నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఈ మధ్య షుగర్ ఉన్నట్లు డాక్టర్ పరీక్షల్లో తేలింది. నేను, మావారు పిల్లలు కావాలనుకుంటున్నాము. మేము కలవడం వల్ల, మావారికి షుగర్ అటాక్ అవుతుందా? ఇదే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? – పి.ఆర్, ఇ–మెయిల్
షుగర్ వ్యాధి (మధుమేహం లేదా డయాబెటిస్) అనేది శరీరతత్వాన్ని బట్టి, జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు వంటి అనేక రకాల అంశాలనుబట్టి సంక్రమిస్తుంది. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే అంటు వ్యాధి కాదు కాబట్టి మీ నుంచి మీ వారికి వచ్చే అవకాశాలు అసలు లేవు. ఇప్పుడు మీకు 35 ఏళ్లు, షుగర్ ఉంది, పిల్లలు కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నాయా లేదా, బరువు ఎంత ఉన్నారు, మందులు అవే వాడాలా లేక మార్చాలా, డోస్ మార్చాలా, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దాన్నిబట్టే మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. షుగర్ ఉన్నవాళ్లు గర్భానికి ప్రయత్నించే ముందు షుగర్ శాతం అదుపులోకి తెచ్చుకోవాలి. హెచ్‌బీఏ1సి అనేది ఆరు కంటే తక్కువ ఉండాలి. బరువు తగ్గాలి. దీని కోసం ఆహారంలో, జీవనశైలిలో మార్పులు వంటివి చేసుకోవాలి. షుగర్ నియంత్రణలో లేకుండా గర్భం దాల్చడం వల్ల అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, నెలలు నిండకుండా కాన్పులు, బిడ్డ బరువు, కాన్పు సమయంలో ఇబ్బందులు, ఆపరేషన్ అవసరం రావడం, కడుపులో బిడ్డ చనిపోవడం వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వయసు 35 ఏళ్లు కాబట్టి అండాశయాల నుంచి విడుదలయ్యే అండాల సంఖ్య, నాణ్యత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తొందరగా షుగర్‌ను అదుపులోకి తెచ్చుకొని ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతూ గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. మూడు నుంచి ఆరు నెలల్లో గర్భం రాకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి పర్యవేక్షణలో సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని చికిత్స తీసుకోవడం మంచిది. లేకపోతే 35 ఏళ్లు దాటే కొద్దీ గర్భం దాల్చడానికి ఇబ్బంది, దాల్చిన తర్వాత అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, బీపీ పెరగడం వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
∙గతంలో నాకు చక్కగా నిద్రపట్టేది. అయితే ఇప్పుడు సరిగా నిద్ర పట్టడం లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది సాధారణమేనని ఒక్కరిద్దరు అన్నారు. ఇది నిజమేనా? బాగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? నేను ఎత్తు మడమల చెప్పులు వాడతాను. ఇవి వాడొద్దు అంటున్నారు. వీటి గురించి తెలియజేయగలరు. – బి.సరోజ, తెనాలి
ప్రెగ్నెన్సీ సమయంలో శారీరకంగా, మానసికంగా, హార్మోన్లలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. మొదటి మూడు నెలల్లో వికారం, వాంతులు, నీరసం వంటి లక్షణాల వల్ల చికాకు వంటివి ఏర్పడి నిద్ర పట్టకపోవచ్చు. తర్వాత బిడ్డ పెరిగి పొట్ట పెరిగే కొద్దీ బరువు నడుము మీద పడటం, అటూఇటూ తిరగడానికి ఇబ్బందిగా ఉండటం, ఊపిరితిత్తులు అదుముకున్నట్లుగా ఉండి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లు ఉండటం, అసిడిటీ వంటి లక్షణాల వల్ల నిద్ర సరిగా పట్టదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. రాత్రిపూట పడుకునే రెండు గంటలకు ముందే ఆహారం తీసుకోవాలి. తర్వాత కొంచెంసేపు అటూఇటూ నడవాలి. అలాగే పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగి, తల కింద దిండును ఎత్తుగా పెట్టుకుంటే నిద్ర పడుతుంది. కాళ్ల కింద లేదా కాళ్ల మధ్యలో, పొట్ట పక్కకి దిండు పెట్టుకుంటే కూడా కొద్దిగా నిద్ర పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో అయిదు నెలల తర్వాత నుంచి ఎక్కువసేపు ఎడమవైపుకి తిరిగి పడుకుంటే తల్లికి, బిడ్డకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో పొట్ట పెరిగేకొద్దీ బరువు నడుము మీద, అలాగే కాళ్ల మీద పడుతుంది. ఈ సమయంలో ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం వల్ల బరువుని బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. దానివల్ల బ్యాలెన్స్ తప్పి కాళ్లు మెలికపడటం, జారి కింద పడటం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనవసరంగా సమస్యలు తెచ్చుకోకుండా ఈ సమయంలో నడవడానికి సులువుగా, మెత్తగా ఉంటే ఫ్లాట్ చెప్పులు వేసుకోవడం మంచిది.
∙నాకు తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ఎక్కువగా తుమ్ముతుంటాను. చాలా నీరసంగా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో ఎక్కువగా తుమ్మడం వల్ల ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచించగలరు. – రవళి, ప్రొద్దుటూరు
మీకు తరచూ జలుబు చేస్తోంది అంటున్నారు. పేస్ట్ అలర్జీ వల్ల లేదా ఇంకా ఏదైనా అలర్జీ వల్ల, ఇస్నోఫిలియా వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు తరచూ జలుబు చేయడం, తుమ్ములు రావడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తుమ్ములు రావడం వల్ల పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు. కాకపోతే గర్భం పెరిగి పొట్ట పెరిగే కొద్దీ ఎక్కువగా తుమ్మడం వల్ల పొట్టమీద బరువు పడినట్లు ఉండటం, కొంతమందిలో మూత్రం కొద్దిగా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జలుబు రావడానికి అలర్జీతో పాటు వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. జలుబు అసలు రాకుండా ఉండేందుకు మనం ఏమీ చేయలేం. కాకపోతే అలర్జీ వల్ల వచ్చే జలుబు రాకుండా ఉండేందుకు, మీరు దుమ్ము ధూళికి దూరంగా ఉండటం, చల్లని, పడని ఆహార పదార్థాలను వాడకుండా ఉండటం, అవసరమైతే ఎప్పుడైనా అప్పుడప్పుడు సెట్రిజన్ మాత్ర వేసుకోవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment