గురుపూర్ణిమ | funday cover story:guru purnima | Sakshi
Sakshi News home page

గురుపూర్ణిమ

Published Sun, Jul 22 2018 12:15 AM | Last Updated on Mon, Aug 20 2018 5:39 PM

funday cover story:guru purnima - Sakshi

గురువును దైవ సమానంగా ఆరాధించడం మన దేశంలో తరతరాల నాటి సంప్రదాయం. ప్రాచీన గురుకుల సంప్రదాయం శతాబ్దాల తరబడి కొనసాగింది. మన పురాణాల ప్రకారం పరమ శివుడిని ఆదిగురువుగా పరిగణిస్తారు. భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా ఆరాధిస్తారు. కొన్ని అవతారాల్లో శ్రీమహావిష్ణువు సైతం గురువుల వద్దనే విద్యాభ్యాసం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.  ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు పరమ శివుడు ఆదిగురువుగా ఆవిర్భవించినందున ఈ రోజును గురుపూర్ణిమగా పాటించడం యోగ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. జూలై 27న గురుపూర్ణిమ సందర్భంగా... 

యోగ సంప్రదాయంలో శివుడిని ఆదియోగిగా కూడా పరిగణిస్తారు. గురుపూర్ణిమ రోజుకు మరికొన్ని పౌరాణిక విశిష్టతలు కూడా ఉన్నాయి. పరాశర మహర్షికి, సత్యవతికి వ్యాస మహర్షి ఇదే రోజున జన్మించినందున గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుడు మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించాడు. అపౌరుషేయాలైన వేద శ్లోకాలను సేకరించి, వాటిని రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా విభజించాడు. అందుకే వ్యాసుడికి వేదవ్యాసుడనే పేరు వచ్చింది. గురు పూర్ణిమను హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పర్వదినంగా పాటిస్తారు.

గురుశిష్య పరంపర
గురుశిష్య పరంపర వేదకాలం నుంచే ఉండేది. నాటి గురువులు శిష్యులకు వేద విద్యను మౌఖికంగా చెప్పేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక, యోగ విద్యలు మాత్రమే కాకుండా ఆనాటి గురువులు అస్త్ర శస్త్ర విద్యలు, ఆయుర్వేద, గణిత జ్యోతిష వాస్తు శాస్త్రాలు, శిల్పం, సంగీతం వంటి లౌకిక విద్యలను కూడా నేర్పేవారు. గురువుల ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో రాజు పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన పిల్లలకూ ఒకే రీతిలో విద్యలు నేర్పించేవారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులు గురువులకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురుకులాల నిర్వహణ కోసం కావలసిన వనరులను రాజులు సమకూర్చేవారు. విద్యాభ్యాసానికి తగిన వయసు వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్చేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు వారు గురుకులాల్లోనే నివాసం ఉండేవారు. శిష్యుల యోగక్షేమాలను గురువులే చూసుకునేవారు. గురువులకు శుశ్రూషలు చేస్తూ శిష్యులు విద్యలను నేర్చకునేవారు. యోగ వంటి ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే వారైతే గురువును అవతారమూర్తిగా ఆరాధించేవారు. ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే శిష్యులు మోక్షమే లక్ష్యంగా గురువుల వద్ద ఉంటూ యోగ సాధన కొనసాగించేవారు. లౌకిక విద్యలు నేర్చుకునే శిష్యులు తమ తమ విద్యల్లో తగిన ప్రావీణ్యం సాధించిన తర్వాత గురువులు వారిని ఆశీర్వదించి సమాజంలోకి పంపేవారు. వారు వివిధ వృత్తుల్లో స్థిరపడేవారు. హిందూ మతంలోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాల్లోను, బౌద్ధ, జైన మతాల్లోని వివిధ శాఖల్లోనూ గురుశిష్య పరంపరకు విశిష్ట స్థానం ఉంది. గురుశిష్యుల అనుబంధానికి సంబంధించిన పలు గాథలు మన పురాణాల్లోను, ఆధ్యాత్మిక గురువుల చరిత్రల్లోనూ కనిపిస్తాయి.

