డైనమిక్ రిపోర్టర్లు
కుదిరితే నాలుగు డైలాగులు, అవసరాన్ని బట్టి ఆరు పాటలు... చాలా సినిమాల్లో హీరోయిన్ల పరిస్థితి ఇంతే. గ్లామర్ ఒలకబోయడానికే పరిమితం కాకుండా ప్రతిభను ప్రూవ్ చేసుకునే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. కొన్ని పాత్రల ద్వారానే ఆ చాన్స్ దొరుకుతుంది. అలాంటి పాత్రల్లో జర్నలిస్ట్ పాత్ర ఒకటి. ఆ పాత్రలో కొందరు హీరోయిన్లు నటించి మెప్పించి గుర్తుండిపోయారు. వారే వీరు.
‘నో ఒన్ కిల్డ్ జెస్సికా’లో రాణీ ముఖర్జీ అచ్చమైన జర్నలిస్టులా కనిపించింది. ‘సత్యాగ్రహ’లో కరీనా కూడా చక్కని ప్రతిభ కనబర్చింది. దక్షిణాదికి వస్తే... ‘రాఖీ’లో ఇలియానా చేసిన పాత్ర సూపర్బ్. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని అడ్డుకోవడానికి ప్రాణాలను అడ్డు వేసే సన్నివేశంలో ఆమె నటనను మర్చిపోలేం. ‘సెల్యూట్’లో చిలిపి రిపోర్టర్‌గా, ‘కృష్ణం వందే జగద్గురుం’లో మంచి విలువలున్న జర్నలిస్టుగా నయనతార కూడా అద్భుతంగా చేసింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో ఫొటో జర్నలిస్టుగా తమన్నా కూడా మార్కులు కొట్టేసింది. ఇక ‘అనసూయ’లో భూమిక నటన అయితే అత్యద్భుతం. రిపోర్టర్ అంటే ఇలానే ఉండాలి అనేంతగా అదరగొట్టేసిందామె!