రెండ్రూపాయలు | Funday story of the week 05-05-2019 | Sakshi
Sakshi News home page

రెండ్రూపాయలు

Published Sun, May 5 2019 12:41 AM | Last Updated on Sun, May 5 2019 12:41 AM

Funday story of the week 05-05-2019 - Sakshi

మొన్న మధ్యాహ్నం మా ఇంటికెవరో చుట్టాలొచ్చి కాసేపుండి ఫలారాల్చేసి కాఫీల్తాగి వెళ్లిపోతుంటే, మా చిన్న అమ్మాయి వెళ్లి రిక్షా దగ్గర నిలబడి నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ చూస్తోంటే– వాళ్లు రెండ్రూపాయ కాగితాలు దాని చేతిలో పెట్టారు.(నేను చూసీ చూడనట్లు ఊరుకున్నాను)‘‘హుష్‌.. వొద్దొద్దు– పుచ్చుకోకు’’ అంటూ మాయావిడ పైనుంచి యాక్షన్‌ చేస్తోంది. మెట్ల మీద నిలబడి (మేం ఉండేది మేడ మీద) నేను ‘‘తీసుకోవే’’ అన్నాను. దానికి డబ్బు సంగతి ఇప్పట్నుంచి తెలిస్తే మంచిదని. అది ఆ రెండ్రూపాయలూ పుచ్చుకుని రోడ్డు మీదకు ఉడుంలా పరుగు ప్రారంభించింది. దాని వెనకాతల పరిగెత్తమని నాకు కళ్లెగరేసి చెప్పింది. తాను మేడ మెట్ల మీద నుంచి అంగుళం ఇటూ అటూ కదలకుండా మా ఇంటావిడ మరియు గృహలక్ష్మి, రిక్షాలో వెళ్తున్న చుట్టాలు చేతులూపుతుండగానే నేను పాప వెంట పరుగెత్తవలసి వచ్చింది. పాప చేతిలోని నోట్ల కోసం నేను పరుగెత్తుతున్నానని వాళ్లనుకుంటే మాత్రం నేనేం చేయనూ? పిల్లనెత్తుకుని ‘‘అమ్మా అన్నకోటిచ్చెయ్‌’’ అన్నా. ఏవీ లక్ష్యం లేకుండా నిర్లప్తంగా ఒక నోటు తీసి వాడికి ఇచ్చేసింది. వాడు ఆ నోటు తన లిక్కిజేబులో కుక్కి– దాని మెడమీద చేతులేసి ముద్దు పెట్టుకున్నాడు. ‘‘ఏవీ కొనకు. మార్చవో డొక్క చీరేస్తాను’’ అంది మా ఆవిడ. అని అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లు ‘మీరంతా సినిమాకు వెళ్లండి ఆనక’ అంది. మావాడికదేమీ ఇష్టంగాలేదు. ఆ నోటు జేబులో పెట్టీ తీసీ చూసుకుంటూ ఇటూ అటూ పరుగెత్తుతున్నాడు. మధ్యాహ్నం ఎండలని చెప్పి మూడు మాట్లు తీసుకొచ్చి వాడిని చీకటి గదిలో తోసింది. (చీకటి గది అంటే తలుపులేసుకుని మధ్యాహ్నం ఓ గంటో అరగంటో నడుం వాల్చుకునే చోటు) మూడు మాట్లూ వాడు అడ్డంగా దుంగలా పడుకున్న తన నుంచి దూకి పారిపోవడం, కిందకు వెళ్లి రూపాయి నోటు అందరికీ చూపిస్తూ ఆడటం, వాళ్లెవరేనా కుర్రవెధవన్చేసి నెత్తి మీద రెండు మొత్తో, చేతిలో పిప్పరెంటు బిళ్లో బెల్లంముక్కో పెట్టి ఆ నోటు లాక్కుంటారేమోనని ఈవిడకు అనుమానం కలిగి ప్రాణం ఉండబట్టక కళ్లు నులుముకుంటూ వెళ్లి వాడి వీప్మీద రెండేసి ఈడ్చుకు రావడం ఈ తతంగం అంతా చూస్తూ చాప మీద పడుకున్నా. ఈ సీను చాలాసార్లు రిపీటవడం ఒక రూపాయికి వాడు అరడజను గిల్లులో మొట్టికాయలో దెబ్బలో తినడం చూస్తూ ఆలోచిస్తున్నా. ఓ పది పైసలో, ఐదు పైసలో అయితే ఇన్ని దెబ్బలు పడుండవు కదా అనే సానుభూతి కలిగింది.

మా చంటిదానికి రూపాయి కాగితం గురించి ఏపాటి పరిజ్ఞానం ఉందో తెలుసుకోవాలనే అభిప్రాయం కలిగి ‘అమ్మలో ఏంతే అది’ అంటూ ముద్దుగా పలకరించా.‘‘ఐదు పైసలిత్తా నాకిచ్చేత్తావా?’’ అన్నా.‘‘వూపాయి... పో’’ అంది. అని కళ్లు చిత్రంగా తిప్పి ఆ రూపాయి నోటును సాగదీయడం మొదలెట్టింది.‘‘దాన్నేవనకండి. అది చింపి రెండు ముక్కలు చేస్తుంది.’’ అని మా చంటిది అప్పుడే నా మూలకంగా రూపాయి నోటును ధ్వంసం చేసినట్లుగా గాబరాపడుతూ మా ఆవిడ లేచింది. కంగారులో జారిపోయిన కొప్పును మోచేత్తో తాచుపామును లాగినట్టుగా లాగి బిగిస్తూ, లేచినప్పుడు నీళ్లలోంచి ఏనుగు లేచినట్లున్నా ఇప్పుడీ పోజు మాత్రం ఈవిడకు బ్రహ్మాండంగా ఉంది అని లోపల్నే మెచ్చుకున్నా.‘‘ఈ రెండ్రూపాయలూ మార్చి చెరో ఐదు పైసలూ ఇయ్యి. ఓ ఇరవై రోజులు కాలక్షేపం అవుతుంది’’ అన్నా. కానీ నా సలహా ఎవరిక్కావాలి బోడి సలహా!ఈలోగా ఇద్దరు సపోటా వాళ్లను, ముగ్గురు ముంజెల వాళ్లను మేడ మీదకు పిల్చుకున్నారు ఈ ఇద్దరు తుంటర్లూ కలిసి. లక్ష్మి చంచలం కదా! అది ఎప్పుడు బయటకు పోదామా అని చూస్తూ ఉంటుంది. ఈ రహస్యం తెలిసిన దారికి మల్లే మా ఆవిడ వాళ్లతో పనిగట్టుకు పోట్లాడి బేరం కుదరనివ్వకుండా చేసి వాళ్లను తిప్పి పంపేసింది. ఈ కుట్రను గ్రహించిన దానిలా మా చంటిది అరిచి గొడవ చేయబోతే, దాని దగ్గర రూపాయి లాక్కుని బోడ్లో దోపేసి ఆ కుర్ర వెధవను ఈడ్చుకొచ్చి పవిట చెంగును వాళ్లిద్దరి మీదా కప్పి నేల మీద పడేసి వాళ్ల మీద చేతులూ కాళ్లూ అడ్డం వేసి తిరిగి నిద్రకుపక్రమించింది.నాకు పగలు నిద్రపోయే అలవాటు లేదు. మేకులా అలా కూర్చోవలసిందే! బల్ల మీద పుస్తకాలు కాసేపు కెలికి ‘‘ఛెస్‌ పట్రావే– రెండెత్తులు వేద్దాం’’ అన్నా. ఏ కళనుందో చటుక్కున లేచి వెళ్లి ఒక మామిడిపండు తెచ్చి ‘‘నిన్న మూడు డజన్లు కొన్నాను గుమ్మం దగ్గర బేరవాడి. ఇదొక్కటే మిగిలింది. తినండి’’ అని నా ఒళ్లో పడేసింది కళ్లు మూసుకుని నడుస్తూ.ఎత్తుకు పై ఎత్తు అంటే ఇదే కావల్ను.‘‘డజను ఎట్లా కొన్నావ’న్నాను పళ్లు బిగించి.నిన్న మూడు డజన్లు కొంటే ఇవాళ్టి మధ్యాహ్నందాక ఆ సంగతి వీళ్లకు గుర్తు రానందుకు నాకు లోపల అసంతృప్తిగా ఉంది. పండు చూస్తే కింద ఆకుపచ్చగా ఉంది. అక్కడ టెంక పుల్లగా ఉంటుంది. పైగా అది అందరూ వదిలేసిన పండయి ఉంటుంది. నా అనింపార్టెన్సుకి గింజుకుంటూ, ఆ పండు తినలేకా వదలలేకా దిక్కులు చూస్తూ కూర్చున్నా.  నా చేతిలో ఆ పండును చూడగానే మా ఇద్దరు అజ్ఞానులూ లేచి నా చెరోవైపుకి వచ్చి నిలబడి దానికేసి చూస్తూ ‘వీడు మనకు పెడతాడా పెట్టడా? పెట్టకుండా ఎలా తింటాడో చూద్దాం’ అన్నట్లుగా పోజు పెట్టారు.పిల్లలంత నిర్మొహమాటస్తుల్ని నేనెక్కడా చూడలేదు. పండు కొంచెం చీకి రుచి చూసి, టెంకొకరికి తొక్కొకరికి ఇచ్చేసి వెళ్లి పంపు వద్ద చేతులు కడుక్కుని దండాలకు వంకీలకు వేలాడిన బట్టల్ను చీరల్ను లంగాల్ను జాకెట్లనూ చూస్తూ కూర్చున్నా.

కుర్రవెధవలు కొంచెంసేపు పండు తినీ ఆ టెంకతోనూ తొక్కతోనరూ యుద్ధాలు చేసి వెళ్లి పంపు తిప్పి బాత్రూంలో పడ్డారు. పిల్లల్లో అల్లరిచేసే శక్తి దారుణంగా ఉంటుంది. బాత్రూంలో పడేసిన ఎంగిలి కంచాలూ అంట్లగిన్నెలూ తెచ్చి హాల్లో పరిచారు. అక్కడే కూర్చుని బట్టల సబ్బుతో వాళ్ల అమ్మను ఇమిటేట్‌ చేస్తూ అంట్లు తోమటం ప్రారంభించారు. హాల్లో అంట్లు తోముకోరని వాళ్లకు తెలీదు.ఇంతలో మెట్ల దగ్గరెవరో కూర్చున్నారని వచ్చి శుభ్రం చేయమని పితూరీ వచ్చింది. అప్పుడీవిడ అట్నుంచి ఇటు దొర్లి పెద్ద పిల్లను వెళ్లి చూసి రమ్మంది. అది చూసొచ్చి మనవాళ్లు కాదని చెప్పింది.‘ఇదివరకు ఒకటిరెండు సార్లు ఇలానే అంటే శుభ్రంచేసి వచ్చాం వెర్రిపీనుగుల్లా వీళ్లకు ఇదో ఆటైపోయింది. ఊరుకో’– అని ఆవిడ కేసు కొట్టేసింది. పిల్లలను నేను ‘‘హాయ్‌! హుష్‌! హమ్మయ్య!’’ అంటూ కేకలు వేస్తుంటే, వాళ్లు నన్నో జోకర్‌ కింద కట్టి వాళ్ల ఆటలు వాళ్లాడుతున్నారు.‘అమ్మొస్తుందర్రా’ అని దయ్యమొస్తుంది కాసుకోండన్నట్లు భయపెట్టాను. ఆవిడను భయంకరంగా చిత్రించడం అవసరమేననిపించింది. ఆనందంగా కూడా ఉంది. అప్పుడు ‘ఇదిగో ఇటు చూడు, పిల్లలు అల్లరి చేస్తున్నారు’ అని నేనూ సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేశాను. (లెట్‌ హర్‌ సెటిల్‌ మేటర్స్‌ బిఫోర్‌ దె బికం వర్స్‌) ఆవిడ లేచింది (మహంకాళిలా), లేస్తూనే నెత్తి మొత్తుకుంది. పళ్లు పటపటలాడించింది. ఎదురుగుండా బొమ్మల పుస్తకం తిరగేస్తున్న పెద్దదాన్ని తిట్టింది. కొట్టబోతే అది పారిపోయింది. ఆ హాలు స్థితి చూసి ‘మీరేం చేస్తున్నారు?’ అని నా వైపో డర్టీ లుక్‌ పారేసి, ఆ యావత్తు బీభత్సానికి కారకులైన దుష్టశక్తుల్ని రెంటినీ తరిమి పట్టుకుని విచక్షణారహితంగా బాదటం మొదలెట్టింది.‘‘ఏం కొంప? వెధవ కొంప. ఏం పిల్లలు? వెధవ పిల్లలు. ఏం మొగుడు–’’ అని ఆగి మళ్లీ మొదలెట్టింది.ఓమూల అంటే ఉండనివ్వరమ్మా ఈ పిల్లలూ, ఈ సంసారమూనూ. లొడితెడు వెధవ, లాగులో తప్ప వెళ్లడు. అంత ఉగ్గబట్టుకుని లాగంతా పాడయేదాకా ఏడవడం ఎందుకూ? ముందే ఆ ఏడుపేదో ఏడవకూడదా? రోజుకి అరడజను లాగులు ఖరాబుచేసి మూల పారేస్తే అవన్నీ ఉతికితేనే కాని మర్నాడు తొడుక్కోవడానికి లాగుండదు. ఈ వెధవ లాగులు ఉతికి విస్తరి ముందు కూర్చుంటే అన్నం తినబుద్ధవడం లేదు. పిల్లలు ముద్దు కాని పీతుళ్లు ముద్దా? ఇహ ఆయనున్నారు. ఆయన తిరుగుళ్లూ ఆయన ప్రపంచం ఆయన గొడవ అదంతా వేరు. వేళకు విస్తరి ముందొచ్చి కూర్చోవటానికే నన్నేదో ఉద్ధరిస్తున్నట్లు బెట్టు చేస్తారు. బెట్టెవరి మీద? ఇహ నేనేగా అందరికీ లోకువ. ఇంట్లో ఇది ఉంది ఇది లేదు, వీళ్లొస్తున్నారు వాళ్లు వెళ్తున్నారు, ఇది అవసరం ఇది అనవసరం, ఇది ముఖ్యం ఇది అముఖ్యం– ఈ గొడవేం పట్టదమ్మా! ఇహ నేనెన్నిటికి ఏడవను? నా వల్ల ఏమిటవుతుంది? ఛస్తే ఛస్తారు. ఉంటే ఉంటారు. పోతే పోతారు. ఏది జరగాలో అదే జరుగుతుంది. నాకెందుకీ రొష్టూ– నాకెందుకీ హైరాణా? మీరంతా కట్టగట్టుకుని ఏ ఏట్లో దూకుతారో దూకండి. మరి నేను మాట్లాడను. నా పని అయిపోయింది’’ అని ఆవిడ లెక్చరిచ్చేసి, హాలంతా కడుక్కుని శుభ్రం చేసుకుని ఆ గిన్నెలన్నీ తోముకుని ప్రాణం చల్లబడటానికి బాత్రూంలోకెళ్లి స్నానం చేస్తూ కూర్చుంది. ఆ క్షతగాత్రులిద్దర్నీ నేను దగ్గరకు తీసుకుని వెనక వరండాలోకి తీసుకెళ్లి సబ్బెట్టి రుద్ది స్నానాలు చేయించా. ఇంతలో జ్ఞాపకం వచ్చి ‘‘ఇదిగో ఆ రూపాయి తడుస్తుంది’’ అని కేకేశా. ఈవేళ తెల్లారి లేచాక నేను తెలివైన పని చేయటానికి దొరికిన అవకాశం ఇదొక్కటే. రోజుకి కనీసం ఒక తెలివైన పని చేయాలి కదా!‘‘అయ్యో నా మతి మండా’’ అని బాత్రూం మీద వేలాడుతున్న చీరంతా దులిపి ఆ నోటు తీసి ఇవతల పడేసింది. 

మా చంటిది వెళ్లి మళ్లీ ఆ కాగితాన్ని తెచ్చి దాన్ని తిరగేసి బోర్లేసి ఆడుతోంది. అప్పుడు ‘‘నా రూపాయో’’ అంటూ ఎవరో కొట్టినట్టు మా కుర్రాడు ఏడుపు లంకించుకున్నాడు. అవును వాడి రూపాయి వాడి బుష్‌కోటు లిక్కిజేబులో ఉండిపోయింది. వాళ్లమ్మ ఇందాక తడిసిన బుష్‌కోటును హాల్లోంచి బాత్రూంలోకి ఉండచుట్టి బంతిలా విసిరేసింది మేమంతా చూస్తుండగానే.‘‘పద పద నీ రూపాయి తెచ్చుకో’’ అని వాడ్ని బాత్రూంకేసి నెట్టాను. ఆ తడిచొక్కా అవతల్నుంచివతలకు టోపీలా ఎగిరొచ్చి పడింది. నిజంగా మన ఆడవాళ్లకు సరైన ట్రైనింగు ఇవ్వకపోబట్టి గాని ఇస్తే ఎన్నెన్ని సర్కస్‌ ఫీట్లయినా అవలీలగా చేయగలరు. అందుకే జీవితం ఒక సర్కస్‌లాంటిదని అన్నారెవరో! అయితే రింగ్‌ మాస్టర్‌కి జోకర్‌కి తేడా తెలియని జీవితం సర్కస్‌ మనది అనుకూంటూ ఆ చొక్కా అందుకున్నాను. అందులో నోటు మడతపెట్టి ఉన్నందున కొంచెం తడిసింది. తడిసినందుకు వాడు ఏడుపు వదలకుండా సాగించాడు కాళ్లతో నేలను బాదుతూ.స్వయంకృతాపరాధం కనుక ఆ నోటు తీసుకుని ఇద్దరం వెళ్లి ఎండలో కూర్చున్నాము. ఇప్పుడే ఆరిపోతుందని నేను మావాడికి అభయమిచ్చాను. కాని ఒక తడిసిన రూపాయి నోటు గురించి ఎండలో కూర్చోటం అట్టే తెలివైన పనికాదు. మమ్మల్ని చూసి ఎవరైనా నవ్వొచ్చు. ఇంతలో ఒక బ్రెయిన్‌ వేవొచ్చింది. వీధీలో రెండిళ్లవతల  ఒక లాండ్రీ ఉంది. అక్కడకు వెళ్తే రూపాయి నోటును కమ్మగా ఇస్త్రీ చేసి ఇస్తాడు. మళ్లీ కొత్త నోటులా తయారవుతుంది. పిల్లాడు ఏడుపు మాన్తాడు కదా అని జాగ్రత్తగా తలుపు దగ్గరసా వేసి, పిల్లను చంకనెత్తుకుని, కుర్రాడిని నడిపించుకుంటూ పిల్లల తండ్రిలా లాండ్రీ దగ్గరకెళ్లి నిలబడ్డాను.మనం బట్టలిచ్చినప్పుడు వాడు రాక్షసుళ్లా కనపడతాడు కాని లేకపోతే వాడు చిరమందహాసం ఒలికిస్తూ కడు యోగ్యుడులాగే దర్శనమిస్తాడు. వాడి పెళ్లాం చాలా అన్‌సైజు మనిషి.  అది వెళ్లి డబ్బులడిగితే ఉతికిన వాటికీ ఉతకని వాటికీ పారేసిన బట్టలకి కూడా డబ్బులిచ్చేస్తారు ఇల్లాళ్లు కిక్కురుమనకుండా. దాన్ని చూస్తే మా ఆవిడకి చాలా భయం.  అది ఇల్లాళ్లను నిలువనియ్యదు. కాళ్ల కింద నిప్పులోసి డబ్బులు లేవన్నా మఠం వేసుకుని కూర్చుని డెఫిసిట్‌ ఫైనాన్సింగు గురించి నీతి సూత్రాలు వల్లిస్తుంది. 

‘‘ఏంటమ్మగోరూ! మాకేవన్నా నెల జీతాలా పాడా– ఎండలో పగలల్లా రేవుకాడ చస్తే ఎప్పటి డబ్బులప్పుడిచ్చెయ్యడానికి లేవు పొమ్మంటారు. చీటీ కట్టాలా? బొగ్గులకెంతయిపోతున్నాదని. లాండ్రీ అద్దె పాతిక రూపాయలు. నీలిమందు ఖర్చు, సోడా ఖర్చు, రిక్షా ఖర్చులెంత పెరిగిపోయాయో మీకేటి తెలుసుద్ది? బియ్యం సేరు రూపాయిన్నర. మీ మడేలు తాగుడు ఖర్చు రోజుకి రెండ్రూపాయలు. నా సినిమా ఖర్చు వోరానికి మూడ్రూపాయలు. ఆ కోక యిప్పి పారేసి నాకిచ్చీకూడదా? ఇంద ఈ చీర తీసుకోమని మీరివ్వకపోతే నాకేటుంది? నవార్లుతకాల, బొంతలుతకాల, దయ్యల్లాటి దుప్పట్లుతకాల, మరేటి డబ్బుల్లేవంటే ఎలాగమ్మగారూ! చూడండి. ఇంత మేడద్దికి తీసుకునున్న మారాజు– మాకిస్తే మీకేటి పోతుంది? మాకెవరడిగినా లేదంటారు కాని మీకు పది రూపాయలప్పు ఇట్టే పుడుతుంది. వర్షాకాలం బట్టలారవు. ఓసారి ఫానేపించి మీ చీర ఆరబెట్టి ఇస్త్రీ చేసి ఇచ్చాను కదా? మావోడు సేతి రేడియో కొందావన్నాడు. ఆవకాయముక్క పారేయండమ్మగోరూ– జివ్వ సచ్చిపోనాది’’ అంటూ ఊదరగొట్టేస్తుంది.అది నన్ను చూసి పోల్చుకుందో లేదో తెలీదు కాని నేను లాండ్రీ గడప దగ్గర నిల్చోగానే ‘‘రండి రండయ్యగోరూ! కనకమ్మగారి అయ్యగారొచ్చారొరే–’’ అని నిద్రపోతున్న మొగుడ్ని ఓ కుదుపు కుదిపింది. వాడు తెల్లగా ఉతికిన బట్టల మీద పాలసముద్రం మీద పవ్వళించిన శేషశాయిలా పడుకుని గుర్రు పెడుతున్నాడు. వాడి నోట్లోంచి వస్తున్న గుర్రుకి లాకు తలుపులు దడదడలాడినట్లు వాడి పెదిమలు మీసాలు కదుల్తున్నాయి.ఇస్త్రీపెట్టె ఎర్రగా కణకణలాడుతూ నోరు తెరుచుకున్న చిరుతపులిలా ఉంది.నేను కనకమ్మగారి అయ్యగారిని కానని జానకమ్మగారి పెనిమిట్నని చెప్పుకున్నాక– ‘‘అయ్యబాబో తమరేటిలాగొచ్చార’’ని బోల్డు మర్యాద చేసి అడిగింది. రూపాయి నోటు తడిసిపోయింది. ఇస్త్రీ చేసి పెట్టాలన్నా.‘‘రూపాయి నోటు తడిసిపోతే మీకేటి బాబూ!’’ అని నోటు తీసుకుని చిరుతపులి నోరుమూసి పైనో తువ్వాలు పరిచి రెండు పావులు పావి హాట్‌హాట్‌గా పొగలు గక్కుతున్న రూపాయి నోటుని నా చేతిలో పెట్టి ‘‘అమ్మగారిని పురుటికి ఎప్పుడంపిస్తారు బాబూ’’ అని అడిగింది.పురుడేవిటి ఫామిలీ ప్లానింగ్‌ ఆపరేషను చేయించుకున్నాను కదా అని కొంచెం గాబరాపడ్డాను.‘‘తొమ్మిదో నెలేవిటి?’’ అన్నాను.‘‘అదేటి బాబూ– మీరు జానికమ్మగారి పెనిమిట్నని చెప్పారిప్పుడు కాదంటున్నారు.’’‘‘ఈ పిల్లల సాక్షిగా నేను జానికమ్మ భర్తనే–’’‘‘అయితే మీరు లావుపాటి మెల్లకన్ను జానికమ్మగారి తాలుక్కాదా? చెయ్యిలాగీడుస్తాది. ఇదిగో ఇలా కాలెగరేస్తూ ధనలక్ష్మిలా నడుస్తాది’’ అని అభినయం చేసి చూపెట్టింది. మా పిల్లలు నవ్వారు. ‘‘నేను లావుపాటి జానికమ్మ మొగుడ్ని’’ అన్నాను ఖచ్చితంగా.

‘‘అహ్హా! సూదిముక్కు లేడి కళ్ల ఉంగరాల జుత్తు కుక్కల్తరువుకొస్తే అడివిలో లేళ్లు పరిగెట్టినట్టు పరిగెడతా ఉంటాది. ఆ పచ్చ డాబాలోని జానికమ్మగోరా..’’ ప్రవాహాన్ని ఆపుచేసి ‘‘అవునవును. ఆ జానికమ్మ సూదిముక్కూ లేడి కళ్లూ...’’‘‘ఆయమ్మకేం బంగారపు బొమ్మ’’ అని సర్టిఫికెటిచ్చింది. నేను ఇంకేం అడుగుతుందో చలివిడి పాకంలా పట్టుకుని వొదల్దని వస్తానని చెప్పి పిల్లల్ని బరబరా లాక్కుంటూ రోడ్డు మీదకొచ్చాను.రిబ్బన్లూ మొలతాళ్లవాడో పక్క నుంచి, బూరలమ్మేవాడో పక్క నుంచి, టమటమాల బండివాడో పక్క నుంచి, మరమరాలూ బఠాణీలవాడో పక్క నుంచి నా ప్రాణానికి నాలుగు వైపుల నుంచి నలుగురూ శత్రువుల్లా పోగయ్యారు. ఎప్పుడు విడిపించుకున్నారో నా పట్టు విడిపించుకుని వాళ్ల దగ్గరకు పారిపోయి కొనమని గెంతుతున్నారు పిల్లలిద్దరూ. నేను ఆలోచించుకోవటానికి వ్యవధి లేకుండా పిల్లలు నడిరోడ్డులో మారాం మొదలెట్టారు. ఆ నలుగురు శత్రువులూ అలా నిలబడిపోయారు నన్నే గమనిస్తూ. రిబ్బన్ల వాడి దగ్గరో రెండు మూడు రిబ్బన్లు తీసుకున్నాను. రెండు టమటమాల బళ్లు కొన్నాను. మరమరాలూ బఠాణీలూ  కొని లుంగీలో రెండు మూటలుగా కట్టి ఎత్తి పట్టుకుని ఇంత చేశావా భగవంతుడా అని బఫూన్లా ఇంటివైపు నడక ప్రారంభించాను. మొత్తం బిల్లు రిబ్బను వాడికి రూపాయిన్నర, రెండు టమటమాల బళ్లూ రూపాయి పావలా మరమరాలు పావలా, బఠానీలు అర్ధరూపాయి. నా దగ్గర రూపాయి ఉంది. వాళ్లందర్నీ వెనకేసుకుని ఇంటి దగ్గరిద్దావని గ్రేట్‌ మార్చ్‌ చేయించి తీసుకొచ్చాను.సూదిముక్కూ లేడికళ్ల జానకమ్మ వీధిలోనే నిలబడి మేమెక్కడికి పోయామా అని చూస్తూంది గావల్ను మా ప్రొసెషన్ని చూసి ‘ఏం జరిగిందేం జరిగింద’ని ఆదుర్దాగా అడిగింది.‘‘హేవీ లేదు.. హేవీ లేదు. నువ్‌ లోపలికి నడు–’’ అని రిబ్బన్లవాడికి రూపాయిన్నర, టమటమాల బళ్లకి రూపాయి పావలా, మరమరాలూ బఠాణీలకి ముప్పావలా ఇచ్చేమని చెప్పాను.‘‘ఏవిటీ? హేవిటేవిటేవిటీ? ఈ రిబ్బన్లు రూపాయిన్నరా? ఈ బళ్లెందుక్కొన్నారూ? వీటికి రూపాయా? ఇవి పావలా మరమరాలా? ఇవి అర్ధరూపాయి బఠాణీలా? ‘హవ్వ’ అని నోరు నొక్కుకుని ఇచ్చెయ్యండి. ఇవి వాళ్లకిచ్చెయ్యండి. మీ మొహం చూసి మిమ్మల్నెవరో బాగా టోపీ వేశారు. ఇచ్చేసి వాళ్లను వెళ్లమనండి. శుద్ధ దండగ’’ అని రూలింగిచ్చేసింది. నాకు ముచ్చెమటలు పోశాయి. వీధిలోకెళ్లానంటే వాళ్లూరుకోరు. ఇంట్లో ఈవిడూరుకోదు. పిల్లలు వాళ్లమ్మకేసి కోపంగా, నాకేసి జాలిగా చూస్తున్నారు. పైగా మేవు దారిపొడుగునా బఠాణీలు నవుల్తూ వచ్చాము. పిల్లల జేబుల్లో పోశారు వాళ్లే.

ఆఖరికి నేనే తెగించి పెళ్లాం ముందు హీనపడిపోవడం ఇష్టంలేక– వీధిలోకెళ్లి,‘‘ఏవిటోయ్‌ మరీ కాసిని మరమరాలు బఠాణీలిచ్చి ముప్పావలా అంటావు? ఆడవాళ్ల దగ్గరో బేరమూ, మగాళ్ల దగ్గరో బేరమూనా? ఆ కొల్తలేవిటి? ఆ డొక్కులేవిటి? మరమరాలకీ, బఠాణీలకి కలిపి అర్ధరూపాయి చేసుకో–మరి మాట్లాడకు’’ అని రిబ్బన్లవాడికేసి తిరిగి–‘‘ఈ వెలిసిపోయిన రిబ్బన్లు ఇచ్చావేమిటయ్యా సాయిబూ, పైగా రూపాయిన్నరేమిటి? రూపాయి చేసుకో– మా ఆవిడ ముప్పవాలాయే ఇమ్మంటోంది. అయినా రిబ్బన్లక్కూడా ఇంత ధరేవిటి? అలా ఇస్తే ఇవ్వు. లేకపోతే తీసేసుకో’’ అంటూ నిర్మొహమాటంగా మా ఆవిడకు వినిపించేలా అనేసి టమటమాల బండి అబ్బాయికేసి తిరిగి బిగ్గరగా కేకలెట్టాను.‘‘మా పిల్లలకి చెరో చేతిలో చెరో బండి పెట్టింది నువ్వేనా? నన్నడక్కుండా నా పర్మిషన్‌ లేకుండా పిల్లల చేతిలో బళ్లు పెట్టి నువ్వు రూపాయి పావలా ఇచ్చేమంటే ఇచ్చేడానికి నేనేవీ తెలివితక్కువవాణ్ణి కాదు. అసలీ వీధిలో నువ్వు కనిపించావంటే జాగర్త! పావలా పావలా చేసుకో. అబ్బో నేనెరగననుకోకు. నా చిన్నప్పుడు అణా అణా.అప్పుడు మట్టిచిప్పకి కాదు, కొబ్బరిచిప్పకే పల్చటి చర్మం అంటించేవారు. దాని మీద దెబ్బపడితే రణభేరి రణభేరే అనుకో. నువ్విప్పుడు జిగురుపూసి కాగితం అంటించావు. నువ్వింకా ఈ సందు తిరక్కుండానే కాగితం చిరిగిపోతుంది. ఇచ్చెయ్‌ జానకీ! వాళ్లకు డబ్బులిచ్చేసి పంపించు’’ అని లోపలికెళ్లిపోయాను.

