
నచ్చినట్లు ఆడతా... నమ్మింది మాట్లాడతా! : గుత్తా జ్వాల.
విశ్లేషణం
చేతిలో రాకెట్ పట్టిన ఆరడుగుల అందాలరాశి... నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధీరోదాత్త... తన ఆట బాగున్నంతకాలం ఎవరి మెప్పుకోసం ప్రయత్నించాల్సిన అవసరంలేదని నమ్మే క్రీడాకారిణి... సినిమాలంటే అమితాసక్తి ఉన్న తెలుగమ్మాయి... గుత్తా జ్వాల.
సాధారణంగా క్రీడాకారులు, క్రీడాకారిణులు కైనస్థటిక్ పర్సనాలిటీకి చెందినవారై ఉంటారు. అంటే వారికి తమ శరీరంపైన కంట్రోల్ ఉంటుంది. ప్రతి దానినీ ఫీల్ అవుతారు. ఎమోషనల్‌గా ఉంటారు. తాము విశ్వసించినదానికోసం ఎంతకైనా నిలబడతారు. జ్వాలలో ఈ లక్షణాలు స్పష్టంగా కనబడతాయి. సూటిగా, స్పష్టంగా మాట్లాడటం జ్వాలలో కనిపించే ప్రత్యేక లక్షణం. ఆమె బ్యాట్‌నుంచి షటిల్ ఎంత వేగంగా వస్తుందో... అంతకంటే వేగంగా నోటినుంచి మాట వచ్చేస్తుంది. ఎవరిమీదనైనా, దేనిమీదనైనా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేయడం తప్పుకాదని నమ్ముతుంది. అందుకే తన అభిప్రాయాన్ని తడుముకోకుండా చెప్పేస్తుంది.
ఇతరులను విమర్శిస్తూ మాట్లాడే సమయంలో కూడా తన భావాలను స్పష్టంగా వ్యక్తంచేయాలనే ప్రయత్నమే తప్ప కోపం, ఆవేశం, ద్వేషంలాంటి భావోద్వేగాలు అస్సలు కనిపించవు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గురించి మాట్లాడే సమయంలో కూడా అతని ఆటను గౌరవిస్తూనే, అతని ఆశ్రీత పక్షపాతాన్ని మాత్రమే తప్పుపట్టడం ఆమెలో ఉండే స్పష్టతకు నిదర్శనం. తాజాగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో లోపాలను ఎత్తి చూపుతూ మాట్లాడటం, వారి ఆధిపత్యంపై న్యాయస్థానానికి వెళ్లిమరీ పోరాడటం ఆమెలో ఉండే ధృఢచిత్తానికి అద్దం పడుతుంది.
జ్వాల ఇంటర్వ్యూలను గమనిస్తే... ఆమెలో కదలికలు చాలా తక్కువగా కనిపిస్తాయి. స్థిరంగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటుంది. బాడీలాంగ్వేజ్ ప్రకారం అలా కూర్చోవడమంటే రిజర్వ్‌డ్‌గా ఉంటారని అర్థం. కానీ జ్వాల విషయంలో మాత్రం ఈ సూత్రం అబద్ధమవుతుంది. తానెవరితో మాట్లాడుతున్నా, ఏ విషయం మీద మాట్లాడుతున్నా కంఫర్ట్‌గా ఉంటుందనే విషయాన్ని ఈ పొజిషన్ చెబుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు జ్వాల తరచూ నవ్వడం మనకు కనిపిస్తుంది. జీవితాన్ని, అందులో ఎదురయ్యే ప్రశ్నలను, సంఘటనలను తానెంత స్పోర్టివ్‌గా తీసుకుంటుందో ఆ నవ్వు మనకు చెబుతుంది. అంతేకాదు తాను ఎవరితోనైనా సూటిగా కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంది. పక్కకి చూడటం చాలా తక్కువ.
జ్వాల కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. ఆరడుగుల అందగత్తె కూడా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నితిన్‌తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది కూడా. సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు... సినిమాలపై తనకు ప్రత్యేకమైన ఆసక్తి లేదని, మంచి అవకాశం వస్తే పరిశీలిస్తానని జ్వాల అనేక ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ ఆ మాటలు అబద్ధమని ఆమె బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. అలా చెప్పే సమయంలో తాను కంటిని రుద్దుకోవడమో లేదా నోటికి అడ్డుగా చేయి పెట్టుకోవడమో కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె చెప్పేది అబద్ధమని, తనకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలిసిపోతుంది.
జ్వాల బలం తాను నమ్మిన విలువల్లో ఉంది. ఆమెలో బలమైన, దృఢమైన విలువలు కనిపిస్తాయి. ‘‘ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్’’, ‘‘నేను నా పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు మాత్రమే సమాధానం చెప్పాలి, వేరెవ్వరికీ చెప్పాల్సిన అవసరంలేదు’’, ‘‘నేనేంటో నా ఆట చెప్తుంది, ఎవరినో ప్లీజ్ చేయాల్సిన అవసరంలేదు’’, ‘‘ఓటమంటే భయంలేదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్’’ అనే జ్వాల మాటలు తన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి.
జ్వాలలో సెన్సెటివ్‌నెస్ ఎక్కువ. అందుకేనేమో అందరికీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా ఫీలవుతుంటుంది. తన గురించి, తన ఆట గురించి మాత్రమే కాకుండా అందరి సమస్యల గురించి మాట్లాడుతుంది. కోరి సమస్యలను కొనితెచ్చుకుంటుంది. ఆ బలహీనతను అధిగమించి, మాటలకన్నా ఆటపై మాత్రమే శ్రద్ధ చూపిస్తే జ్వాల మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తుందని చెప్పవచ్చు. విష్ హర్ ఆల్ ది బెస్ట్!
-విశేష్, సైకాలజిస్ట్