గురువు ఎలా ఉండాలంటే..?
అద్వైత ఆచార్యుడు ఆదిశంకరాచార్యులు గురువు విశిష్టతను తన ‘ఉపదేశ సాహస్రి’లో వివరించారు. జ్ఞానసాగరంలో పయనించే శిష్యులకు గురువు నావలాంటివాడని ఆయన అభివర్ణించారు. శిష్యులకు శ్రుతులు, స్మృతులు నేర్పడమే కాకుండా, వారి నియమ నియమాలను పాటించడంలో నిష్ణాతులుగా తయారు చేయాలని, వారికి రాగద్వేషాలను అదుపు చేసుకోగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలని, అరిషడ్వర్గాలకు దూరంగా వారిని సన్మార్గంలో ముందుకు నడిపించడం గురువు బాధ్యత అని విశదీకరించారు. వేద వేదాంతాల్లో నిపుణుడు, జ్ఞానసంపన్నుడు, ఈర్షా్యద్వేషాలు లేశమైనా లేనివాడు, నిస్వార్థపరుడు, యోగ సాధనాపరుడు, నిరాడంబరుడు అయిన వ్యక్తి మాత్రమే గురువు కాగలడని, అలాంటి ఉన్నత లక్షణాలు ఉన్న గురువు మాత్రమే తన శిష్యులలో అంధకార తిమిరాన్ని పారద్రోలి వారిని జ్ఞానమార్గంలో ముందుకు నడిపించగలడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తత్వం ఎరిగిన వాడు, ధర్మాన్ని బోధించేవాడు, దైవత్వంగలవాడు మాత్రమే గురువు కాగలడని జైనమతం చెబుతోంది. గురువు మాత్రమే కైవల్యప్రాప్తిని కలిగించగలడని జైనుల విశ్వాసం. దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానమార్గానికి ఆలంబన గురువు అని సిక్కులు విశ్వసిస్తారు. గురువే ‘ధమ్మం’, గురువే ‘సంఘం’ అని బౌద్ధులు నమ్ముతారు. బుద్ధత్వాన్ని పొందిన గురువును అత్యుత్తమ గురువుగా వారు పరిగణిస్తారు. 

దత్త సంప్రదాయంలో గురుపూజ
దత్త సంప్రదాయంలో గురుపూజకు చాలా విశిష్టత ఉంది. అత్రి అనసూయల తనయుడు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీదత్తాత్రేయుడిని గురుదత్తునిగా కొలుస్తారు. దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణించే శ్రీపాద శ్రీవల్లభుని, శ్రీ నృసింహ సరస్వతి స్వామిని, శ్రీ షిరిడీ సాయిబాబాను గురుపూర్ణిమ రోజున ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. దత్త  క్షేత్రాలలోను, దత్త పీఠాల్లోను, షిరిడీలోని ప్రధాన ఆలయం సహా దేశవ్యాప్తంగా గల సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ వేడుకలు ఏటా మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. దత్త భక్తులు, షిరిడీ సాయి భక్తులు ఈ రోజుల్లో గురు చరిత్ర, గురుగీత పారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. తమ తమ గురువులకు ఇతోధికంగా దక్షిణలు సమర్పించి, సత్కారాలు చేస్తారు. గురుపూర్ణిమ నాడు గురుపూజ వల్ల జ్ఞాన వృద్ధి, మోక్ష సిద్ధి కలుగుతాయని నమ్ముతారు.

చరిత్రలో మన ఆధ్యాత్మిక గురువులు
భారతదేశ చరిత్రలో ఆధ్యాత్మిక గురువులు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు తమ తమ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రబోధించి, భిన్న మతాలను స్థాపించారు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని క్రీస్తుపూర్వమే స్థాపించారు. ఇవి విదేశాలకూ వ్యాపించాయి. అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని బోధించిన మధ్వాచార్యులు త్రిమతాచార్యులుగా ప్రసిద్ధికెక్కారు. ఆదిశంకరులు జీవించిన కాలం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే అయినా, ఆ స్వల్పకాలంలోనే ఆయన ఆధ్యాత్మిక రంగంలో అసాధారణమైన పురోగతిని తీసుకొచ్చారు. వివేకచూడామణి, సౌందర్యలహరి వంటి గొప్ప రచనలు చేశారు. బ్రహ్మసూత్రాలపైన, భగవద్గీతపైన వ్యాఖ్యానాలు రాశారు. రామానుజాచార్యులు 120 ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపారు. దళితులకు ఆలయ ప్రవేశం వంటి సంస్కరణలకు తెరలేపిన తొలి ఆధ్యాత్మిక విప్లవకారుడు ఆయన. ద్వైత మార్గాన్ని బోధించిన మధ్వాచార్యులు ఆదిశంకరులు, రామానుజులు చేసిన రచనలపై విమర్శనాత్మక విశ్లేషణలు చేశారు. గురు రాఘవేంద్రులు మధ్వ మార్గానికి మరింత ప్రాచుర్యం కల్పించారు. నింబకారాచార్యులు ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ గురువు, కృష్ణభక్తుడు అయిన శ్రీ చైతన్య మహాప్రభువు భక్తి మార్గానికి ప్రాచుర్యం కల్పించారు. 

ఆధునిక యుగంలో మన గురువులు
ఆధునిక యుగంలో కూడా పలువురు గురువులు యోగ, ఆధ్యాత్మిక మార్గాల్లో తమ తమ శిష్యులకు వెలుగు బాట చూపారు. బెంగాల్‌లో కాళికాదేవి భక్తుడైన రామకృష్ణ పరమహంస భగవంతుడు ఒక్కడేనని, అయితే ఆయనను చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయని బోధించాడు. రామకృష్ణ పరమహంస వద్ద ఆధ్యాత్మిక విద్య పొందిన స్వామీ వివేకానంద పాశ్చాత్య ప్రపంచంలో సైతం భారతీయ ఆధ్యాత్మిక తత్వజ్ఞానానికి ప్రాచుర్యం కల్పించారు. స్వామీ వివేకానంద ఆధ్వర్యంలో రామకృష్ణ భక్తి ఉద్యమం దేశ విదేశాలకు విస్తరించింది. మహావతార్‌ బాబా పరంపరకు చెందిన పరమహంస యోగానంద సైతం భారతీయ యోగ ఆధ్యాత్మిక విద్యలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పించారు. లాహిరి మహాశయుని శిష్యుడైన యుక్తేశ్వర గిరి వద్ద పరమహంస యోగానంద యోగ విద్యాభ్యాసం చేశారు. తమిళనాడుకు చెందిన స్వామీ శివానంద కొంత కాలం దేశ విదేశాల్లో వైద్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. దివ్యజీవన సంఘాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక జ్ఞానానికి బోధించారు. స్వామీ శివానంద శిష్యుడైన స్వామీ కృష్ణానంద దివ్యజీవన సంఘం ద్వారా తన గురువు బోధనలకు మరింత ప్రాచుర్యం కల్పించారు. స్వామీ రామతీర్థ కొంతకాలం గణిత ఆచార్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. ప్రాక్‌ పశ్చిమ దేశాల్లో విస్తృతంగా పర్యటించి భారతీయ వైదిక జ్ఞానాన్ని, తత్వాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ కుటుంబానికి చెందిన స్వామీ ప్రభుపాద ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణా కాన్షియస్‌నెస్‌’ (ఇస్కాన్‌) ఉద్యమాన్ని దేశ విదేశాలకు విస్తరించారు. ఆయన ఇంగ్లిష్‌లోకి అనువదించిన భాగవతం విదేశాల్లో పాఠకాదరణ పొందింది. అరుణాచల స్వామిగా పేరుపొందిన రమణ మహర్షి భక్తిమార్గాన్ని బోధించారు. ఇలాంటి ఎందరో గురువులు భారతీయ వైదిక తత్వానికి, భక్తి మార్గానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు.

గురువు ప్రాముఖ్యత
మన సనాతన సంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గురువును త్రిమూర్తి స్వరూపంగా, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించి, పూజించడం మన సంప్రదాయం. గురువు రూపమే ధ్యానానికి మూలమని, గురు పాదాలే పూజకు మూలమని, గురు వాక్యమే మంత్రానికి మూలమని, గురు అనుగ్రహమే మోక్షానికి మూలమని ‘గురు గీత’ చెబుతోంది. విశాల విశ్వమే గురుస్వరూపమని సనాతన గురువులు చెప్పిన మాట. గురువులకే గురువుగా పరిగణించే దత్తాత్రేయుడు ఇరవై నాలుగు ప్రకృతి శక్తులనే గురువులుగా తలచి లోకానికి భక్తి జ్ఞానమార్గాన్ని  బోధించాడు. గురు పూర్ణిమ రోజున వ్యాసుని మొదలుకొని గురు పరంపరను స్మరించుకుని పూజించడం ఆచారంగా వస్తోంది. మన దేశంలోని దేవాలయాలు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలలో గురుపూజ వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లోనైతే దేవాలయాలే కాకుండా విద్యాసంస్థల్లో కూడా గురుపూర్ణిమ వేడుకలు జరుగుతాయి. గురుపూర్ణిమ నాడు విద్యార్థులందరూ గురువులను సంప్రదాయబద్ధంగా టోపీలతో అలంకరించి, కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు అందుకుంటారు.

పురాణాల్లో ప్రసిద్ధ గురువులు
మన పురాణాల్లో ప్రసిద్ధులైన గురువులు చాలామందే ఉన్నారు. దేవతల గురువు బృహస్పతి సకల శాస్త్ర కోవిదుడుగా పురాణాల్లో కనిపిస్తాడు. పలు ధర్మశాస్త్రాలు బృహస్పతి పేరుతో ప్రసిద్ధి పొందాయి. బృహస్పతి ప్రస్తావన రుగ్వేదం మొదలుకొని అనేక పురాణాల్లో కనిపిస్తుంది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూడా బృహస్పతికి దీటైన శాస్త్ర కోవిదుడు. శుక్రాచార్యుడు చెప్పిన నీతి సూత్రాలు ‘శుక్రనీతి’గా ప్రసిద్ధి పొందాయి. మరణించిన వారిని తిరిగి బతికించగల మృతసంజీవని విద్యకు శుక్రాచార్యుడే ఆద్యుడని, దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు తన విద్యతోనే తిరిగి బతికించేవాడని పురాణాలు చెబుతాయి. రామ లక్ష్మణులకు గురువైన విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని లోకానికి చాటాడు. వశిష్టుడితో స్పర్థపూని అనేక కష్టనష్టాలను, అగ్నిపరీక్షలను ఎదుర్కొని మరీ బ్రహ్మర్షి పదవిని సాధించాడు. తాను బొందితో స్వర్గానికి పంపిన త్రిశంకుడిని దేవతలు కిందకు తోసేస్తే, అతడి కోసం దేవతల స్వర్గాన్ని తలదన్నే త్రిశంకు స్వర్గాన్ని నిర్మించాడు. సప్తర్షులలో ప్రసిద్ధుడైన వశిష్టుడు రఘు వంశానికి కులగురువు. బాల్యంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్టుడి వద్దనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు జన్మించారు. ఆయనే వారికి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించాడు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు సకల శాస్త్రాలతో పాటు అస్త్రశస్త్ర విద్యలనూ నేర్పించారు. కురువృద్ధుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు పరశురాముడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. జగద్గురువుగా పూజలు పొందే శ్రీకృష్ణుడు బాల్యంలో సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశాడు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురువులకే గురువుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన గౌరవార్థమే గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమగా పరిగణిస్తారు.

గురుపూర్ణిమ నాడే  చంద్రగ్రహణం
ఈసారి గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఇది సుదీర్ఘ చంద్రగ్రహణం. యోగ సాధకులు, మంత్రవేత్తలు గ్రహణాలు చాలా విశిష్టమైనవిగా పరిగణిస్తారు. పర్వదినాల్లో గ్రహణాలు వచ్చినట్లయితే, అవి మరింత విశిష్టమైనవిగా భావిస్తారు. గ్రహణ సమయంలో చేసే మంత్రజపం అనంత ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. మంత్రోపదేశం పొందిన వారు గ్రహణకాలం ప్రారంభానికి ముందు స్నానం ఆచరించి, ఎలాంటి ఆహారం తీసుకోకుండా గ్రహణం పూర్తిగా విడిచిపెట్టే వరకు మంత్రజపం, ధ్యానం చేస్తారు. మంత్రోపదేశం లేని వారు నవ గ్రహశ్లోకాలలోని చంద్ర శ్లోకాన్ని ఈ సమయంలో పఠించుకోవచ్చు. గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత తిరిగి స్నానం ఆచరించి, ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు సంప్రోక్షణ జరిపి ఆ తర్వాతే నిత్యపూజ చేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత యథాశక్తి దానాలు చేస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే గ్రహణ సందర్భంగా బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, కర్పూరం, చందనం, శంఖం, వెండి వస్తువులు, తెల్లని పువ్వులు, ముత్యాలు, తెల్లని వస్త్రాలు శక్తిమేరకు దానం చేస్తే దోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

గురుపూర్ణిమ గురించి కొన్ని విశేషాలు
గురు పూర్ణిమ రోజునే వర్ధమాన మహావీరుడు గౌతమస్వామిని తన తొలి శిష్యునిగా స్వీకరించాడు.
ఇదే రోజున గౌతమ బుద్ధుడు సారనాథ్‌లో తన శిష్యులను ఉద్దేశించి తొలి బోధ చేశాడు.
ఆదిగురువు అయిన పరమశివుడు ఇదే రోజున సప్తర్షులకు యోగ రహస్యాలను బోధించాడు.
వేదవ్యాసుడు తన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమ రోజునే బ్రహ్మసూత్రాల రచన ప్రారంభించాడు
గురుపూర్ణిమ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమంలోని గురువులు ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాటి నుంచి నాలుగు నెలల పాటు బస చేసిన చోటే ఉంటూ శిష్యులకు బోధన చేస్తారు.
ఆధ్యాత్మిక సాధన ప్రారంభించదలచిన వారు గురుపూర్ణిమ రోజున గురువుల సమక్షంలో సాధన ప్రారంభించడాన్ని శ్రేష్టంగా భావిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement