టిఫిన్లూ భోజనాలూ...కోళ్లకు వడ్డిస్తారు | Sakshi
Sakshi News home page

టిఫిన్లూ భోజనాలూ...కోళ్లకు వడ్డిస్తారు

Published Sun, Mar 19 2017 12:14 AM

టిఫిన్లూ భోజనాలూ...కోళ్లకు వడ్డిస్తారు

ఎక్కడైనా హోటళ్లలో, రెస్టారెంట్లలో కోళ్లను కోసి వండిన వంటకాలతో టిఫిన్లూ భోజనాలూ వడ్డిస్తారే గానీ, వెధవది కోళ్లకు వడ్డించడమేమిటి... అనుకుంటున్నారా..? నిజంగా కోళ్లకు టిఫిన్లు, భోజనాలు వడ్డించే హోటలేనండీ బాబూ! హోటళ్లలో, రెస్టారెంట్లలో ఎప్పుడూ కోళ్లను వడ్డించడమేనా..? కోళ్లకు వడ్డించడానికి ఓ హోటల్‌ పెడితే ఎలా ఉంటుందనే వెరైటీ ఆలోచన వచ్చింది డేవిడ్‌ రాబర్ట్స్‌ అనే బ్రిటిష్‌ కుర్రాడికి. అలాగని ఆలోచనతోనే ఆగిపోలేదు. ఆచరణలోకి దిగాడు. కార్న్‌వాల్‌ ప్రాంతంలోని బోస్కెన్‌విన్‌ గ్రామంలో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో కోళ్ల కోసమే ప్రత్యేకంగా హోటల్‌ ప్రారంభించాడు.

ఇందులో కోళ్లకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ వడ్డించడానికి రెస్టారెంట్‌తో పాటు వాటికి లాడ్జింగ్‌ సౌకర్యం కూడా ఉండటం విశేషం. కోళ్ల ఆవాసానికి అనువైన కలప గూళ్లను రాబర్ట్‌ తానే స్వయంగా నిర్మించాడు. రాబర్ట్‌ ఈ హోటల్‌ను ప్రారంభించిన అనతికాలంలోనే ఇంగ్లండ్‌లో సూపర్‌ పాపులారిటీ సంపాదించుకుంది.  కోళ్ల యజమానులు తమ పెంపుడు కోళ్లకు ఈ హోటల్‌లో విందు భోజనాలు తినిపిస్తూ మురిసిపోతున్నారు. ప్రయాణాలకు వెళ్లాల్సిన సందర్భాల్లో తమ కోళ్లను భద్రంగా ఉంచడానికి ఈ హోటల్‌లోని గూళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇందులో ఒక్కో గూడు అద్దె రోజుకు రెండు పౌండ్లు (సుమారు రూ.165), బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ ధరలు 75 పెన్నీలు (రూ.61) మొదలుకుని ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement