
కసకస కోసేస్తుంది!
కొత్తిమీర, కరివేపాకు వేయకుండా వంటకం పూర్తవుతుందా? పూర్తి చేసినా మీవారికి, పిల్లలకు నచ్చుతుందా? అందుకే ఏది మిస్సయినా మీరు కచ్చితంగా వాటిని మిస్సవరు. అయితే వాటిని ముక్కలు చేయకుండా వేస్తే ఆ వాసన అంత బాగా వంటకానికి పట్టదు. ముక్కలు చేయాలంటే అదంత తేలిక కూడా కాదు. ఆకుల్ని వరుసగా పేర్చి, చాకుతో కోసి, అప్పుడు కూరలో వేయాలి. అవి సరిగ్గా తెగవు. ఈలోపు చేయి మాత్రం తెగుతుంది. అలా చేతులూ వేళ్లూ కోసుకోకుండా మనకి సాయపడుతుంది ఈ ‘హెర్బ్ మిల్ గ్రైండర్’. ఈ గ్రైండర్‌కి కరెంటు అవసరం లేదు.
కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి ఆకుల్ని ఇందులో వేసి, గట్టిగా బిగించి, ఒక్క తిప్పు తిప్పితే చాలు... అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తెగిపోతాయి. కావాలంటే ఈ ఫొటో చూడండి... క్లారిటీ వస్తుంది. ఏ పార్టుకి ఆ పార్టు విడిపోతుంది కాబట్టి శుభ్రం చేసుకోవడం కూడా చాలా తేలిక. ధర మోడల్‌ని బట్టి రూ. 200 నుంచి రూ. 300 మధ్య ఉంది. ఆన్‌లైన్లో అయితే రూ. 250 దాటదు.