సమయాన్ని, జీవితాన్ని వృథా కానీయకండి! | Don not waster time, life at a time | Sakshi
Sakshi News home page

సమయాన్ని, జీవితాన్ని వృథా కానీయకండి!

Published Sun, Jun 22 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

సమయాన్ని, జీవితాన్ని వృథా కానీయకండి!

సమయాన్ని, జీవితాన్ని వృథా కానీయకండి!

వాయనం: గృహిణి అనగానే...  ఇంట్లో ఉండి వంట చేసుకుంటూ, పిల్లల్ని
 పెంచుకుంటూ, ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉండే  మహిళ అని ఠక్కున నిర్వచించేస్తారంతా.
 గృహిణులు ఇవి మాత్రమే చేయాలా?  చేయడానికి వారికింకేమీ ఉండదా?
 అసలు వారు ఇవి తప్ప ఏమీ చేయలేరా?  చేయగలరు. ఇంట్లో ఉంటూనే చాలా చేయగలరు.
 ఆ నిజాన్ని గ్రహించక చాలామంది మహిళలు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.
 
 పెళ్లి, కొత్త కాపురం, పిల్లలు, వారి పెంపకం అంటూ కొన్ని సంవత్సరాలు వేగంగా పరుగులు తీస్తాయి. అప్పుడు వేరేదాని గురించి ఆలోచించే తీరిక దొరకదు. కానీ పిల్లలు కాస్త ఎదిగి, బడికి వెళ్లిపోవడం మొదలుపెట్టాక జీవితంలో కాస్త మార్పు వస్తుంది. అందరూ బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంటితో పాటు మనసు కూడా ఖాళీ అయిపోతుంది. బోర్ కొడుతుంది. ఏదైనా చేస్తే బాగుణ్ను అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి ఇంతేనా జీవితం అనిపిస్తుంది. నిజమే. జీవితమంటే అంతే కాదు. ఇంకా ఎంతో ఉంది.
 
 చదువు లేదని, తమకు ఉద్యోగం చేసే అర్హత లేకపోవడం వల్ల ఇంటికే పరిమి తమైపోయామని కుమిలిపోయే మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. అయితే జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే ఏ అర్హతలు కావాలి? డిగ్రీలు పుచ్చుకుని ఉద్యోగాలు చేయాలా? రోజూ ఆఫీసుకెళ్లి టార్గెట్లు అందుకోవడానికి పరుగులు తీయాలా? అవసరం లేదు. లేని దాని కోసం బెంగ పడాల్సిన పనిలేదు. మనకున్న అర్హత ఏంటో తెలుసుకుంటే చాలు... ఏదో ఒకటి సాధించడానికి.
 
 వంట బాగా చేస్తారా... ఇంట్లోనే కర్రీ పాయింట్ ఎందుకు పెట్టకూడదు? పచ్చళ్లు బాగా పెడతారా... పెట్టి ఎందుకు అమ్మకూడదు? కుట్లు వచ్చా... ఇంట్లోనే పదిమందికీ ఎందుకు నేర్పకూడదు? మీరే టైలరింగ్ పని చేసి ఎందుకు సంపాదించ కూడదు? అల్లికలు, బొమ్మల తయారీ వంటివి తెలుసా... తయారుచేసి చుట్టు పక్కలవాళ్లకు ఎందుకు అమ్మకూడదు? గోరింటాకు బాగా పెడతారా... ఫంక్షన్లకు మెహందీ పెడతానంటూ ఇంటిముందు ఓ బోర్డు ఎందుకు పెట్టకూడదు? కాస్తో కూస్తో చదువుకున్నారా... చిన్నపిల్లలకైనా ట్యూషన్లు ఎందుకు చెప్పకూడదు?
 చేసే ఓపిక, చేయాలనే మనసు ఉండాలే గానీ... చేసేందుకు ఎన్నో పనులు కనిపిస్తాయి. వాటిని చేసేందుకు మీలో మీకు ఎన్నో అర్హతలు కనిపిస్తాయి. అయితే ఇదేదో డబ్బులు సంపాదించడానికే కాదు. మీరు మధ్య తరగతి వారైతే మీ సంపాదన మీవారి సంపాదనకు తోడవుతుంది.
 
 ఇంటి అవసరాలను తీరుస్తుంది. ఆ అవసరం లేదు అనుకుంటే... మీరు చేసే పనితో మీ సమయం సద్వినియోగం అవుతుంది. మీరు చేసే పని పదిమందికీ తెలిసి ప్రశంసలు లభిస్తే కలిగే ఆనందమే వేరు. మీ పేరు మీ చుట్టుపక్కల మారుమోగితే ఆ తృప్తే వేరు. మీరు సంపాదించిన ఆ కాసింత సొమ్ముతో మీ ఇంటిలో ఓ చిన్న వస్తువును సమకూర్చగలిగినా లభించే సంతోషమే వేరు. కాబట్టి ఇక సమయాన్ని వృథా చేయకండి. సమయం వృథా అయితే... జీవితం వృథా అయినట్టే!
 
 గుడ్డు తినమంటే  పిల్లలు గంతులేస్తారిక!
 రోజూ పొద్దున్నే పిల్లలకు ఓ గుడ్డు తినిపిస్తే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ పిల్లలతో ఏదైనా చేయించాలంటే అంత తేలిక కాదు కదా! ఒకట్రెండు రోజులు తింటారు, మూడో రోజు  పేచీ పెడతారు. అలాంటి తుంటరి పిల్లలతో రోజూ గుడ్డు తినిపించడానికి ఓ మంచి మార్గం దొరికిందిప్పుడు. ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ‘ఎగ్ మోల్డ్స్’. వీటికి ఉన్న గుంతలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డును మోల్డ్‌లో ఉంచి, మూత పెట్టి గట్టిగా నొక్కి, తర్వాత బయటకు తీసి చూస్తే... మోల్డ్‌లో ఉన్న బొమ్మ ఆకారంలోకి గుడ్డు మారిపోతుంది. వాటిని చూస్తే పిల్లలు సరదా పడి చకచకా తినేస్తారు. కావాలంటే ట్రై చేసి చూడండి. రెండు మోల్డ్స్ ధర రూ. 720. ఆన్‌లైన్లో అయితే కాస్త తక్కువకు వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement