౌరవమూ దానితోనే ముడిపడి ఉంది. ఒక పెచ్చు ఎక్కడో ఊడిపోయినట్టుగా ఉంటేనే తప్ప ఒక మిరుమిట్లుగొలిపే నిర్మాణాన్ని సమీపించలేమేమో!
‘తాజ్‌మహల్’
నిర్వర్తించాల్సిన కర్తవ్యం అంటూ ఒకటి ఉంటుందా? నేను చార్మినార్‌ను చూళ్లేదే! వైజాగ్ బీచ్‌లో నడవలేదే!! అని బెంగపడాల్సిన పనివుంటుందా?
- పూడూరి రాజిరెడ్డి