కొంతకాలం క్రితం మనం రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవమే ఇపుడు మనకు షాపింగ్ మాల్స్‌లో ఎదురవుతోంది.
పండూఫలం
కొంతకాలం క్రితం మనం రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవమే ఇపుడు మనకు షాపింగ్ మాల్స్‌లో ఎదురవుతోంది. ఇండియన్ రెస్టారెంట్లను ముంచెత్తిన కాంటినెంటల్ డిష్‌లు మెన్యూలో ఎలాగైతే కొత్త అనుభూతిని ఇచ్చేవో, ఇపుడు విదేశీ పండ్లు షాపింగ్ మాల్స్‌లో అదేవిధంగా పలకరిస్తున్నాయి. చాలా మంది వీటిని రుచి చూద్దాం... ఎలా ఉంటుందో అని ఒక ట్రయల్ వేస్తున్నారు. మరి, తినేముందు వాటి గురించి కాస్త తెలుసుకుంటే మంచిది కదా.
ఇప్పటికే బాగా పరిచయం అయిన విదేశీ పండు కివి. క్రికెట్ అభిమానులకు ఈ పేరు బాగా పరిచయం. పేరుకే కాదు, ఇది న్యూజిలాండ్ పండే. కానీ ఇతర చోట్ల కూడా పండుతుంది. దీంతో పాటు మిగతా పళ్లను కూడా రుచి చూసేద్దాం.
కివీ ఫ్రూట్: మిగతా పండ్లలా ఇది ఒకేరకంగా, ఒకే సైజులో పండే పండు కాదు. వివిధ సైజుల్లో, వేర్వేరు రంగుల్లో కూడా వస్తుంది. వెలిసిపోయిన ఆకుపచ్చ రంగులో అండాకారంలో ఉండే రకం ఎక్కువ ఆదరణ పొందింది. దీనికి చైనీస్ గూస్‌బెర్రీ అని కూడా పేరు. మన దగ్గర దొరికేది ఫుజీరకం కివి. పులుపు-తీపి కలిసినట్టు ఉంటుంది. కోడిగుడ్డు సైజులో ఉండే ఈ పండులో జామ పండులాగా చిన్న విత్తనాలు ఉంటాయి. ఈ పండును విత్తనాలతో పాటే తినొచ్చు. దీనిని న్యూజిలాండ్, ఇటలీ, చిలీ, గ్రీస్, ఫ్రాన్స్ దేశాల్లో బాగా పండిస్తారు.
అక్కడి నుంచే మనకు దిగుమతి అవుతోంది. ఇది ద్రాక్షలాగా పైన గ్రిల్ ఏర్పాటు చేసి వేలాడతీసే పంట. గది ఉష్ణోగ్రత వద్ద తెంపిన కొన్నిరోజులకు పండుతుంది. సరిగా నిల్వ చేస్త్తే వారం నుంచి రెండు వారాలుంటుంది. ఇందులో విటమిన్ సి, కె, ఇ లు, ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ బాగా దొరుకుతాయి. ఈ పండుకు ఒక విశేషం ఉంది. ఇది చైనా జాతీయ పండు. తమాషా ఏంటంటే... వీటి ఉత్పత్తిలో టాప్-20 దేశాల్లో చైనా లేదు!
ప్లమ్: చూడడానికి చిన్న యాపిల్‌లా, స్పర్శకు టమోటాలా ఉండే ఈ పండ్లు పెద్ద రేగుపళ్ల సైజులో ఉంటాయి. దీనిని విక్టోరియా ప్లమ్ అంటారు. ఈ రకం మన వద్ద ఎక్కువ. నేరేడు రంగులో ఉండేది ‘డామ్సన్’ రకం.
ఇది వేర్వేరు దేశాల్లో వేర్వేరు కాలాల్లో పండుతుంది. ఒక్కోదేశం నుంచి ఒక్కోకాలంలో దిగుమతి అవుతుంది. ఇందులో ఒకటే విత్తనం ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి పెంచుతుంది. క్యాల్షియం, సి, బి విటమిన్లు, మెగ్నీషియంతో పాటు చాలా పోషకాలు దొరుకుతాయి. ఈ పండు చైనాలో అత్యధికంగా పండుతుంది. దీంతో ఒకరకం వైన్ కూడా తయారుచేస్తారు. చైనాలో ఏడాదికి 60 లక్షల టన్నులు పండుతుంది. రెండో స్థానంలో సైబీరియా ఉన్నా చైనాలో పదో వంతు కూడా ఉత్పత్తి కాదు. ఈ పండు ఇండియాలోనూ పండుతుంది కానీ బాగా తక్కువ. ఏడాదికి 2 లక్షల టన్నులే.
డ్రాగన్ ఫ్రూట్: ఈ పండుకు పేరుకు భలే సూటవుతుంది. క్యాబేజీ సైజులో పైకి గులాబి రంగులో ఉండే ఈ పండుకు దళసరి తొక్కు ఉంటుంది. లోపల ఎక్కువగా తెలుపు రంగులో, కొన్ని ఎరుపు రంగులో ఉంటాయి. పుచ్చకాయలో లాగే తోలుకు పండు అంటుకుని ఉంటుంది, అలాగే గింజలుంటాయి కాని చిన్నవి. కాక్టస్ జాతి. థాయ్‌లాండ్ నుంచి మనకు ఎక్కువగా దిగుమతి అవుతుంది. ఇది లో క్యాలరీ పండు. విటమిన్ సి, ఫాస్పరస్, క్యాల్షియమ్, ఫైబర్‌తో పాటు యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ. ఒకప్పుడు సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికాలో పండే ఈ పండును ఇపుడు పలు ఆసియా దేశాలు పండిస్తున్నాయి.
చెర్రీ ఫ్రూట్: ఇది విదేశీ పండే అయినా చాలాకాలం క్రితమే మనకు పరిచయం. పశ్చిమాసియా, యూరప్‌లో వీటి మూలాలున్నాయి. ఇవి ఇండియాకు భారీగా దిగుమతి అవుతాయి. మన దగ్గర వీటిని పాన్‌లో, వంటల్లో వాడతారు. నేరుగా కూడా తింటారు. చెర్రీ 40 శాతం యూరప్‌లో, 13 శాతం అమెరికాలో పండుతుంది. దీనిని అత్యధికంగా టర్కీలో పండిస్తారు. అమెరికాది రెండోస్థానం. ఇందులో కార్బొహైడ్రేట్స్, షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం కూడా బాగా దొరుకుతుంది.
మరి కొన్ని విశేషాలు
స్ట్రాబెర్రీని తెలుగు వాళ్లు ఇంపోర్టెడ్ ఫ్రూట్ అనుకుంటారు. కానీ అది మనదేశంలోని పది రాష్ట్రాల్లో పండుతుంది. ఇంకొంత శ్రీలంక నుంచి దిగుమతి అవుతుంది.
పూర్తిగా ఇండియాలోనే పండుతాయి అనుకునే యాపిల్ పండ్లు మనదేశానికి అత్యధికంగా విదేశాల నుంచి వస్తాయి. ఇవి చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ దేశాల నుంచి దిగుమతి అవుతాయి.
ఆరెంజ్ ఫ్రూట్ మన వద్ద పండేది కేవలం రెండు నెలలే.. మిగతా పది నెలలు మనం తినేది దిగుమతి చేసుకున్న నారింజనే. వీటిని ఈజిప్ట్ నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటాం.
మన దగ్గర కేకుల్లో, ఐస్‌క్రీమ్స్‌లో ఎక్కువగా కనిపించే లిచే ఫ్రూట్ థాయ్‌లాండ్ నుంచి వస్తుంది. ఇది పైకి స్ట్రాబెర్రీలా లోపలకు మెత్తగా తెల్లగా రేగుపళ్ల సైజుల్లో ఉంటుంది.
ఎందుకొస్తున్నాయి?
సూపర్ మార్కెట్ల ట్రెండ్ వచ్చాక పండ్లు తాజాగా ఉంటేనే కొంటున్నారు. మనదేశంలో పండే పండ్ల నిల్వ సౌకర్యాలు గాని, రవాణా గాని సరిగా లేకపోవడం వల్ల 40 శాతం పళ్లు మార్కెట్‌కు రాకముందే పాడైపోతున్నాయి. అదే విదేశీ పళ్లు చాలా చక్కటి ప్యాకింగ్‌లో వస్తాయి. సరైన పద్ధతులు పాటించడం వల్ల అవి ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటున్నాయి. ప్యాకేజింగ్ పద్ధతి మారకపోతే మన దేశ పండ్ల మార్కెట్ భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది.