ఈ సబ్బుతో పిశాచాల పీడ విరగడ!
ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే సబ్బుల గురించి మనకు తెలుసు. సూక్ష్మక్రిములను దూరం చేసే సబ్బులు, సుగంధాలను వెదజల్లే సబ్బుల గురించి తెలుసు. చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేసి యవ్వనకాంతితో మెరిపించే సబ్బుల గురించి కూడా తెలుసు. ఇలాంటి సబ్బులను తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. ‘ఇలాంటివి ఎవరైనా తయారు చేస్తారు.
వీటిలో వెరైటీ ఏముంది? మా కంపెనీ తయారు చేసే సబ్బును వాడితేనా... ఎంతటి పిశాచాలైనా పరారు కావాల్సిందే’ అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. న్యూ ఇంగ్లండ్ రాష్ట్రంలోని వెర్మంట్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవల కొత్త తరహా సబ్బును మార్కెట్‌లోకి తెచ్చింది. వెల్లుల్లి తైలం, పవిత్రజలం ఉపయోగించి తయారు చేసిన ఈ సబ్బు శాకినీ, ఢాకినీ, డ్రాకులా వంటి సమస్త భూతప్రేత పిశాచాదులను దూరంగా ఉంచగలదని నమ్మకంగా చెబుతోంది.
రుద్దుకుంటే పోయేదేముంది ఒంటి మీద మురికి తప్ప అనుకునే వారు, దీని పనితీరును ప్రాక్టికల్‌గా చూడాలని ఉబలాటపడేవారు ఎగబడి మరీ ఆన్‌లైన్‌లో ఈ సబ్బును తెగ కొంటున్నారు. దీని ధర ఎంతో కాదు, పట్టుమని పది డాలర్లు (రూ.656) మాత్రమే.