ఇది మనకి పనికిరాదా?
వాయనం
కొన్నాళ్లక్రితం మహిళలందరి నోటా ఓ వస్తువు గురించి తరచూ వినిపిస్తూ ఉండేది. ఆ వస్తువు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ వారి ఎదురు చూపులు ఫలించలేదు. అది మార్కెట్లోకి రాలేదు. వచ్చిన ఒకట్రెండు చోట్ల కూడా సక్సెస్ అవ్వలేదు. దాంతో భారతీయ మార్కెట్ నుంచి అది మాయమైంది. ఇంతకీ ఆ వస్తువేంటో తెలుసా... డిష్ వాషర్!
గిన్నెలు కడుక్కోవడానికి తయారు చేసిన ఈ యంత్రం చాలా ఉపయోగకరమైనది. గిన్నెలన్నీ ఇందులో అమర్చి బటన్ నొక్కితే, అదే కడిగేస్తుంది. ఇది మనకూ లభిస్తే బోలెడంత శ్రమ తగ్గిపోతుందని భారతీయ మహిళలు ఆశించారు. కానీ మన దగ్గర డిష్ వాషర్లు పనికి రావని తేలిపోయింది. దానికి కారణాలు బోలెడు.
దీని ఖరీదు చాలా ఎక్కువ కాబట్టి పట్టణాల్లోని ఉన్నత ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లాంటివాళ్లు మాత్రమే దీన్ని కొనగలుగుతారు. అయితే భారతీయ నగరాల్లో చాలాచోట్ల నీటి సమస్య ఉంది. డిష్ వాషరేమో చాలా నీరు తీసుకుంటుంది
విదేశాల్లో తినే ఆహారంలో నూనెశాతం చాలా తక్కువ. కానీ మనం నూనె, మసాలాలు, నెయ్యి వంటివి ఎక్కువ వాడతాం. కాబట్టి జిడ్డు, మొండి మరకలు ఏర్పడతాయి. వాటిని వాషర్ పూర్తిగా పోగొట్టలేదు. ఎందుకంటే ఇది విదేశీయుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చేసింది కదా! ముందు మనం ఓసారి కడిగి, అప్పుడు వాషర్‌లో పెట్టాల్సి ఉంటుంది. అంతకంటే మామూలుగా కడుక్కోవడమే బెటర్ కదూ!
విదేశీయులు పింగాణీ, ఫైబర్ వస్తువులు ఎక్కువ వాడతారు. అవి తేలిగ్గా శుభ్రమవుతాయి. కానీ మనం స్టీలు, సీమవెండిని ఎక్కువ వాడతాం. వాటిని కడగడం వాషర్‌కి కాస్త కష్టమే!
కాస్త పెద్ద కుటుంబమైతే ఎక్కువ గిన్నెలుంటాయి. రెండు మూడు సార్లు కడుక్కోవాలి. మరి కరెంటు బిల్లు మామూలుగా వస్తుందా! పైగా ఎక్కువమంది ఉండే కుటుంబాల్లో పెద్ద పెద్ద గిన్నెల్లో వండుతారు. అవి వాషర్‌లో పట్టవు కూడాను!
ఇన్ని సమస్యలు ఉండబట్టే మనకు డిష్ వాషర్లు అంతగా అందుబాటులోకి రాలేదు. మరి ఏ కంపెనీ అయినా మనల్ని తృప్తిపరిచే వాషర్లు తయారుచేస్తుందేమో చూద్దాం!