వాళ్లు ముగ్గురూ డబ్బులిస్తానని నా వెనకాలే వచ్చిన వాళ్లు నా ఉపన్యాసం విని డంగైపోయారు. మా ఆవిడ ఒక్కొక్కరితో ‘‘ఆయనకేవీ తెలీదనీ, వెర్రిబాగులోడనీ, ఇలా నష్టాలు తెస్తుంటే తను తెలివిగా సర్దుకొస్తూ ఉంటుంద’’నీ నన్నో పది అని, వాళ్లని పొగిడి ఒక టమటమాల బండి వాపసు చేసి, రిబ్బన్లని మళ్లీ మార్పించి మొత్తానికి నేను మూడ్రూపాయల పావలా ఇవ్వవలసిన చోట రెండ్రూపాయల కన్నా తక్కువే ఇచ్చి హైరాణా పడిపోతూ మహిషాసుర మర్దనిలా లోపలికొచ్చి ‘‘ఈ వీధిలో వాళ్ల దగ్గర బేరాలు మీకు తెలియవు. వాళ్లు పావలా చెబితే మనం పది పైసలకడగాలి. సగానికి సగం ఎక్కువ చెప్పి డబ్బు దోచేస్తారు.’’ అని లెక్చరిస్తుండగా బూరలవాడొచ్చాడు ‘‘డబ్బులిమ్మంటూ’’. వాడు దారిలో ఆగాట్ట మరో బేరమేదో వస్తే.‘‘బండీ కొంటే మళ్లీ బూరాలెందుకు కొన్నారు?’’ అని నన్ను తీక్షణంగా అడిగింది. బండి కొన్నప్పుడు బూరాలు కొనకూడదు కావును. ఆ సంగతి నాకు తెలీనట్లు నేను నిలబడ్డాను.‘‘బూరాలేవర్రా వెధవల్లారా?’’ అంది వాళ్లకేసి తిరిగి.‘‘పేలిపోయాయ్‌’’ అన్నారు వాళ్లు బిక్కమొగాలేసుకుని. దీన్తో ఆవిడకు చిర్రెత్తుకొచ్చింది.‘‘మీరు బూరాలు వాళ్ల చేతుల్లో చూశారా’’ అని నన్ను క్రాసెగ్జామిన్‌ చేసింది.‘‘చూశాననుకుంటాను’’ అన్నాన్నేను కంగారుపడి.‘‘అయ్యో నా మతిమండా– మీరెక్కడ దొరికారండీ నాకు. బూరాలు కొన్నారో లేదో గుర్తులేదు మీకు. వాడెవడో వీధిలోకొచ్చి డబ్బులడగ్గానే ఇచ్చెయ్యమంటున్నారు. ఈ సంసారం ఇంకెందుకైనా పనికొస్తుందీ? ఇక ఈ కొంప బాగుపడదు. బాగుపడదు’’ అనివాడికేసి తిరిగి, ‘‘పిల్లల చేతిలో బూరాల్లేవు. నువ్విచ్చావో ఇవ్వలేదో– మళ్లీ ఇచ్చెయ్‌. ఇచ్చేసి డబ్బులట్టుకుపో– నన్నాట్టే విసిగించకు. బూరాల వాడు తమాయించుకుని–‘‘జేబులు సూడండమ్మగారూ–’ అని ‘బాబూ ఎర్రబూరా నీకు పచ్చబూరా చెల్లికి ఇవ్వలేదూ’ అని వాళ్లనడిగాడు. వాళ్లు బుర్ర ఊపారు.‘అటికి పిడతల్లాగ తలకాయలూపుతారు’ అని విసుక్కుని మావాడి జేబు వెతికింది. జేబులో రెండు బూరాలున్నాయి.‘‘ఇవి తీసుకుని మంచివిచ్చేయ్‌. డబ్బులివ్వకుండానే బూరాలు పేలిపోతే నువ్వే మళ్లీ మంచి బూరాలివ్వాలి. నువ్వు ఊత్తోంటే పేలిపోతే మళ్లీ మరోటిస్తావా లేదా? పిల్లల చేతిలో ఒకవేళ నువ్వన్నట్లు పేలిపోతే మళ్లీ మంచివివ్వాలిగాని అలా పేలిపోయిన వాటికి డబ్బులుచ్చుకుంటే పసిపిల్లల్ని అన్యాయం చేసినట్లవుతుంది. చిన్నపిల్లలు నారాయణ స్వరూపాలు’‘మీరూదుకోవటానిక్కావాలంటే ఓటిస్తానుగాని పేలిపోయిన వాటికి డబ్బులిచ్చేయండమ్మగారూ! బూరాలను అమ్ముతావుకాని అవి పేలిపోకుండా ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎట్టలేదండీ’ అని నవ్వేడు వాడు.డబ్బులిచ్చేసి ‘పోకిరీ చచ్చినాడా’ అని గొణుక్కుంది జానకి మెటికలు విరుస్తూ.మేవంతా గదిలో బాస మీద కూర్చుని తీరిగ్గా బఠాణీలూ మరమరాలూ నవుల్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. అంతలో మాచంటివాడొచ్చి ‘నా రూపాయి నాకిచ్చెయ్‌ నాన్నా’ అని నుంచున్నాడు కాబూలీవాడిలాగ. వాడి వెనకాలే చంటిది కూడా వచ్చి నిల్చుంది.

‘‘మీ రూపాయి ఏవిట్రా వెధవల్లారా? ఇంకా ఎక్కడుంది? బఠాణీలు మరమరాలు బొక్కారు కదా, ఇవి తేరగా వచ్చాయా? టమటమాల బండి కొనలేదా? రిబ్బన్లు కొనలేదా? ఇవన్నీ ఊరికే వచ్చాయా?’’ అన్నాను. నా మాట వినిపించుకోకుండా నేనేదో చేసినట్లు ఘొల్లుమని శోకాలారంభించాడు. పన్లో పని ఎందుకైనా మంచిదని రెండు తగల్నిచ్చాను. వాళ్లమ్మ జెట్‌ ప్లేన్‌లాగా విసురుగా వచ్చి పిల్లల్ని విడదీసి పట్టుకుని ‘ఎందుకలా కొట్టుకుంటారు? మీవి చేతులు కావా? పసిపిల్లల్ని ఎండలో తిప్పడమే కాకుండా ఏదో అడిగితే సరైన సమాధానం చెప్పాలేగాని కొట్టుకుంటారా? పిల్లలూరికే రాలేదు. నవమాసాలు మోసి కంటే వచ్చారు. మీకేం తెలుస్తుంది?’’ అని నన్ను దులిపేసింది.‘‘అవును. తేరగా మెక్కి రూపాయి తెమ్మని ఏడుస్తున్నారు. ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దూ?’’‘‘ఇదేమిటి నువ్విలా నా మీద తిరగబడుతున్నావు? అయినకాడికి అన్నీ చేయించుకుని అంతా నన్ననే వాళ్లే–’’‘‘అవునండీ మీరు తండ్రి కాబట్టి వాళ్లు చనువుగా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. మారాం చేస్తారు. మనం కొనిస్తాం. అది వాళ్లకేం అర్థమవుతుందీ? వాళ్లకెవరో రెండ్రూపాయలిస్తే ఆ రెండ్రూపాయలెట్టి మీరివన్నీ కొనిపెట్టారు గనుక దానికింత చెల్లు అని చెబితే వాళ్లకు బోధపడుతుందా?’’‘‘అయితే ఈ రెండు రూపాయలింకా ఉందంటావు నువ్వు?’’‘‘అవును. మీరు వాళ్లకి బాకీ. వాళ్లేడిచింది రైటు. అయినా చిన్న పిల్లలకెవరో ఏదో ఇస్తే దాని గురించి పిల్లల్నేడిపించడం మీకేవైనా బాగుందా? ఎవరేనా వింటే నవ్వుతారు!’’‘‘మరి ఇందాకెప్పుడో సినిమాకెళ్దామన్నావు. సినిమాకెళ్లినా ఆ రెండు రూపాయలు అలాగే ఉంటాయా?’’‘‘ఉంటాయీ ఉంటాయీ ఉంటాయీ’’‘‘ఎలా చెప్పు?’’‘‘ఎలాగేవిటండీ? మనం సినిమాకెళితే మన ఖర్చులో వెళతాంగాని ఎవరో పిల్లలకిచ్చిన రెండు రూపాయలకి మరికొంత వేసి కాదు కదా! అలా కక్కుర్తి పడటానికి మనకేం గతి కడుక్కుపోలేదు. నా మొగుడికి ఆరువందల్జీతం.’’‘‘ఆల్‌రైట్‌. ఒప్పుకున్నాను. అయితే ఆ రెండు రూపాయల నుంచి నాకు విముక్తి లేదా?’’‘‘ఇలాటివి ఎవరేనా ఇచ్చినప్పుడు అవన్నీ ఓ చోట వేసుకుని, పట్టాలు పరికిణీలు ఏవైనా కొనుక్కునేదాన్ని’’ అని కాళ్లకేసి చూసుకుంది. అక్కడ పట్టాలు పెట్టుకున్న మచ్చలున్నాయి.ఆడవాళ్ల లాజిక్కు ఆడవాళ్ల ఎకనామిక్స్‌ వేరని తెలుసుకున్నాను. నాకు ఈ రెండ్రూపాయల అప్పు నుంచి మా ఆవిడ దయతలిస్తే కాని విముక్తి లేదు. పెళ్లాం దగ్గర అప్పు అది ఒక తీయని బాధ. పైకి చెప్పుకోడానికి వీల్లేని రుణం. ఆవిడకెలా తోస్తే అలా దాని వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఈ సంసారమనేది చెల్లుపడని నోటు మీద ఏ సుముహూర్తానో చేసిన తెలివి తక్కువ సంతకం.
- పురాణం సుబ్రహ్మణ్యశర్మ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement