ఆఁ హుఁ హోఁ హుఁ హ్యాఁ
ఆ సీన్ - ఈ సీన్
అమెరికాలో షాపుకెళ్లి చొక్కా కొంటే దాని మీద ‘మేడిన్ చైనా’ అని ఉంటుంది. చైనా ప్రపంచమంతటా అంతగా విస్తరించింది. కోఠీకెళ్లి ఫోన్ కొందామంటే ముందుగా చైనా ఫోన్‌లే కనిపిస్తాయి. అంతా చైనామయమే కదా... అని చైనా భాషలో సినిమా చూస్తే... ‘ఆఁ హుఁ హోఁ హుఁ హ్యోఁ...’ తప్ప మరేమీ అర్థం కాదు. అందుకే మన నిర్మాతలు చైనా నుంచి మూలాన్ని తీసుకుని చైనా వస్తువులా కాకుండా ఖరీదైన అరుంధతిని తీశారు.
అత్యుత్తమ స్థాయి సాంకేతిక విలువలతో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి భారీ బడ్జెట్‌తో సాహసోపేతంగా రూపొందించిన సినిమా అరుంధతి. కోడి రామకృష్ణ అద్భుత సృష్టి. ఈ సినిమా కథ, కథనాల్లో ఒరిజినాలిటీ ఉంది. ఒక ట్రెండ్‌ను సెట్‌చేసిన సత్తా ఉంది. అయితే ఎటొచ్చీ కొన్ని సీన్ల విషయంలోనే కాపీలున్నాయి. అరుంధతి సినిమాలో ఎన్నో అద్భుత సీన్లు ఉన్నాయి. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొనే అద్భుత దృశ్యాలున్నాయి. అలాంటివాటన్నింటికీ ఎస్సెట్ అనిపించుకొనే సీన్ క్లైమాక్స్‌లో ఆవిష్కృతమవుతుంది. అరుంధతి పాత్ర దుష్ట పశుపతిని చంపే పతాక సన్నివేశాలు సినిమాను గొప్పస్థాయికి తీసుకెళతాయి. అక్కడే తెలుగు అరుంధతిలో చైనీ సినిమా ఛాయలు కనిపిస్తాయి.
‘హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డాగర్స్’ 2004లో విడుదల అయిన చైనీ సినిమా ఇది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణకు నోచుకొంది. ఆ సినిమా నుంచి ఒక చక్కటి సీన్‌ను అరుంధతిలో కాపీ చేశారు. అదే ‘డ్రమ్ డాన్స్ సీక్వెన్స్’. సినిమా క్లైమాక్స్‌లో పశుపతిని చేతితోఆయుధం పట్టకుండానే అంతం చేస్తుంది అరుంధతి. అదే సీన్ ప్రారంభంలో చేతిలోపట్టుకొన్న పవిటతో గవ్వలను వదులతూ ఆమె డ్రమ్స్‌ను మోగించే సన్నివేశం చైనీ సినిమా నుంచి తెచ్చుకొన్నదే. అచ్చంగా కాపీ చేసేశారు.
చైనా సినిమాలో కూడా హీరోయిన్ నృత్యం చేస్తూ పవిట నుంచి గవ్వలను వదులుతూ డ్రమ్స్‌ను మోగిస్తుంది. ఆ సినిమాలో ఆమె విన్యాసాన్ని హీరో అమితాశ్చర్యంగా చూస్తాడు. అరుంధతిలో ఆ స్థానంలో విలన్ ఉండి వికటాట్టహాసం చేస్తాడు. అంతేతేడా. చైనీ సినిమా నుంచి తెచ్చుకొన్న సీన్‌కు కొనసాగింపుగా అరుంధతి తన పమిటతోనే ఆయుధాలను పట్టి విలన్‌ను అంతం చేసేలా సినిమాకు ముగింపును ఇచ్చారు. ఈ విధంగా అరుంధతి రూపకర్తలు కాపీ చేసిన సీన్‌ను చక్కగా ఉపయోగించుకొన్నారు. ఈ సినిమాలో మరో కాపీ సీన్ కూడా ఉంది.
ఇది ‘ఫైనల్ డెస్టినేషన్’ సినిమా నుంచి స్ఫూర్తి పొందినది. 2000 సంవత్సరంలో విడుదల అయిన హాలీవుడ్ హారర్‌సినిమా ‘ఫైనల్ డెస్టినేషన్’. చూడటానికి భయంకరం అనిపించే ఆ సినిమాలోని ఒక సీన్ అరుంధతిలో కనిపిస్తుంది. తనను ఏదో శక్తి వెంబడిస్తోందని గ్రహించిన అనుష్క గద్వాల్ నుంచి తన కారును వేసుకొని పారిపోతూ రైల్వేలైన్ వ ద్ద ఇరుక్కుపోయే సన్నివేశం ‘ఫైనల్ డెస్టినేషన్’ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. పట్టాల పక్కన పడిఉన్న ఒక ఇనుప రేకు రైలువేగం వల్ల వచ్చే గాలికి పైకి లేచి అనుష్కను రక్షించబోయిన వ్యక్తి గొంతును కట్ చేసే సీన్ ఫైనల్ డెస్టినేషన్‌లో కనిపిస్తుంది. అరుంధతిలో దాన్ని చాలా సౌకర్యంగా దించేశారు.
ఇందులో కొసమెరుపు ఏంటంటే... అద్భుతం అనిపించుకొన్న అరుంధతి సినిమా స్థాయిని ఇలాంటి అనుకరణ సీన్లు ఏ మాత్రమూ తగ్గించలేదు. పైగా అదనపు మెరుగులుగా కొత్త అందాన్ని తీసుకొచ్చాయి అనిపిస్తుంది. అది మన దర్శకుల నైపుణ్యం.
అరుంధతి మేడ్ ఇన్ చైనా
Published Sun, Jun 21 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement