విరాట్ చాలా పర్సనల్!
ఇంటర్వ్యూ
ఏం అడిగినా ఠక్కున సమాధానం చెప్తుంది అనుష్కాశర్మ.
అది సినిమాల గురించైనా,
తన వ్యక్తిగత జీవితం గురించైనా సరే!
ఆ ముక్కుసూటితనమే తన ప్రత్యేకత అని కూడా చెబుతుంది.
తన గురించి, తన వ్యక్తిత్వం గురించి
అనుష్క ఓపెన్‌గా చెప్పిన కొన్ని విషయాలివి...
అనుష్క ఎలాంటి వ్యక్తి?
చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్. ఎవరేం అడిగినా సూటిగానే జవాబిస్తాను. కొందరు అంటుంటారు... మరీ అంత సూటిగా సమాధానాలు చెప్పేస్తే ఎలా అని. మనం సరైన దారిలో వెళ్తున్నామన్న నమ్మకం మనకు ఉన్నప్పుడు దేనినీ లెక్క చేయాల్సిన అవసరం ఉండదని నా నమ్మకం.
మీ బలం?
క్లారిటీ. అన్ని విషయాల్లోనూ స్పష్టంగా ఉంటాను. ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోను. తీసుకున్న తర్వాత వెనకడుగు వేయను.
మీ బలహీనత?
తెలియదు. దాని గురించి ఆలోచించను. మనలో బలహీనత ఉందా అని తరచి చూసుకోవడమే పెద్ద బలహీనత.
తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు?
నచ్చిన ఫుడ్ తింటూ... రోజంతా టీవీ చూస్తూ గడిపేస్తాను. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో షికార్లు, షాపింగులు ఉంటాయి కానీ వాటన్నిటికంటే ఇంట్లో టీవీ చూస్తూ గడపడంలోనే ఎక్కువ సంతోషం కలుగుతుంది నాకు.
ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా?
అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటాను. కత్రినా అంటే చాలా ఇష్టం. అయితే ఎవరితోనైనా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను తప్ప మరీ రాసుకు పూసుకు తిరగడాన్ని ఇష్టపడను.
ఏ ఇద్దరు హీరోయిన్లకూ పడదు అంటుంటారు. అది నిజమేనా?
ఎవరో కొందరి మధ్య గొడవలు ఉంటాయి. అంతమాత్రాన గొడవలు పడటమే హీరోయిన్ల పని అన్నట్టు మాట్లాడితే ఎలా! కొట్లాడుకునేవాళ్ల దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్న అడిగితే బాగుంటుంది.
ప్రేమ - డబ్బు... దేనికి ప్రాధాన్యతనిస్తారు?
ఎప్పుడూ ప్రేమే మొదటి స్థానంలో ఉంటుంది. అది ఉంటే ఇక దేని గురించీ దిగులు ఉండదు. అలా అని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను అని చెప్పను. దానికీ ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏదీ మనకు దొరకదు. ఓ మోస్తరుగా బతకాలన్నా డబ్బు కావాలి. కాబట్టి డబ్బుకీ ప్రాముఖ్యతనిస్తాను. కానీ ప్రేమ కోసమే ఎక్కువ పరితపిస్తాను.
కానీ మీరు ప్రేమను గుట్టుగా ఉంచుతారట కదా?
ఒక్కసారి నోరు తెరిచి ఏదైనా ఓపెన్‌గా చెబితే దానికి నాలుగు తగిలించి, చిల వలు పలవలు చేసి ప్రచారం చేస్తారు. అందుకని వీలైనంతవరకూ సెలైంట్‌గా ఉంటాను తప్ప గుట్టుగా ఉంచాలని కాదు. విరాట్ కోహ్లీతో నా స్నేహం గురించి తెలిశాక అది తప్ప మరేదీ అడగడం లేదు. తను నా స్నేహితుడు. తనతో పార్టీలకు వెళ్తాను. తన మ్యాచ్‌లకి వెళ్తాను. డిన్నర్లు చేస్తాను. తను మా ఇంటికి కూడా వస్తాడు. అంత మాత్రాన మీ ఇద్దరికీ ఏమైనా ఉందా అని అడిగేస్తే ఎలా! అలాంటి ప్రశ్నలకి నా నుంచి సమాధానం ఎప్పుడూ రాదు. ఎందుకంటే నా వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను.
బంధాలకు ఎంత విలువ ఇస్తారు?
చాలా ఇస్తాను. ఈ లోకంలో అమ్మతో మనకు తొలి బంధం ఏర్పడుతుంది. తర్వాత ఎంతోమంది మన జీవితంలోకి వస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్థానం. కానీ అందరూ మనకు కావలసినవాళ్లే. నా వరకూ నేను ఒక్కసారి ఒకరితో బంధం ఏర్పడితే దాన్ని తెంచుకోవడానికి ఇష్టపడను.
ఎలాంటి విషయాలకు బాధపడతారు?
అబద్ధాలు నన్ను చాలా బాధిస్తాయి. ఎవరి గురించైనా నిజం మాట్లాడాలి. ఉన్నది చెప్పాలి తప్ప కల్పించి చెప్ప కూడదు. ఓ సినిమా షూటింగ్‌లో నా వెన్నెముకకు దెబ్బ తగిలింది. నొప్పి తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లాను. బయటికి వస్తున్నప్పుడు ఎవరో ఫొటో తీసి పేపర్లో ప్రచురించారు. అది మాత్రమేనా... అంతకుముందే నేను ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్లి రావడంతో అక్కడ ఏదో జరిగిందని, అందుకే ఆస్పత్రికి వెళ్లానని నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ ఏవేవో రాసేశారు. ఓ మాట అనే ముందు అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. అది నాకు చాలా విసుగు తెప్పిస్తుంది.
ఇంతకీ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి?
మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వీలైతే ఎదుటివారిని కూడా హ్యాపీగా ఉండేలా చేయాలి. ఒకరికి మంచి చేయాలి తప్ప చెడు మాత్రం చేయకూడదు.