మరపురాని స్నేహగీతం...
స్నేహం ఒక నిరంతర స్రవంతి. వయసుతో పని లేని వాత్సల్యం దానిది. అమ్మ అనురాగాన్ని, అనంతమైన ఆప్యాయతని దోసిళ్లకు అందించే దోస్తీ అది.‘పాదమెటు పోతున్నా... పయనమెందా కైనా... అడుగు తడబడుతున్నా... తోడు రానా...’’ అంటూ నీ నీడలా మారుతుంది. నీకు కష్టమొస్తే కుంగిపోతుంది. నీకు దూరమైతే తల్లడిల్లిపోతుంది.ఓ మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా... అంటూ నువ్వు తనని ఆదుకున్న సందర్భాలను మళ్లీ ఒకసారి మనసులో తలుస్తుంది.
ఈ పాట పుట్టుకని నెమరువేసుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తాజాగా అనిపిస్తుంది. అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది.... జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది... అని స్నేహం ఔన్నత్యాన్ని కీర్తించాను. అమ్మని కూడా మించిన మమతల్ని నాకు పంచుతున్న నేస్తాన్ని చూసి గర్వించాను. ‘మీరు... మీరు నుంచి మన స్నేహగీతం.... ఏరా ఏరాల్లోకి మారె... మోమాటాలే లేని కళలే జాలువారే...’ అంటూ పాడుకున్నాను.చిన్నప్పటి సంగతుల్ని చిత్రిక పట్టి మనసు పటంలో దాచుకునే స్నేహ పరిమళం దాచాలన్నా దాగదు. అది మెదడు పుటల్లో మెదులుతూనే ఉంటుంది.
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే... నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంత వాలే... అని మురిసిపోతుంది మనసు.గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్లింతల్లో తేలే స్నేహం...మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే...నిజంగా తెలుస్తుందా... ఏ స్నేహం ఎప్పుడు మొదలయ్యిందో? ఏ నిమిషం ఒకే ప్రాణంగా మారిపోయిందో? ఏ ఊపిరి ఎవరిదో పోల్చుకోవడం కష్టమవుతుందో? ఎలా తెలుస్తుంది నేస్తమే లోకమైనప్పుడు! ఎలా తెలుస్తుంది సమస్తమూ తానై మనలో ఏకమైనప్పుడు! ఎలా తెలుస్తుంది... స్నేహతత్త్వమే మనల్ని, ఈ లోకాన్ని పునీతుల్ని చేస్తుందని...!!
– సంభాషణ: డా. వైజయంతి
చిత్రం: హ్యాపీడేస్
రచన: వనమాలి
సంగీతం: మిక్కీ జె మేయర్
గానం: ప్రిన్స్ శ్యామ్