నీరు తీసేస్తుంది...
అప్పడాలు, వడియాలు, కూరగాయలు, పండ్ల ఒరుగులు వంటివి తయారు చేసుకోవాలంటే ఎండ పడే చోట ఖాళీ జాగా చూసుకుని, బట్ట పరిచి వాటిని ఆరవేయాలి. అవి ఆరడానికి ఒక పూట లేదా కొన్ని రోజులు పట్టొచ్చు. ఇలాంటివి ఆరబెట్టుకునే అవకాశమే లేని అపార్ట్‌మెంట్లలో వీటి ఊసే ఎత్తలేం. ఈ సమస్యకు పరిష్కారంగా రూపొందినదే ఐఆర్ డీ5 డీహైడ్రేటర్. పెట్టెలా కనిపించే ఈ పరికరంలోని అరల్లో ఆరబెట్టాలనుకున్న పదార్థాలను నింపి, దీనిని ఆన్ చేస్తే చాలు... కొద్దిసేపట్లోనే వాటిలోని నీరంతా తీసేసి పూర్తిగా ఆరబెట్టేస్తుంది.
ఇందులో సోలార్ మోడ్, షేడ్ మోడ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. సోలార్ మోడ్ ఆన్ చేస్తే, పదార్థాలను నేరుగా ఎండలో ఎండబెట్టిన వాటిలాగానే మార్చేస్తుంది. నీడలో ఆరబెట్టాల్సిన పదార్థాలనైతే, ఇందులో పెట్టి షేడ్ మోడ్ ఆన్ చేసుకుంటే చాలు... నీడలో ఆరిన పదార్థాలు నీరింకిపోయాక ఎలా తయారవుతాయో సరిగ్గా అలానే తయారవుతాయి.