
నానిగాడు ఫస్ట్‌టైమ్ హైద్రాబాద్ చూశాడు పోయిన్నెల. అమ్మ ఏదోవిధంగా రాకుండా చేస్తా అని మాటిచ్చింది. అయినా నా దగ్గర అంతకుముందు రోజు తీసుకున్న మాట ఉందిగా, తప్పలేదు. తీసుకొచ్చా.
పదప్పుడు బయల్దేరాం ఇంటి నుంచి. నాకు భయంగానే ఉంది, వీడెక్కడ సతాయిస్తాడో అని. బస్ ఎక్కేముందు ‘ఓహో! ఇక్కడ టికెట్ తీస్కోవాల్నా?’ అన్నప్పుడు చాలా హుషారుగా సమాధానమిచ్చా. ఆ తర్వాత, ‘ఇదెంత మావయ్యా?’ అని వాటర్ బాటిల్ కొనేప్పుడు అడిగాడు. ఉత్సాహంగానే సమాధానం ఇచ్చా. ‘ఊరు దాటంగానే రోడ్డు పెద్దగయ్యింది. అదెట్ల?’ అన్నాడు. చెప్పా. ‘ఆహా.. ఇదేనేమో నువ్ చదివిన కాలేజ్ అయితే!’ అన్నప్పుడు అవునన్నా. ‘ఈడ్నే గదా చెర్వుగట్టు?’ అన్నప్పుడు, ‘అవును నీకెట్ల తెలుసురా?’ అనడిగా. ‘నాకన్ని తెల్సు’ అన్నాడు. కాస్త పొగరుగా ఎవ్వరేం మాట్లాడినా నాకు నచ్చదు. నేనందుకే సైలెంట్‌గా ఉండిపోయా. ‘ఇదేంటిదీ మావయ్యా?’ మళ్లీ వాడే కదిలించాడు. ‘అటు లోపలికి పోతే ఊరు. పైనించే పోతే హైద్రాబాద్’ అని చెప్పా. వాడికి అప్పటికి ఫ్లై ఓవర్ అనే పదాన్ని పరిచయం చేయలేదు నేను.
‘హిహి! మనమిప్పుడు హైద్రాబాద్‌కి పోతున్నం కాబట్టి పైనించే పోతం అంతెగా!?‘ కళ్లెగరేశాడు.‘అంతే అంతే!’బస్సలా వేగంగా పోతూనే ఉంది. వాడు ఏదోక ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. నేను నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతూనే ఉన్నా. నిజానికి మనకిన్ని విషయాలు తెలుసన్న విషయాన్ని పిల్లలే తెలియజెప్పాలి. టోల్ గేట్ వస్తే, ‘ఇదేంటిది మావయ్యా?’ అనడిగాడు. చెప్పా. ‘ఫ్రీగ రోడ్డు ఎయించుకుర్రుగా మావయ్యా!’ అని వాడు నవ్వుతూ ఉంటే నాకూ నవ్వొచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది. ఎప్పుడైనా తీస్కపోతా అని చెప్పా. కాసేపు దాని గురించి ఆలోచించాడు. ఇంకేదో అనుకునే లోపే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ‘వామ్మ.. ఇట్ల ఉందేంది మావయ్యా ఇదీ!’ ఆ కొద్దిసేపు బస్సంతా అన్ని దిక్కులా చూస్తూ, ఔటర్ రింగ్ రోడ్‌ను అన్నివిధాలా క్యాప్చర్ చేసుకున్నాడు. ఆ దారంతా వినాయకుడి బొమ్మలు కనిపిస్తే, ‘ఇక్కణ్ణించే వస్తయా గణేశ్ బొమ్మలన్నీ?’ అడిగాడు. అవునన్నా. ‘మన చౌరస్తల బొమ్మలు గూడ?’ ‘అవును’‘మరి మనం గుడ ఈనించే కొన్కపోవచ్చుగ!?’‘ఈసారదే చేద్దాం!’‘హ్మ్..’ ఆలోచిస్తూన్నాడు ఏదో.ఎల్బీనగర్ వచ్చింది. మెట్రో పిల్లర్‌లను, ఫ్లై ఓవర్ వేను చాలాసేపు అలా కళ్లప్పగించి చూస్తూ కూర్చున్నాడు. ‘అదేంది మావయ్యా?’ అనడిగాడు. ‘మెట్రో రైల్‌రా! దాని మీనించే రైలు పోతది!’
‘అవునా! తీస్కపోవచ్చుగ నన్ను!!’‘మనం పోయే దిక్కు పోవవి’‘ఉత్తగనే పోతం కద కొంచం దూరం’‘ఈ దార్ల ఇంక రెడీ కాలె! అయినంక పోదాం’‘ఏమొద్దులే!’ అలిగాడు. ‘సరే! వచ్చేటప్పుడు టైముంటే పోదం!’ముద్దిచ్చాడు. కాసేపింక ఏం మాట్లాడకుండా పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, మెట్రో రైల్ పిల్లర్లు చూస్తూన్నాడు.సడెన్‌గా నావైపు తిరిగి, ‘నేను ఇన్నిన్ని కొత్త కొత్త ప్రపంచాలు చూస్తానుకోలే! ఇదేంది మావయ్యా ఇట్లుంది హైద్రాబాద్!! వామ్మ!!!’ అన్నాడు.నవ్వొచ్చింది. కొత్త కొత్త ప్రపంచాలు అనే మాట వాడు ఎక్కడ అందుకున్నాడో అడగాలనిపించింది. వాణ్ణి డిస్టర్బ్ చేయాలనిపించలేదు అలాగే! ఫ్లై ఓవర్ అనే పదం తెల్సుకున్నాడు నేను చెప్తే. దాని మీంచి బస్సులు పోవని నాతో వాదించాడు. ఒక బస్సు ఫ్లై ఓవర్ ఎక్కుతుంటే చూసి, ఓడిపోయినట్టు నవ్వాడు. ట్రాఫిక్ జామ్ అంటే అర్థమైంది. సిగ్నల్స్ తెల్సుకున్నాడు. బస్సు టైప్స్, రేట్లు అడిగాడు. నిమ్మకాయ్ శర్‌బత్ ఒకటి తాగాం. పాత ఆఫీస్‌కి వచ్చి అక్కడి ఫ్రెండ్స్‌తో మాట్లాడాడు. పనయ్యాక పంజాగుట్ట మెరిడీయన్‌లో బిర్యాని తిన్నాం. ‘మస్త్ తిరిగినం మావయ్యా! ఇంటికి పోదాం’ అన్నాడు. ‘హహహ! ఇంక చాలా పన్లున్నయిరా’ అన్నా. ‘అంత సీన్ లేదు. నాకు తెల్సులే! ఇంక పోదం మావయ్యా!’
‘సరే! పోదాం!!’ నవ్వి కౌగిలించుకున్నాడు. మళ్లీ దిల్‌సుఖ్‌నగర్ బయల్దేరాం. సాయంత్రం నాలుగైంది. వాడికి అలసటొచ్చి పడుకున్నాడు. దిగేప్పుడు లేపితే మళ్లీ లేచి, ‘పండుకున్ననా?’ అన్నాడు. ఊరికి పోయే బస్సెక్కే ముందు వాటర్ బాటిల్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవీ తీసుకొని ఎక్కాం. ‘ఇప్పుడు పండుకో ఇగ! ఎట్లుంది హైద్రాబాద్?’ అడిగా.‘అబ్బ! మస్తుంది మావయ్య!’ అన్నాడు. ‘నిద్రొస్తలేదులే!’ పడుకో అని మరోసారంటే ఈ మాటన్నాడు. వచ్చేప్పుడు వాడికి అనుభవంలోకి వచ్చిన ప్రతిదీ చెప్పుకొచ్చాడు. బస్‌లో మా పక్కన కూర్చున్న అమ్మాయి (చాలా అందంగా ఉంది!) వీడి మాటలన్నీ వింటూ నవ్వింది. వీడింక ఏం మాట్లాడలేదు ఓ గంట పాటు. ఇంటికి చేరేసరికి పడుకున్నాడు. నిద్ర లేపి అన్నం తినిపించింది అమ్మ. ‘మమ్మీ అసలు ఏం హైద్రాబాదే మమ్మీ!!’ అంటూ అమ్మకు కథలు చెప్పడం మొదలుపెట్టాడు. పాపం వాడికి ఒక ఆర్డర్ తెలీదుగా, ఒకటి చెప్పి, అర్రె ఇది చెప్పలేదు అని ఇంకోటి చెప్పి, అదిగాదు మమ్మీ ఇది అని వేరొకటి చెప్పి అది ఇదీ అని ఏది గుర్తొస్తే అది చెప్పి గోల చేశాడు.‘మమ్మీ నీకొకటి తెల్సా! అక్కడ గూడ మనుషులు సిగరెట్లు తాగుతరే!!‘ అని నవ్వుతూ చెప్పాడు. ‘అక్కడ గుడ సిగరెట్లు తాగుతర మావయ్యా! అడగడం మర్చిపోయిన!’ మేము సమాధానం చెప్పకపోయేసరికి వాడే మళ్లీ అడిగాడు. ‘మనుషులు ఎక్కడ్నైనా ఒక్కటే!’ చెప్పా. అమ్మ నవ్వింది. వాడు నవ్వాడు. నేనూ నవ్వాను. వాడడిగిన ప్రశ్నకి ఈసారి కూడా నవ్వుంటే వేరే ప్రశ్నడిగేవాడేమో! నేనప్పుడు ఈ అబద్ధం చెప్పే అవసరం రాకుండేదేమో!
– అజు, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment