కొత్త ఫోను, కొత్త నంబరు
తపాలా
కొత్త ఫోన్, కొత్త నంబర్. మొదటి కాల్ అమ్మకి చేయాలి. రింగ్ చేశాను. కానీ అమ్మ లిఫ్ట్ చేయటం లేదు. మరలా చేశాను. అలా ఎనిమిది సార్లు. ఫోన్ తీయటం లేదు. అమ్మ కాల్ కోసం ఎదురుచూస్తున్నా. రాత్రి ఎనిమిదింటికి వంట చేస్తున్నప్పుడు నా ఫోన్ రింగ్ అవుతోంది. గబగబా వచ్చి, ‘‘హలో, అమ్మా! ఉదయం నుండి మాట్లాడాలని ప్రయత్నించాను. ఫోన్ తీయలేదెందుకు?’’ అన్నాను.
‘‘హలో, ఆగండి. నేను ఉదయం నా ఫోన్ ఇంట్లో మరచిపోయి ఆఫీసుకి వెళ్లాను. సాయంత్రం వచ్చాక చూసుకుంటే ఈ నంబరుతో 8 మిస్డ్‌కాల్స్ ఉన్నాయి. మీరెవరు, ఎందుకు చేశారు?’’ ఆశ్చర్యంగా అట్నుంచి వేరొకాయన గొంతు.
‘‘హలో మీరెవరు? ఇది మా అమ్మ నంబరు. ఈ నంబరుతో మా అమ్మ తప్ప ఇంకెవరూ మాట్లాడరు’ అన్నాను.
‘‘నంబర్ సరిగా చూసుకోండి’’ అన్నారు. నేను సీరియస్‌గా, ‘‘మా అమ్మ నంబరు నాకు తెలియదా? మీరు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి?’’
‘‘హలో, మేడమ్. నా పేరు రవి. మాది హైదరాబాద్. మీది ఏ ఊరు?’’
‘‘మా ఊరేదో మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. పెట్టేయండి ఫోన్’’ ఫోన్ కట్ చేశాను.
కొంతసేపటికి, పాత ఫోన్ తీసి అమ్మ నంబర్ చెక్ చేశాను. సింగిల్ నంబర్ రాంగ్ డయల్ చేశాను. తప్పు నాదే.
మరుసటిరోజు అదే నంబరుతో ఫోన్ కాల్. ఎందుకులే అని కట్ చేశాను. గంట తర్వాత వేరే నంబరుతో నా ఫోన్ రింగ్ అవుతోంది. తీశాను. ‘‘ఎవరండి? హలో మీరెవరండి’’ అని అడుగుతున్న వాయిస్ నిన్నటిదే. ‘‘మీరే కాల్ చేసి మీరెవరని అడుగుతారేమిటి? మీకు ఎవరు కావాలి?’’ అన్నాను. ‘‘హలో! మీది ఏ ఊరండి?’’ అంటున్నాడు. కోపంగా ఫోన్ కట్ చేశాను.
తర్వాతి రోజు కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మెసేజ్! చిన్న కౌన్సెలింగ్ ఇవ్వాలని కాల్ చేశాను. ‘‘హాయ్! మేడమ్, హ్యాపీ న్యూ ఇయర్.’’
‘‘ఓకే. థాంక్యూ. సేమ్ టూ యూ.’’
‘‘మేడమ్ ఇప్పుడు చెప్పండి మీరెవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు?’’
‘‘చూడమ్మా! నువ్వు చిన్నవాడిలా ఉన్నావు. ఫోన్‌లో నా వాయిస్‌కి ఎట్రాక్ట్ అయ్యావేమో. నేను చెప్పేది విను. నా వయస్సు 40 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. నేను డాక్టర్‌ని. బిజీగా ఉన్నప్పుడు కాల్‌చేసి మీరెవరు అని అడుగుతున్నావు. ఆ రోజు నేను రాంగ్ కాల్ చేయటం తప్పే. క్షమించు’’ అన్నాను.
‘‘మేడమ్! మీరనుకున్నట్లు నేనేమీ చిన్నవాడిని కాదు. నాకూ ఇద్దరు పిల్లలున్నారు. నా కాలేజ్ స్నేహితురాళ్లు ఎవరైనా నన్ను ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నాను. సారీ, మేడమ్. ఇంకెప్పుడూ కాల్ చేయను’’ అన్నాడతను.
‘‘అనవసరమైన ఫోన్ కాల్స్ వలన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. థాంక్యూ, అర్థం చేసుకున్నందుకు’’ అని పెట్టేశాను. అక్కడితో ముగిసిపోయిందనుకున్నాను.
ఆరు నెలల తర్వాత- అర్ధరాత్రి భర్త పిల్లలతో నిద్రపోతుండగా, నా ఫోన్ సౌండ్‌కి నా భర్త ‘‘ఎవరు?’’ అని అడగటం, ‘‘పిల్లలు క్లాక్ టైమ్ రాంగ్ సెట్ చేసినట్లున్నారు’’ అని అబద్ధం చెప్పి కాల్‌ని కట్ చేయటం సెకనులో జరిగిపోయింది. ఇక అప్పట్నుంచీ మొదలు టెన్షన్!
నేనెందుకు భయపడుతున్నాను! ఏదైనా తప్పు చేసినవాళ్లు కదా భయపడేది! అబద్ధం చెప్పటం వలన భయమా? అయినా వీడు ఈ టైమ్‌లో ఫోన్ చేయటం ఏమిటి? భార్యకు ఏదైనా సమస్య వస్తే భర్తకు చెప్పుకుంటే పరిష్కారమవుతుంది, అనే నమ్మకం కల్పించిన భర్త దొరికిన భార్య అదృష్టవంతురాలు... అలా అనేక ఆలోచనలతో తెల్లవారింది.
సమయం చూసుకుని కాల్ చేశాను. ‘‘హలో రవిగారూ, మీరు అర్ధరాత్రి ఫోన్ చేయటం పద్ధతేనా? మీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా? ఇంకెప్పుడూ చేయనని చెప్పారు...’’ అన్నాను కోపంగా.
‘‘మేడమ్! మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. రాత్రి కాల్ చేసింది నేను కాదు, నా భార్య. నేనెంత చెప్పినా నమ్మటం లేదు’’ అన్నాడు. అప్పుడు అనిపించింది భర్తను అర్థం చేసుకునే భార్య దొరకటం కూడా అదృష్టమేనని.
‘‘రవిగారూ! ఒక్కసారి మీ ఫోన్ మీ భార్యకివ్వండి’’ అని చెప్పి ఆమెతో మాట్లాడాను. పది నిమిషాల్లో సమస్య పరిష్కారమైపోయింది. తర్వాత ఆ కుటుంబం మాకు పరిచయమైపోయింది. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్‌కి వారు పంపే శుభాకాంక్షలు నాకు చాలా ఆనందాన్నిస్తాయి.
- లక్ష్మి, గుంటూరు