అదృశ్యనౌక | Invisible ship story | Sakshi
Sakshi News home page

అదృశ్యనౌక

Published Sun, Aug 16 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

అదృశ్యనౌక

అదృశ్యనౌక

మిస్టరీ
* ఎప్పుడో మునిగిపోయిన ఓడ
* ఇప్పుడెలా కనిపిస్తోంది?
* ఎందుకు భయపెడుతోంది?
నార్వే... 16వ శతాబ్దం...

‘‘హాయ్ డియర్... ఏం చేస్తున్నావ్? లంచ్ రెడీయా?’’... ఇంట్లో అడుగు పెడుతూనే భార్యను పలకరించాడు ఫ్రాంక్.
ఎలిన్ మాట్లాడలేదు. సోఫాలో అలానే కూర్చుని ఉంది. ఎటో చూస్తోంది. ఆ కళ్లలో ఏదో భయం. నుదుటి మీద ఉన్న స్వేద బిందువుల్ని చూస్తుంటే ఆమె దేనికో భయపడుతోందని అర్థమవుతోంది.
 
భార్యనాస్థితిలో చూసి కంగారు పడ్డాడు ఫ్రాంక్. గబగబా ఆమె దగ్గరకు వెళ్లాడు. ‘‘ఏంటి ఎలిన్... ఏమైంది? ఎందుకలా ఉన్నావ్? ఎందుకలా భయంగా చూస్తున్నావ్?’’ అన్నాడు పక్కనే కూర్చుంటూ.
 అప్పుడు కూడా ఎలిన్ మాట్లాడలేదు. మెల్లిగా తలతిప్పి భర్తవైపు చూసింది. మరుక్షణంలో ‘ఫ్రాంక్’ అంటూ అతడి గుండెలపై వాలిపోయి బావురుమంది.
 విస్తుపోయాడు ఫ్రాంక్. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఎలిన్ ఎందుకలా ఏడుస్తోందో తెలియక తికమకపడ్డాడు. ‘‘ఏమైంది డియర్? ఎవరికైనా ఏమైనా అయ్యిందా? ఏదైనా దుర్వార్త విన్నావా? మీ ఇంట్లోవాళ్లంతా బాగానే ఉన్నారా?’’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని కురిపించాడు భార్యను గట్టిగా హత్తుకుంటూ.

 అతని ప్రశ్నలు పూర్తయ్యేసరికి కాస్త నెమ్మదించింది ఎలిన్. అందరూ బాగానే ఉన్నారన్నట్టు త లూపుతూనే తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని భర్తకు చూపించింది ఎలిన్. దాన్ని అందుకుని చదవడం మొదలుపెట్టాడు ఫ్రాంక్.
 ‘‘డియర్ ఎలిన్... ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు. నిన్ను చూసి చాలా రోజులయ్యింది కదా! అందుకేనేమో... ఒక్కసారి కళ్లారా చూడాలని మనసు తహతహలాడుతోంది. వీలు చూసుకుని వస్తాను. ఫ్రాంక్‌ని అడిగానని చెప్పు. టేక్ కేర్ తల్లీ.... ఇట్లు మీ నాన్న ఎరిక్.’’

 ఉత్తరం చదువుతూనే కొయ్యబారిపోయాడు ఫ్రాంక్. ‘‘ఏంటి ఎలినా ఈ ఉత్తరం?’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.
 ‘‘నాకూ అదే అర్థం కావడం లేదు ఫ్రాంక్. నాన్న ఏమిటి? ఉత్తరం రాయడం ఏమిటి? పోనీ పాత ఉత్తరమేదైనా ఇప్పుడు వచ్చిందా అంటే అదీ లేదు. కవర్ కొత్తగా ఉంది. ఇదెలా సాధ్యం?’’
 ఫ్రాంక్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకో అతడికీ భయంగానే ఉంది. ఆ ఉత్తరాన్ని చూసేకొద్దీ అతడికి వణుకు పుడుతోంది. అందుకే ఆ విషయాన్ని తేలిగ్గా తీసి పారేయబుద్ధి కాలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. ఎలినాని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరాడు.
    
 ‘‘ఒక ఉత్తరాన్ని చూసి ఇంత భయపడుతున్నారేంటి మీరు? ఏం... మీ నాన్నగారు ఉత్తరం రాయకూడదా?’’
 ఇన్‌స్పెక్టర్ ప్రశ్నకి ముఖముఖాలు చూసుకున్నారు ఫ్రాంక్, ఎలినా. ‘‘రాయకూడదని, రాయరని కాదు సర్. రాయడానికి అసలు ఆయన లేరు. ఎప్పుడో చనిపోయారు.’’
 ఈసారి ఇన్‌స్పెక్టర్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏమంటున్నారు?’’ అన్నాడు చురుక్కున.
 ‘‘నిజం సర్. మా నాన్నగారు చనిపోయారు. అది కూడా ఇప్పుడు కాదు. ఎనభయ్యేళ్ల పైనే అయ్యింది. 1600 సంవత్సరంలో ఆయన ప్రయాణిస్తోన్న ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఒక్కరు కూడా మిగల్లేదు. మరి ఇప్పుడు ఆయన ఉత్తరం ఎలా రాస్తారు సర్?’’
 
ఎలినా చెప్పిన మాటలు వింటే చాలా విచిత్రంగా అనిపించింది ఇన్‌స్పెక్టర్‌కి. చనిపోయిన మనిషి ఉత్తరం ఎలా రాస్తాడు అన్న ఆలోచన అతని ఖాకీ గుండెని సైతం కాస్త కంగారు పెట్టింది. ‘‘ఒకవేళ ఆయన అప్పుడు చనిపోలేదేమో. తప్పించుకుని బయటపడ్డారేమో. ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఉత్తరం రాశారేమో’’ అన్నాడు లాజికల్‌గా ఆలోచిస్తూ.
 ‘‘ఆ ప్రమాదం జరిగేనాటికే ఆయనకు అరవయ్యేళ్లు దగ్గర పడ్డాయి. మరి ఇన్నేళ్లు ఆయన ఉండి ఉంటారంటారా? ఒకవేళ రాసినా ఉత్తరంలో ఆ విషయాలన్నీ రాస్తారు. కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. అవేమీ లేవే! కనీసం స్టాంపులు అంటించలేదు.

పోస్టల్ ముద్ర కూడా లేదు.’’
 ఫ్రాంక్ మాటలు విన్న తర్వాత ఇక మాట్లాడలేకపోయాడు ఇన్‌స్పెక్టర్. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు. ఒకటికి రెండుసార్లు చదివి చూశాడు. ఏమీ తట్టలేదు. ఆ దంపతులిద్దరికీ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ‘‘నేను ఎంక్వయిరీ చేస్తాను. మీరు వెళ్లండి’’ అని పంపించేశాడు.
 ఆ తర్వాత కూడా చాలాసేపు జుత్తు పీక్కున్నాడు ఇన్‌స్పెక్టర్. ఆ ఉత్తరం గురించి ఎంక్వయిరీ చేయడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఎంత వెతికినా ఏ ఒక్క ఆధారమూ దొరకలేదు. దొరకదన్న విషయం అతనికి తెలియదు. ఎందుకంటే ఎలిన్ తండ్రి చనిపోయింది ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్ షిప్’ ప్రమాదంలో. ఆ ఓడ ఒక మిస్టరీ. ఆ ఓడకు జరిగిన ప్రమాదం ఒక మిస్టరీ. దానికి సంబంధించిన ప్రతి విషయమూ ఒక మిస్టరీ. ఆ సంగతి ఇన్‌స్పెక్టర్‌కి తెలియదు పాపం. తెలిసి ఉంటే అతడు అంత కష్టపడేవాడు కూడా కాదు. అసలింతకీ ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్’ కథ ఏంటి?
   
 ఫ్లయింగ్ డచ్‌మ్యాన్... ఓ అందమైన ఓడ. 1600 సంవత్సరంలో ఓ రోజు అట్లాంటిక్ సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కెప్టెన్ డెకెన్‌తో పాటు, కొందరు సిబ్బంది, కొందరు ప్రయాణీకులతో హుందాగా జలాలపై నడిచింది. కానీ ఆ ప్రయాణమే దాని ఆఖరు ప్రయాణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
 
ఓడ సముద్రం మధ్యలో సాగుతున్నప్పుడు హఠాత్తుగా తుపాను రేగింది. అలలు ఉవ్వెత్తున ఎగశాయి. ఓడను నిలువునా కుదిపేశాయి. తమ బలంతో దాన్ని ముక్కలు చేసేశాయి. వందలాది మందిని నీట ముంచేశాయి. వారి ప్రాణాలను గాలిలో కలిపేశాయి.
 అయితే కథ అక్కడితో ముగిసి పోలేదు. అక్కడే మొదలైంది. ఆ ఓడ కానీ, దాని శిథిలాలు కానీ ఎవరికీ దొరకలేదు. మృతదేహాలూ దొరకలేదు. కానీ కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఆ ఓడ, ఆ మనుషులు అందరినీ వెంటాడసాగారు. సిబ్బంది కుటుంబ సభ్యుల్లో కొందరికి వారి నుంచి ఉత్తరాలు వచ్చాయి.

అది కూడా చాలా యేళ్లు గడిచిపోయాక. చని పోయినవాళ్లు ఉత్తరాలు ఎలా రాశారో ఎవరికీ అర్థం కాలేదు. ఆరా తీస్తే ఆ ఉత్తరాలు ఎక్కడ్నుంచి వచ్చాయో కూడా ఎవరికీ అర్థమయ్యేది కాదు. అదే భయానకమైన అనుభవం అంటే... అట్లాంటిక్ సముద్రంలో... ఓడ ప్రమాదానికి గురైన చోట చిత్ర విచిత్రాలు జరగడం మొదలయ్యింది.

 ఓడలు, పడవలు ఆ దారి గుండా వెళ్తునప్పుడు ఉన్నట్టుండి ఎదురుగా ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్’ ప్రత్యక్షమయ్యేది. వేగంగా దూసుకొచ్చేది. అది తమ ఓడను గుద్దేస్తుందేమోనని కెప్టెన్లు కంగారు పడేవారు. కానీ అలా జరిగేది కాదు. కొన్నిసార్లు ఆ ఓడ గాలిలోకి కూడా లేచేదట. అది మాత్రమే కాక కెప్టెన్ డెకెన్ కూడా చాలామందికి కనిపించేవాడు. నీళ్లమీద నడిచేవాడు. గాలిలో ఎగిరేవాడు. ఒక్కోసారి పడవల్లో, ఓడల్లో కూడా ప్రత్యక్షమయ్యేవాడు. దాంతో అందరూ హడలిపోయేవారు. కానీ అదృష్టం ఏమిటంటే... ఎవరికీ ఏ ప్రమాదమూ సంభవించలేదు. డెకెన్ ఆత్మ కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదు.
 
మొదట్లో వీటిని అందరూ భ్రమ అని కొట్టి పారేశారు. కానీ ఓడల్లో ప్రయాణిస్తు న్నప్పుడు కొందరు ప్రముఖులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదరవడంతో విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంతో పరిశోధనలు మొదలయ్యాయి. నిజ నిర్ధారణ చేసేందుకు బృందాలు బయలుదేరాయి. చివరికి వారిలో కూడా కొందరు ఆ దెయ్యపు ఓడని, డెకెన్ ఆత్మని చూసి జడుసుకున్నారు. దాంతో ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడసాగారు. దెయ్యాలనీ భూతాలనీ నమ్మనివారు మాత్రం అదంతా వట్టి పుకారు అని కొట్టి పారేశారు.
 
ఇలాంటి మిస్టరీల విషయంలో ఎప్పుడూ రెండు వాదనలు వినిపిస్తాయి. నిజమనే వారితో పాటు భ్రమ అనే వర్గం కూడా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం. ఒక్కసారి భయం మొదలయ్యాక దాన్ని తీసేయడం అంత తేలిక కాదు. అందుకే దెయ్యం అన్న మాట ఈ ఆధునిక యుగంలో కూడా ఎంతో మందిని వణికి స్తోంది. ఫ్లయింగ్ డచ్ మ్యాన్ ఉదంతం పుస్తకాలుగా, సినిమాలుగా మాటిమాటికీ ముందుకొచ్చి భయపెడుతూనే ఉంది.

 ఫ్లయింగ్ డచ్‌మ్యాన్‌ని ఘోస్ట్ షిప్, ఫాంటమ్ షిప్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. దీని గురించి అనేక రకాల వాదనలు ఉన్నాయి. సముద్రగర్భంలో ఓడ శిథిలాలు కనిపించలేదు. ఒక్కటంటే ఒక్క మృతదేహం కానీ, అవశేషాలు కానీ కనిపించలేదు. నేవీ రికార్డుల్లో కూడా ఫ్లయింగ్ డచ్‌మ్యాన్ గురించి సరైన ఆధారాలు లభించకపోవడంతో అసలు అలాంటి ఓడే లేదు అన్నారు కొందరు. ఒకవేళ అదే నిజమైతే మరి ఆ సిబ్బంది సంగతేంటి? వాళ్లందరూ ఓడలో వెళ్లారని వాళ్ల కుటుంబ సభ్యులు చెప్పారు. పైగా వాళ్లెవరూ ఎప్పుడూ ఇళ్లకు తిరిగా రాలేదు కూడాను. మరి అంతా అబద్ధమని, ఈ ఉదంతాన్ని భ్రమ అని ఎలా కొట్టి పారేయగలం?! ఈ ప్రశ్న దగ్గరే ప్రతిసారీ బ్రేక్ పడసాగింది. దాంతో ఈ ఓడ ఉదంతం నేటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement