అరణ్యం : హమ్మింగ్ బర్డ్ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది!
ప్రపంచంలోనే అత్యంత చిన్న పక్షి... హమ్మింగ్ బర్డ్!
హమ్మింగ్ బర్డ్ అనడంతో ఇది పాట పాడుతుందేమో అనుకుంటారు చాలామంది. కానీ అలాంటిదేమీ కాదు. ఇది రెక్కలు ఆడించినప్పుడు ఓ చక్కని శ్రావ్యమైన శబ్దం వస్తుంది. దాని కారణంగానే దీనికా పేరు వచ్చింది!
వీటికి వాసన చూసే శక్తి లేదు!
వీటి నాలుక ఇంగ్లిష్ అక్షరం ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉంటుంది!
వాతావరణాన్ని బట్టి వీటి ఒంటి రంగు మారుతుంది!
వీటి గుండె నిమిషానికి 1,260 సార్లు కొట్టుకుంటుందట!
ముందుకీ వెనక్కీ కూడా ఎగరగల పక్షి ఇదొక్కటే. ఇవి గుండ్రంగా చక్కర్లు కూడా కొట్టగలవు. పైకి, కిందికి నిటారుగా కూడా ఎగరగలవు!
హమ్మింగ్ బర్డ్ కాళ్లు చాలా బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఇవి నడవలేవు. అందుకే ఇవి ఎక్కడా వాలడానికి ఇష్టపడవు. తేనె పీల్చేటప్పుడు కూడా గాల్లో ఎగురుతూనే పీల్చడానికి ప్రయత్నిస్తాయి!
మగ హమ్మింగ్ బర్‌డ్స అసలు ఏ పనీ చేయవు. ప్రతిదానికీ ఆడవాటి మీదే ఆధారపడతాయి. గూడు కట్టడం దగ్గర్నుంచి, గుడ్లు పొదగడం, పిల్లలకు ఆహారం తీసుకు రావడం వరకూ ఆడవే చేస్తాయి!
వీటికి ఎరుపు రంగంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఎర్రటి పూల తేనెనే గ్రోలుతాయి!
ఇవి ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోలేవు. అలాగని తరచూ తినకపోతే బతకలేవు. అందుకే గంటకు ఏడు నుంచి పదిసార్లు తింటాయి. ప్రతిసారీ ముప్ఫై నుంచి నలభై సెకన్లు భోజన కార్యక్రమానికి వెచ్చిస్తాయి. తేనె, జిగురు, చిన్న చిన్న పురుగుల్లాంటివి తింటాయి!
జూ కలిపిన బంధం ఇది!
స్నేహమేరా జీవితం అంటూ మనుషులు పాటలు పాడుకోవడం మనకు తెలుసు. కానీ స్నేహం మాకూ ఉంటుంది, మా స్నేహం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది అని నిరూపించాయి ఈ రెండు మూగజీవాలు. ఈ ఫొటోలో ఉన్న జిరాఫీ పేరు... గెరాల్డ్. దానితో ఉన్న బుజ్జి మేక పేరు ఎడ్డీ. 2006లో గెరాల్డ్‌ని యూకేలోని ‘నోవాస్ ఆర్క్ జూ’కి తీసుకొచ్చారు అధికారులు. అప్పటికి దాని వయసు రెండేళ్లు. చిన్నిది కావడంతో అందరూ ఎంతో ముద్దుగా చూసేవారు. అయితే దీని ప్రవర్తన విచిత్రంగా ఉండేది. ఇతర జిరాఫీలకు దగ్గరయ్యేది కాదు. వాటితో చెలిమి చేసేది కాదు. కానీ ఎడ్డీకి మాత్రం ఎందుకో చాలా దగ్గరయ్యింది. ప్రాణప్రదమైన నేస్తమయ్యింది.
గెరాల్డ్ తోటి జిరాఫీలను కాదని మేకతో స్నేహం చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ గెరాల్డ్ అవేమీ పట్టించుకోలేదు. ఎప్పుడూ ఆ మేకను వెంటేసుకుని తిరిగేది. ఆ జూలో ఉన్న ఇతర జంతువులేవైనా ఎడ్డీని విసిగిస్తే కోపమొచ్చేసేది గెరాల్డ్‌కి. వాటితో పోట్లాటకు దిగేది. చివరకు రెండింటికీ కలిపి ఒకసారి పెడితేనే ఆహారం తినేది. ఒకదానికి మాత్రమే పెడితే, రెండోదానికి పెట్టేవరకూ అది ముట్టేది కాదు. ఆ రెండూ కలిసి జూ అంతా గెంతులేస్తూ తిరుగుతుంటే చూసి మురిసిపోవడం అధికారుల వంతయ్యింది. ఓ గొప్ప స్నేహితులుగా ఈ జీవాల జంట పాపులర్ అయ్యింది!