అజ్ఞాతి | Funday story of the week 10-02-2019 | Sakshi
Sakshi News home page

అజ్ఞాతి

Published Sun, Feb 10 2019 1:05 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

Funday story of the week 10-02-2019 - Sakshi

ఆ టులెట్‌ బోర్డు చూడగానే సడన్‌గా తన స్కూటర్‌ ఆపాడు భాస్కరం. ‘మేడ మీది గది’ అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు. ఆ ఆవరణలోకి ప్రవేశించగానే ఆనందపడ్డాడు. కారణం, అది నగరానికి దూరంగా ఉన్న కాలనీ, శబ్ద, వాతావరణ కాలుష్యాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. సమీపంగా సముద్రం. ఆ ఇంటి గేటు దగ్గర నిలబడి ‘‘ఏమండీ!?’’ అని పిలిచాడు. అయిదు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఒక పెద్దావిడ. అరవయ్యేళ్లు దాటి ఉంటాయి అనుకున్నాడు. కళ్ళజోడు సర్దుకొని, ‘‘ఏం కావాలి బాబూ?’’ అంది. ‘‘పై పోర్షన్, అద్దెకు’’ అన్నాడు. ‘‘సింగిల్‌ బెడ్‌రూమ్‌ పోర్షన్, బ్యాచులర్లకు మాత్రమే సరిపోతుంది’’ అంది. అతడిని పరిశీలనగా చూసి, ‘జుట్టు పల్చబడింది. బహుశా యాభై ఏళ్లు ఉంటాయేమో’’ అనుకుంది ఆవిడ. ‘‘నేను ఒక్కడినే, నాకు సరిపోతుంది’’ అన్నాడు.‘‘సరే, రండి’’ అంటూ మెట్లెక్కి పైకి నడిచింది. ఆవిడ ముందు నడుస్తుంటే ఆమెను అనుసరించాడు. ఆ పోర్షన్‌పైన టెర్రస్‌ విశాలంగా ఉంది. పైకి వెళ్లిన భాస్కరానికి ఒక్కసారిగా ఒక శీతలపవనం తాకినట్టయింది.  ‘‘అద్దె ఎక్కువయినా ఫరవాలేదు, ఈ ఇల్లు వదులుకోకూడదు’’ అనుకున్నాడు. ఆవిడ తాళం తీసి, లోపలికి రమ్మంది. ఒక విశాలమైన బెడ్‌రూమ్, దానికి ఆనుకునే కిచెన్‌. టెర్రస్‌ మీద వాష్‌రూమ్‌. అంతే! ఇల్లంతా పరిశీలనగా చూసి ‘‘నేను రేపు వచ్చి చేరుతాను. ప్రసుత్తం మా బ్యాంక్‌వారి అతిథిగృహంలో ఉంటున్నాను. ఈ ఊరొచ్చి పదిరోజులయింది. బదిలీ మీద వచ్చాను. అద్దె, అడ్వాన్స్‌ ఎంతో చెప్పండి’’ అన్నాడు. ఆమె చెప్పింది. వెంటనే జేబులోంచి డబ్బులు తీసి లెక్కపెట్టి ఆమెకు అందించాడు.

తరువాతి రోజు ఉదయం ఒక మినీవేన్‌లో సామాను తెచ్చాడు భాస్కరం. ఒక పరుçపు, రెండు కుర్చీలు, ఒక గ్యాస్‌స్టవ్, కొన్ని వంటపాత్రలు, ఒక ట్రంకుపెట్టె, నాలుగు అట్టపెట్టెల నిండా పుస్తకాలు. వాటిని సర్ది, వంట చేసుకుని తినేసరికి అలిసిపోయాడు. నిద్ర పట్టేసింది. లేచేటప్పటికీ సాయంత్రం అయింది. అప్పుడే, డోర్‌బెల్‌ మోగింది. తలుపు తీసేసరికి ఎదురుగా ఇంటి ఓనరు కాఫీ కప్పుతో–‘‘అమ్మా... ఎందుకీ శ్రమ నేను కాచుకుంటాను, నాకు అలవాటే’’ అన్నాడు.‘‘అయ్యో... భోజనం పంపుదామనుకున్నాను. వంటమనిషి సెలవు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉదయమే ఉద్యోగాలకు వెళ్లిపోతారు. నేను, మనవరాలు ఇద్దరమే. తనూ పదిగంటలకు కాలేజీకి వెళ్లిపోతుంది’’ అలా అంటూ, అల్మారాలో అతను చక్కగా సర్దిన నవలలు, వీక్లీల వంక చూసి,‘‘ఓహో.. మీ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో తెలుగు కథలు, నవలలు చదివేది నేనొక్కదాన్నే. కనీసం పేపర్‌ కూడా తెప్పించరు, మా మనవరాలికి అలవాటు చేశాను. తెలుగు మరిచిపోతే ఎలాబాబూ?’’ అంటూ, టీపాయ్‌ మీద ఉంచి ఫొటో చూసి మాట్లాడటం ఆపింది.‘ఒక ఫ్యామిలీ ఫొటో, ఇతగాడు, భార్య, ఇద్దరబ్బాయిలు’వెంటనే అంది. ‘‘మీ వాళ్లంతా ఎక్కడ?’’ అని.‘‘మా ఆవిడకు హైదరాబాద్‌లో ఉద్యోగం. పిల్లలిద్దరూ ఒకడు బెంగళూరు, ఒకడు ఢిల్లీ, నలుగురం నాలుగు చోట్ల’’ అన్నాడు.‘‘ఓహో తప్పదు కదా...’’ అంటూ ఆల్మరాలోని పుస్తకాలను తిరగేస్తోంది. పావుగంటసేపు పరిశీలించి–‘‘భలే ఉదయ్‌గారి నవలలు ఉన్నాయి. అలాగే ఆయన కథలున్న వీక్లీలు, మీరు ఉదయ్‌గారి అభిమానా?!’’ అంది.‘ఔను’ అన్నట్లు తల ఊపాడు.‘‘మావారు ఉన్నప్పుడు తెచ్చేవారు. ఇప్పుడు తెచ్చేవాళ్ళెవరు? మనవరాలు అన్నీ నెట్‌లో చదువుతుంది. నాకు చాతకాదు, అయినా చక్కగా పుస్తకం చదవడమే ఇష్టం నాకు, ప్రయాణాలప్పుడు కొనుక్కొని చదువుతాను. మా ఇంట్లో ఒక్క కాగితం ముక్క కనిపించదు’’ అంది నిట్టూర్పు విడుస్తూ.‘‘ఫరవాలేదమ్మా ఈ పుస్తకాలు తీసుకువెళ్ళి చదవండి.’’ ఆ మాటలకు ఆనందపడి కొన్ని నవలలు, వీక్లీలు తీసుకుని ‘‘చాలా సంతోషం, ఉదయ్‌గారి నవలలు, కథలు అంటే మా ‘రోజా’ సంతోషంతో గంతులేస్తుంది. అదే మనవరాలు, నా పేరే పెట్టారు. నాపేరు సరోజ, మనవరాలు ఊళ్లో లేదు, ఎడ్యుకేషనల్‌ టూర్, రెండు రోజుల్లో వస్తుంది’’ అంటూ అక్కడి నుంచి బయటకు కదలింది.

రెండురోజుల తర్వాత సరోజమ్మగారి మనవరాలు రోజా వచ్చింది, ఆ అమ్మాయి నాన్నమ్మకు ఫొటోకాపీ అనుకున్నాడు భాస్కరం. అతన్ని చూసి రెండు చేతులు జోడించి, కాళ్లకు నమస్కారం పెట్టింది.‘‘గాడ్‌బ్లెస్‌ యూ తల్లీ’’ అని దీవించాడు.‘‘అంకుల్‌ నానమ్మ చెప్పింది. మీరు ఉదయ్‌గారి కథలు, నవలలు బాగా చదువుతారట, మాకూ అంతే, నానమ్మే ఆయనను నాకు పరిచయం చేసింది. మీ దగ్గర నుంచి తెచ్చినవి చదువుతున్నాను. ఆయన రాసిన కథలలో ‘పాపం, మంచివాడు’ చాలా ఇష్టం’’ అంది.‘‘ఎందుకు ఇష్టం?’’ అనడిగాడు భాస్కరం.‘‘అందరితో మంచివాడనిపించుకుందామని టెన్షన్‌ పడుతూ, ఆఖరికి అదో వ్యసనమై రోగాల బారిన పడతాడు, ఆఖరికి ఐసీయూలో చేరతాడు. ‘పాపం మంచివాడు’ అని ఎవరో అనగానే హాయిగా ప్రాణం విడుస్తాడు. ఎందుకో ఆ కథ చదివి నాకు ఏడుపొచ్చింది’’ అంది.‘‘ఔను, ఆ కథ నాకూ ఇష్టమే!’’ అన్నాడు.‘‘అలాగే ‘అమ్మ ఓటు’ కథ చాలా ఇష్టం. ఇద్దరు కొడుకులు పంచాయతీ ఎలక్షన్లలో నిలబడితే, వారి తల్లి ఆ ఇద్దరికీ సమానంగా ప్రేమ పంచాలి కనుక ఆ ఇద్దరి గుర్తుల మీద ఓటు వేస్తుంది. ఆ ఓటు చెల్లకపోతేనేం, తల్లి ప్రేమను వెలకట్టింది’’ అంది.‘‘ఔను, మంచికథ’’ అన్నాడు భాస్కరం. ఆమె అల్మరాలో వెదికి, మరికొన్ని పుస్తకాలు పట్టుకెళ్లింది.

భాస్కరం ఆ ఇంటికొచ్చి నెలరోజులయింది. ఇంటి అద్దె ఇవ్వడానికి వెళ్లాడు. నానమ్మ, మనవరాలు ఇద్దరూ సాదరంగా ఆహ్వానించారు. మనవరాలు కాఫీకప్పుతో వచ్చింది.‘‘చాలా సంతోషం నాయనా, మీ వల్ల ఉదయ్‌గారి సాహిత్యం చదివేశాము. మీ దగ్గరున్నవి అన్నీ అయిపోయాయి చదవటం’’ అంది పెద్దావిడ.‘‘అన్నీ చదివేశారా?! అంత తొందరగా’’ అన్నాడు భాస్కరం ఆశ్చర్యంగా.‘‘ఇంకాలేవా...మీ దగ్గర?’’ అంది మనవరాలు.‘‘లేవు...ఆయన మళ్లీ కొత్తగా రాయాలి, వాటిని పత్రికలు వేయాలి’’ అన్నాడు నవ్వుతూ.‘‘ఈమధ్య ఆయన ఏమీ రాయడం లేదు, దాదాపు రెండేళ్లయింది. కొత్తగా ఏమీ రాయలేదు’’ అంది రోజా.‘‘ఔను...నాకు తెలుసు’’ అంది సరోజమ్మ.‘‘ఏమో వారినే అడగాలి, ఎందుకు రాయడం లేదో!’’‘‘మాకు తెలీదుగా, అయినా ఉదయ్‌గారిని ఎవరూ చూసిన వాళ్లు లేరు మాకు తెలిసి’’ అంది పెద్దావిడ భాస్కరం మాటలకు. ‘‘ఔను... కనీసం ఆయన ఫొటో కూడా చూడలేదు’’ అంది మనవరాలు.‘‘నిజమే, ఆయన ఫొటోలు పత్రికలో రావు’’ అన్నాడు భాస్కరం.‘‘మీరు ఉండేది హైదరాబాద్‌లోనే కదా, ఇంతకుముందు మీరు చూశారా? ఆయనను’’ అంది మనవరాలు.‘‘అవును ఆయన ప్రగాఢ అభిమాని, చాలా కష్టపడితే ఒకసారి దొరికారు...’’ అన్నాడు.‘‘మైగాడ్‌’’ అంది మనవరాలు.భాస్కరం ఇద్దరి వంకా చూశాడు. ఆ ఇద్దరి కళ్లు ప్రకాశవంతంగా మారాయి.అతడి వంక ఆరాధనాపూర్వకంగా చూసి ‘‘ఆయన ఎలా ఉంటారు?’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి.ఒక్కక్షణం ఆలోచించి, ‘‘పొడుగ్గా, దానికి తగ్గ లావు, నెత్తి మీద జుట్టు పలచబడింది’’ అన్నాడు.‘‘అయితే మీలాగే  ఉంటారు’’ అంది సరోజమ్మ. ‘‘అవునా...ఏమో’’ అన్నాడు భాస్కరం చిన్నగా నవ్వి.‘‘మీకు పరిచయం ఉంది కదా, ఆయనను కథలు మళ్లీ రాయమని చెప్పండి. ఈ ఊళ్లో ఒక నానమ్మ, మనవరాలు చకోరపక్షుల్లా ఆయన కథల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని చెప్పండి’’ అంది మనవరాలు సీరియస్‌గా.

