
మనసుంటే ఏదీ వృథా కాదు!
మనం కొన్నిటిని వ్యర్థాలుగా భావిస్తాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వ్యర్థాల నుంచి కూడా విలువైన వస్తువుల్ని తయారు చేయొచ్చు.
వాయనం: మనం కొన్నిటిని వ్యర్థాలుగా భావిస్తాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వ్యర్థాల నుంచి కూడా విలువైన వస్తువుల్ని తయారు చేయొచ్చు. అందుకు ఉదాహరణే ఇవన్నీ!ఫొటో ఫ్రేమ్, వాల్ హ్యాంగింగ్, ఫ్లవర్‌వాజ్... చూడ్డానికి భలే ఉన్నాయి కదూ! వీటన్నిటినీ దేనితో చేశారో తెలుసా? స్ట్రాల తోటి! డ్రింక్స్ తాగేసిన తర్వాత స్ట్రాలన్నీ పడేయ కుండా వాటన్నిటినీ పోగేస్తే... ఇదిగో, ఇలాంటి అందమైన వస్తువులు తయారవుతాయి. అలాగని డ్రింకే తాగక్కర్లేదు.
స్ట్రాలు పెద్ద రేటు ఉండవు కాబట్టి ప్యాకెట్లు కొని తెచ్చుకోవచ్చు. వాటిని కావలసిన విధంగా కత్తిరించుకోవడం, గ్లూతో అతికించుకోవడం చాలా తేలిక. సూది, దారంతో కుట్టేందుకు కూడా వీలుంటుంది. ఎటు వంచినా తేలికగా వంగుతాయి కూడాను. అందుకే స్ట్రాలతో ఏం చేయాలన్నా తేలికే. ముందుగా ఏం చేయాలో నిర్ణయించుకుని, ఆపైన ఎన్ని స్ట్రాలు అవసరమౌతాయో లెక్క వేసుకోవాలి. వాటిని కావలసిన పరిమాణాల్లోకి కత్తిరించుకుని జాగ్రత్తగా అతికించుకోవాలి. ఏం చేయాలా అని మీరు సందేహ పడక్కర్లేకుండా కొన్ని మోడల్స్ ఇస్తున్నాం చూడండి!
చాక్లెట్ చిటికెలో కరుగుతుంది!
ఎంత పేచీ పెట్టే పిల్లలైనా చాక్లెట్ ఇవ్వగానే చప్పున సెలైంటయిపోతారు. పెద్దవాళ్లు కూడా చాక్లెట్ అంటే నోరు చప్పరిస్తారు. కేక్స్, కుకీస్ మీద కాసింత చాక్లెట్ కోటింగ్ ఇస్తే ఇక దాని రుచి చెప్పనే అక్కర్లేదు. అయితే అలా చేయాలంటే చాక్లెట్‌ను కరిగించాలి. ఆపైన దాన్ని నచ్చినదాంట్లో కలుపుకోవాలి, పైన అద్దుకోవాలి. కానీ మైక్రో అవన్ లేకపోతే కరిగించడం కాస్త కష్టమే. ఎందుకంటే మామూలు గిన్నెలో పోసి స్టౌ మీద కరిగించేటప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మరిగిపోవడమో, గిన్నెకు అంటుకుపోవడమో జరుగుతుంది. ఆ సమస్య తీరాలంటే ఈ ‘చాక్లెట్ మెల్టింగ్ పాట్’ ఉండి తీరాలి!
మార్కెట్లో దొరికే ముడి చాక్లెట్‌ను తీసుకొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. వాటిని ఈ మెల్టింగ్ పాట్‌లో వేసి, కాసిని పాలు పోసి స్టౌ మీద పెడితే చాలు... క్షణాల్లో కరిగిపోతుంది. హీట్ అడ్జస్ట్‌మెంట్ సిస్టమ్ ఉండటం వల్ల అతిగా కరగదు. పాట్ తయారీలోని ప్రత్యేకత వల్ల అడుగుకు అంటుకుపోదు. దీని ప్రారంభ ధర రెండు వేల వరకూ ఉంది. రెడిఫ్ సైట్లో అయితే పన్నెండొందలకే లభిస్తోంది!