
అదిగో... అతని పేరు ఆనంద్.అతడి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది.నిజానికి స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అతడు ఉన్నాడు.మొదట్లో ఎవరికైనా ఫోన్ చేయడం, లేదా ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తడం... ఇంత వరకే ఉండేది. అలాంటి ఆనంద్ కాస్తా మారిపోయాడు.స్మార్ట్‌ఫోన్ అనే సముద్రంలో సౌండ్ లేకుండా దూకేశాడు. ఇక అప్పటి నుంచి అతని జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఆనంద్‌లో ఆనందం ఆవిరైపోయింది. గాభరా మాత్రమేమిగిలిపోయింది. ఒక్కసారి వెనక్కి వెళదాం....
అప్పుడే నిద్రలో నుంచి లేచాడు ఆనంద్.లేవడం లేవడంతోనే స్మార్ట్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. ‘ఠింగ్’ అంటూ సౌండ్ వినిపించింది.‘పీక్‌స్టార్ బండబాబు... ఇక లేరు’ అనే హెడ్డింగ్ కనిపించింది.అయ్యో! ఎంత పనైంది. విధి ఎంత క్రూరమైనది. యాభై సంవత్సరాలు కూడా దాటుండవు. ఎంత గొప్ప నటుడు. బండబాబు లేని లోటు తీర్చలేనిది.’ అనుకుంటూ ఆ వార్తలోకి వెళ్లాడు.‘బండబాబు ఇక లేరు’ అనే హెడ్డింగ్ కింది ఇలా రాసి ఉంది.‘పీక్‌స్టార్ బండబాబు ఇకలేరు... ఆయన్ని చూడడం అభిమానులకు అసాధ్యం... ఎందుకంటే ఆయన హైదరాబాద్‌లో లేరు. ‘తొక్కితే లేస్తా’ సినిమా షూటింగ్ పాటల కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు’. ఆనంద్‌కు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఆ వార్త పోస్ట్ చేసి పావుగంట కూడా కాలేదు. ‘వ్యూ’లు కోటి దాటి పోయాయి! త్వరగా తయారై ఆఫీస్‌కు వెళ్లాడు ఆనంద్. సీట్లో కూలబడ్డాడో లేదో...‘ఠింగ్’ అంటూ సౌండ్ అయింది.ఆసక్తిగా ఫోన్‌లోకి చూశాడు.‘కన్నకొడుకును పట్టుకొని... వీడసలు నా కొడుకే కాదు’ అని ప్రకటించి సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త డబ్బారేకుల సుబ్బారాయుడు’.
ఈ హెడ్డింగ్ చూసి షాక్ తిన్నాడు ఆనంద్.అయితే ఆ అబ్బిరాజు సుబ్బారాయుడి కొడుకు కాదన్నమాట. గోల్డెన్‌స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టాడు... కోటాను కోట్లకు వారసుడు అని అబ్బిరాజు గురించి అందరూ అనుకునేవారు. అలాంటి అబ్బిరాజు సుబ్బారాయుడి కొడుకు కాదనేది చేదు నిజం. అనాథైన అబ్బిరాజును సుబ్బారాయుడు పెంచుకొని ఉంటాడు. కానీ ఆయన చెప్పే వరకు ఆ విషయం ఎవరికీ తెలియదు. కన్న కొడుకు కంటే గొప్పగా అబ్బిరాజును పెంచడం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని రోజులు దాచిన రహస్యాన్ని సుబ్బారాయుడు ఇప్పుడు ఎందుకు బయట పెట్టి ఉంటాడు?’ ఇలా ఏవేవో ఊహించుకుంటూ ఆ తరువాత నెమ్మదిగా హెడ్డింగ్ కింది వార్తను చదివాడు. అందులో ఇలా ఉంది...తన కుమారుడు అబ్బిరాజుకు జరిగిన సన్మాన సభలో పారిశ్రామికవేత్త సుబ్బారాయుడు మాట్లాడుతూ...వీడు నా కొడుకే కాదు. ఒక ఫ్రెండ్. ఒక గైడ్ కూడా!’ అన్నారు.ఆనంద్‌కు దిమ్మతిరిగిపోయింది!
సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరే ముందు ‘ఠింగ్’ అని సౌండ్ అయింది.ఫోన్‌లోకి చూశాడు.ఇక చస్తే నటించను... అని ప్రకటించిన సౌత్‌స్టార్ సాల్మాన్‌రాజు’ అనే హెడ్డింగ్ కనిపించింది.‘ఛా! ఇదేం నిర్ణయం. స్మాలాన్‌రాజు చేయాల్సిన మంచి పాత్రలు ఎన్నో ఉన్నాయి. సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటి?’ అనుకుంటూ హెడ్డింగ్ కింది వార్తను చదవడం మొదలుపెట్టాడు. అందులో ఇలా ఉంది...‘నటన–ఒక పరిశీలన పేరుతో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో సౌత్‌స్టార్ సాల్మాన్‌రాజు మాట్లాడుతూ... తెలిసో తెలియకో నేను నటించి ఉండొచ్చు. కానీ నటుడు అనేవాడు నటించవద్దు. ఆ పాత్రలో జీవించాలి. అందుకే ఇక ముందు నేను నటించను... జీవిస్తాను’ అన్నారు.ఈసారి ఆనంద్‌కు దిమ్మతిరగడమే కాదు బోనస్‌గా మైండ్ బ్లాకైంది.ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆనంద్ కాఫీ తాగుతున్నాడు.‘ఠింగ్’ అంటూ సౌండ్ అయింది. ఫోన్‌లోకి చూశాడు.‘ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ప్రఖ్యాత శాస్త్రవేత్త బంకా వెంకయ్య’ఈ హెడ్డింగ్ చూసి ‘అయ్యో!’ అని బాధగా నిట్టూర్చాడు ఆనంద్. ఆనంద్‌కు అత్యంత ఇష్టమైన శాస్త్రవేత్త బంకా వెంకయ్య.శోకతప్త హృదయంతో హెడ్డింగ్ కింది మ్యాటర్‌ను చదవడం మొదలుపెట్టాడు ఆనంద్. ఆ వార్త ఇలా ఉంది...‘చంద్రుడిపై అడుగుపెట్టాలనేది శాస్త్రవేత్త వెంకయ్య చిరకాల కోరిక. ఇప్పుడది నిజమైంది. అమెరికాకు చెందిన స్పేస్ ట్రావెల్ కంపెనీ ‘మూన్ జడ్’ చంద్రడిపైకి తీసుకువెళ్లిన పదిమంది ప్రైవేట్ టూరిస్ట్‌లలో మన వెంకయ్య ఒకరు. వెంకయ్య ఈ లోకంలో లేకపోయినా తనకు ఇష్టమైన చంద్రలోకానికి వెళ్లడం హర్షనీయం అంటున్నారు ఆయన అభిమానులు’. ఆనంద్‌కు ఈసారి మైండ్ బ్లాక్ అయింది. ఆ తరువాత అయోమయంతో వైట్ అయింది. ఆ తరువాత కోపంతో రెడ్ అయింది.
అంతే!తన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను కోపంగా విసిరికొట్టాడు. అది సరాసరి వెళ్లి ఆయన భార్య శాంతజ్వాల తాగుతున్న కాఫీ కప్పులో పడింది. ఆ తరువాత ఏమైందో... మీకు తెలియనిదేముంది!!
– యాకుబ్ పాషా