‘‘మనం ఏం చెయ్యగలం, ఆయన మీద ఒత్తిడి తేలేము కదా, సృజన అనేది అసంకల్పితంగా రావాలి. రాయలేకుండా ఉండలేనప్పుడు రాస్తారు ఉదయ్‌లాంటి రచయితలు కొందరు. ఆయన ఇంటర్వ్యూలునువ్వు చదవలేదా తల్లీ!’’ అన్నాడు భాస్కరం.‘‘ఆయనే కాదు, ఈమధ్య చాలామంది సీనియర్‌ రచయితలు అస్త్రసన్యాసం చేశారు. ఇలా రాయని కవులు, రచయితల గురించి సి.నారాయణరెడ్డిగారు ఒక కవిత రాశారు వినిపించనా?’’ అంది ఆ అమ్మాయి.‘‘సరే వినిపించండి’’ అన్నాడు భాస్కరం చిన్నగా నవ్వి. నానమ్మ మురిపెంగా మనవరాలి వంక చూసి, ‘‘చెప్పు’’ అంది. రోజా సెల్‌ఫోన్‌లోంచి ఆ కవిత చదవడం మొదలుపెట్టింది.‘ఇంకా ఎందుకు రాస్తున్నావ్‌?/ రాసింది చాలదా!/ ఈ ప్రశ్నలు విని/దూకే జలపాతం గలగలా నవ్వేసింది/ అకుంఠిత ధారారూపంలోనే కదా/ఆ కవీ, నేనూ జీవిస్తున్నది/ ఆగిపోతే మాకు అస్తిత్వమెక్కడిది/అందాక ఎందుకు?/ ఆడే శ్వాస ఎప్పుడైనా/ విశ్రాంతి కోరుకుంటుందా?/నిద్రలోనైనా కునుకు తీయని అవిశ్రాంత గతి దానిది/ శ్వాసకు విరమణ అంటే మరేమీకాదు మరణమే!/ నిరంతర సృజనశీలి అయిన కవీ అంతే/ నేను అంతే!’‘‘బావుంది కవిత, మీ కోసమైనా ఆయన తిరిగి రాస్తారేమో!’’ అన్నాడు భాస్కరం. ‘‘ఔను రాయాలి, రాయమని గట్టిగా చెప్పండి’’ అంది రోజా. ఆ మాటలకు నవ్వుతూ వారి ఇంట్లోంచి బయటకు నడిచాడు భాస్కరం

మూడు నెలల తరువాత ఒక సాయంత్రం పూట కాలేజీ నుంచి రాగానే ఉత్సాహంగా పైకి పరుగెత్తింది రోజా. ‘‘ఉదయ్‌గారి కథ వచ్చిందండోయ్‌’’ అంటూ ఆ పత్రిక చూపించి కథ పేరు ‘దాతృత్వం’ అంది.‘‘నువ్వు చదివిన తరువాత ఇవ్వమ్మా’’ అన్నాడు భాస్కరం.‘‘చూశారా...ఈ ప్రసిద్ధ వారపత్రిక జన్మదిన సంచికలో వేశారు. మిగతా రచయితల ఫొటోలున్నాయిగానీ ఉదయ్‌గారి ఫోన్‌ నెంబర్‌ మాత్రమే ఉంది’’ అంది.
ఆ సమయంలో భాస్కరం వంటగదిలో కాఫీ కలుపుతున్నాడు. రెండు కప్పుల్లో కాఫీ కలిపి, తను ఒక కప్పు తీసుకుని, ఇంకోటి ఆ అమ్మాయికిచ్చాడు. భాస్కరం ఒక్కసారి ఆ అమ్మాయి చుడీదార్, పైజామావంక చూసి–‘‘తల్లీ...ఈ డ్రస్‌ కోసం నువ్వు షాప్‌ గురించి, ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళావ్, అంతే...నీకు కావలసింది ఆ షాపు చిరునామా, అంతేగానీ, ఆ డ్రస్‌ తయారుచేసే మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీకాదు, అలాగే ఉదయ్‌గారు రాసిన పత్రిక గురించి తెలుసుకుంటే చాలు, ఆయన వివరాలు అనవసరం కదా! అయినా మనం చేసే పనుల్లో మంచి కనబడాలి మనం కాదు, అలాగే రచయిత రచనలేపాఠకులకుకనబడాలి రచయిత కాదు’’ అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆలోచనలో పడింది.‘మరి రచయితలు, కవులు లైమ్‌లైట్‌లో ఎందుకు ఉండాలనుకుంటారు?! సన్మానాలు, శాలువాలు, ఇవన్నీ దేనికీ?!’’ అంది ఆ అమ్మాయి.‘‘ప్రతిభకు నమ్మకం కలిస్తే ఆ కళాకారుడు విజయం సాధిస్తాడు.తనగొప్పదనాన్ని అందరూ కీర్తించాలని ఆశపడనవసరం లేదు’’ అన్నాడు.‘‘పాపం.. అందరికీసన్మానాలు, పేపర్లలో ఫొటోలు.. ఉదయ్‌గారు అలా అజ్ఞాతంగా ఉండిపోవడం బాధగా ఉంది’’ అంది రోజా.‘‘ఎందుకు బాధ, మీ నాన్నమ్మ, నువ్వు మీలాంటి వారి కోసం రెండు సంవత్సరాల తర్వాత కథ రాశారు. అదే అసలైన పురస్కారం ఆయనకు’’ అన్నాడు.‘‘ఏమో! కన్విన్స్‌ కాలేకపోతున్నాను’’ ఆమె అలా అంటూ అక్కడి నించి కదిలింది.

ఆరోజు శనివారం. బ్యాంకుకు సెలవు. భాస్కరం వంట చేసుకుంటున్నాడు.వాళ్లింట్లో చేసిన తినుబండారం పట్టుకొని పైకి వచ్చింది రోజా. ఆయనకు దాన్ని ఇస్తూ, ‘‘ఈరోజు నానమ్మ, నేను ఉపవాసం, అయినామీ కోసం వంట చేయించాము’’ అంది.‘‘నేను ఉపవాసమే, అయినా నేనూ వండుకుంటున్నాను’’ అన్నాడు చిన్నగా నవ్వి.‘‘అర్థమయింది. ఉదయ్‌గారి అభిమానులు అంతా అంతే కదా, ఆయన రాసిన ‘అర్ధనారీశ్వరం’ కథలో నాయకుడు ఉపవాసం రోజున తను తినేది, యాచకులకు దానం చేస్తాడు. మేమూ అదే పని, మీరూ అంతే కదా!’’ అంది.‘‘ఔను...’’ అన్నాడు భాస్కరం.ఆ మాటలకు క్షణం సేపు ఆగి, ‘‘ఈరోజు ఇంట్లో పెద్ద గొడవ, నాన్న ఏడ్చేశారు’’ అంది రోజా.‘‘దేనికి?’’ అన్నాడు భాస్కరం ఆశ్చర్యంగా ఆమె వంక చూసి.‘‘ఇంతకాలం వంట ఇంటికీ, పిల్లల పెంపకానికీ పరిమితమైపోయాను. నేను  ఈ సమాజానికి చేసింది ఏమిటీ...’’ అంటూ మొదలుపెట్టింది నాన్నమ్మ’’ అంది  ఆ అమ్మాయి.‘‘మై గాడ్‌ నిజమా...మీ నాన్నమ్మ ఇలా కూడా ఆలోచిస్తుందా?’’ అన్నాడు ఆశ్చర్యంగా.‘‘అవును...అందుకోసం ఆవిడ ఒక పని చేయడానికి పూనుకుంది, తన మరణానంతరం’’‘అంటే?!’’ ఒక్కసారి విస్మయంగా చూశాడు ఆమె వంక.తన శరీరాన్ని మెడికల్‌ కాలేజీకి దానం ఇచ్చేస్తుందట కారణం, ఉదయ్‌గారి కథ దాతృత్వం చదివింది’’ అంది ఆ అమ్మాయి.మాటలకు షాక్‌ తిన్నట్టుగా చూశాడు భాస్కరం ఆమె వంక. ‘‘ఔను. చనిపోయిన తరువాత ఎందుకూ పనికిరాని దేహాన్ని వైద్యకళాశాల విద్యార్థుల కోసం ఉపయోగించుకోవచ్చు కదా...అలా ఎంతమందో చూసి జ్ఞానవంతులవుతారు. అలా తన జీవితానికో అర్థం ఏర్పడుతుంది’’ అంటూ నానమ్మ గట్టిగా వాదించింది నాన్నతో.‘‘ఇంతకీ ఆయన ఒప్పుకున్నారా?’’‘ఏంచేస్తారు? ఆమె అంత పట్టుదలగా ఉంటే’’ అంది మనవరాలు రోజా.ఆ మాటలకు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు భాస్కరం. మెల్లగా నడుచుకుంటూ బాల్కనీ పిట్టగోడ దగ్గరకు వచ్చాడు. అతని కళ్లనించి మెల్లగా వస్తున్న కన్నీళ్లు.

‘‘రచయితల వలన, వారి రచనల ప్రభావం వలన పాఠకులు మారతారు, అయితే ఒక పాఠకురాలు, రచయితను మార్చింది’’అతను మెల్లగా తనలో తాను అనుకున్న మాటలు ఆమెకు వినపడ్డాయి. ఆమె ఏమీ అర్థం కాలేదు.‘‘ఏమయింది సార్‌?’’ అంది అతడిని పరిశీలనçగా చూసి.‘‘ఉదయ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ దేహానికి పేరు ఒక గుర్తు మాత్రమే. నా పేరు అనే యోచన విడనాడాలి. నేను అనేది నీ దేహం నుండి విడనాడాలి. అదే పునరుత్థానం. అందుకే నా రచనలనే పాఠకులకు చూపుతాను నన్ను కాదు. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయిన తరువాతే, నా ఛాయాచిత్రం కనిపిస్తుంది అన్నాడాయన’’ భాస్కరం ఆకాశం వంక చూస్తూ చెప్పాడు.‘‘ఔను...నేను చదివాను ఆ ఇంటర్వ్యూ’’ అంది రోజా.‘‘ఇప్పుడు ఆయన దేహమూ కనబడదేమో!’’ అన్నాడు భాస్కరం మెల్లగా.‘‘అంటే?’’ ఆమె తెల్లబోతూ అతడివంక చూసింది.‘‘ఆయన రాసిన ‘దాతృత్వం’ కథలో నాయకుడు తన దేహాన్ని దానం చేసినట్టు తనూ చేస్తాడేమో!’’ అన్నాడు భాస్కరం‘‘మీకెలా తెలుసు?!’’ అంది ఆ అమ్మాయి అతడి వంకే రెప్ప వాల్చకుండా చూసి.‘‘ఆయన రచనల వలన ఒక పాఠకురాలు మారితే ఆయన మారడా?!’’ అంటూ గబగబా ఇంట్లోకి నడిచాడు భాస్కరం.ఆలోచిస్తూనే క్రిందకు నడిచింది రోజా. ఆమెలో ఎన్నో ప్రశ్నార్థకాలు. సాయంత్రం గడిచింది. రాత్రయింది. ఆకాశంలో మిణుకుమంటున్న నక్షత్రాలు అక్కడక్కడా! రోజాకు నిద్రపట్టడం లేదు. బయటవరండాలోతిరుగుతోంది. ఏవో ఆలోచనలు.ఉదయ్‌గారు రాసిన కథ పడిన వీక్లీ ఆమె చేతిలో, వెంటనే ఆయన నంబర్‌ చూసి ఫోన్‌ చేసింది. అవతల రింగు అవుతున్న శబ్దం, ఆమె సమీపంలోనే వినిపిస్తోంది. ఆ రింగ్‌టోన్‌ మేడ మీద నుంచి వినిపిస్తోంది. ఆమె వేగంగా పైకి వెళ్లింది గబగబా మెట్లు  ఎక్కుతూ. భాస్కరం పడుకున్న బెడ్‌రూమ్‌ కిటికీ తెరిచే ఉంది. గుడ్డిగా వెలుగుతున్న బెడ్‌రూమ్‌ వెలుగులో కనిపించాడాయన నిద్రపోతూ–పక్కన ఆయన ఫోన్‌ మోగుతూనే ఉంది. ఆయన ఎత్తడం లేదు. గాఢనిద్రలో ఉన్నట్లు ఆమెకు అర్థమయింది. సందేహ నివృత్తి కోసం ఫోన్‌ కట్‌ చేసి, మళ్లీ చేసింది.ఫోన్‌ మోగుతూనే ఉంది. ఆమెలో ఆశ్చర్యం, ఆనందం... ఒక అద్భుతం చూసిన అనుభూతి.ఇంతలో ‘‘రోజా’’ అనే నానమ్మ కేక వినిపించింది.‘రచయితను మార్చిన పాఠకురాలా వస్తున్నాను’ అంటూ ఆమె మెట్లు దిగడం ప్రారంభించింది.ఆ సమయంలో ఆమెకు తను ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి– ‘రచయిత కన్నీరు కార్చకుండా పాఠకుడి కళ్లల్లో నీరు తెప్పించలేడు. రచయిత ఆశ్చర్యానికి లోను కాకుండా పాఠకుడిని ఆశ్చర్యం కలిగించలేడు.’
- డా. ఎమ్‌.సుగుణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement