నాకు ఏ పండుగ వచ్చినా ఇద్దరు అక్కలను, ఒక చెల్లెను తీసుకురావడం మళ్లీ పండుగ తరువాత వారిని తొలి రావడం, వాళ్లు ఉన్న అయిదు, ఆరురోజులు ఇల్లంతా సందడి సందడిగా ఉండి వాళ్లు వెళ్లగానే అంతా నిశ్శబ్దంగా ఉండటం, ఏమితోచక పోవడంతో నాకు కూడా పండుగలు కాని ఏదైనా కార్యక్రమాలు కాని ఎప్పుడెప్పుడు జరుగుతాయా! అక్కలను ఎప్పుడు తీసుకరావాలి అనిపించేది. అది 1994 సంవత్సరం సంక్రాంతి పండుగ. మా అక్కలు యశోదక్క, సత్తెక్క మరియు చెల్లి నర్సవ్వను తీసుకొని వచ్చాను. ఇంట్లో వాళ్ళు వారి వారి పిల్లలతో సందడిగా, ఆటలు మాటలతో హుషారుగా ఉంటే నేను అలా బయటికి వెళ్లొస్తా అని వెళ్లి ఒక అయిదారుగంటలు స్నేహితులతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గొడవ గొడవ జరుగుతోంది.ఏందబ్బా ఇంతమంది కూడిండ్రు, ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటూ లోపలికి పోయేసరికి ‘‘ఇంకోసారి నన్ను పండుగకు తీసుకురావద్దు. నేను రాను’’ అన్నది మా సత్తెక్క. ‘‘మేము ఏమన్నా అన్నామా! నీ బిడ్డే ఆ ముసలామెను అంటే ఆమె మనల్ని తిట్టబట్టే’’ అని అమ్మ అంటుంది. ‘‘ఏదో చిన్నపిల్ల తెల్వక అన్నది అని చెప్పొచ్చు కదా. మీరు కూడా తిట్టబడ్తిరి. అందుకే ఇంకోసారి నేను రాను’’ అంటోంది అక్క ‘‘ఏ! ఆగండి, అసలేం జరిగింది?’’ అని నేను అడిగేసరికి–‘కాదురా తమ్మీ! మన పక్కింటి ఎల్లవ్వను మన పద్మ (అక్క బిడ్డ) ముసలెల్లి ముసలెల్లి అన్నదట. అందుకే ఆమెతో పాటు మన అమ్మ నన్ను నా బిడ్డను తిడుతున్నరు. నేనింకోసారి రాను’’ ఏడుపందుకుంది అక్క ‘‘మరి గా ముసలిదాని జోలి గీ పిల్లకెందుకు, మనింట్లో మనముండక’’ అంటోంది అమ్మ.‘‘నా బిడ్డకు తెలుసా! చెప్పరా తమ్మీ’’ అన్నది అక్క. ‘‘అట్లగాదక్కా! గా పక్కింటి ముసలామె జోలి మన పద్మకెందుకొచ్చింది. ఆ ముసలామె కోపానికెందుకొచ్చింది, నాకేమి అర్థం అయితలేదుగని ఒకసారి పద్మను పిలువు అడుగుదాం’’ అన్నాను.
‘‘పద్మా... పద్మా నువ్వెమన్నవు బిడ్డా? మామయ్యకు చెప్పు’’‘‘నేను మా చెల్లిని అంటే గామె నన్ను కొట్టింది మామయ్యా’’‘‘మరి ముసలెల్లి అంటే కోపం రాదారా పద్మా. తప్పు కాదా’’‘‘మూజలెల్లిని అంటే ఆమెకేంది?’’‘‘ఆమె పేరు పెట్టి అనుకుంట ఆమెకేంది అంటవేమిరా. ఆమెకు కోపం రాదా?’’‘‘నేనామెనెందుకన్నా. మూజలెల్లిని అన్నా’’‘‘అరే! పరేశాను చేస్తందేమిరో, ఇదేదో తిరకాసు ఉన్నట్లుంది’’నాకు ఏదో అనుమానమొచ్చి ‘‘ఏదీ ఏ ముసలెల్లిని అన్నవో చూపిద్దువురా’’ అన్నాను.గబగబా నన్ను బయటికి వేలుపట్టుకొని తీసుకొచ్చి ఇంటిపక్కన ఎల్లవ్వ గోడపైకి చూపిస్తూ...‘‘అగ్గో గా మూజలెల్లి’’అన్నది.అటు చూసిన నాకు, అక్కలకు, అమ్మకు అక్కడ పోగైన మందికి, తిట్టిన ఎల్లవ్వకు నవ్వు ఆగుతలేదు.‘‘ఓసినీ పోరీ! అప్పుడే చూపెడితే అయిపోయేది కదా’’ అంటుంది ఇటుపక్క ఇంటిఅయిలమ్మ.అందరి నవ్వుకు కారణం అక్కడ ఉన్నది....ఊసరవెల్లి! అది జరిగి ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ బాగా నవ్వుకుంటాం.
– మినుముల భిక్షపతిగౌడ్, సముద్రాల, జనగామ జిల్లా
అదిగో మూజలెల్లి!
Published Sun, Oct 28 2018 1:48 AM | Last Updated on Sun, Oct 28 2018 1:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment